Sri Lanka Crisis: రాజపక్స రాజీనామా

ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ద్వీపదేశం శ్రీలంకలో సోమవారం అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. దేశవ్యాప్తంగా పెల్లుబుకుతున్న నిరసన జ్వాలలకు ప్రధానమంత్రి మహీంద రాజపక్స తలొగ్గి... ఎట్టకేలకు తన పదవికి రాజీనామా చేశారు. అంతకుముందు- ఆయన మద్దతుదారులు, నిరసనకారుల మధ్య చెలరేగిన ఘర్షణలు తీవ్ర హింసాత్మకంగా మారాయి. వాటిలో 174 మంది గాయపడ్డారు. నిట్టంబువ పట్టణంలో చోటుచేసుకున్న ఘర్షణలు అధికార పార్టీకి చెందిన ఎంపీ అమరకీర్తి అథూకోరలా ఆత్మహత్యకు దారితీయడం సంచలనం సృష్టించింది. అక్కడ మరో ఇద్దరూ మృత్యువాతపడ్డారు.

Updated : 10 May 2022 05:23 IST

ఘర్షణలకు తలొగ్గిన శ్రీలంక ప్రధాని
అల్లర్లతో అట్టుడికిన ద్వీపదేశం
పాలకపక్ష ఎంపీ ఆత్మహత్య, మరో ఇద్దరి మృతి
174 మందికి గాయాలు
దేశమంతటా కర్ఫ్యూ

కొలంబో: ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ద్వీపదేశం శ్రీలంకలో సోమవారం అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. దేశవ్యాప్తంగా పెల్లుబుకుతున్న నిరసన జ్వాలలకు ప్రధానమంత్రి మహీంద రాజపక్స తలొగ్గి... ఎట్టకేలకు తన పదవికి రాజీనామా చేశారు. అంతకుముందు- ఆయన మద్దతుదారులు, నిరసనకారుల మధ్య చెలరేగిన ఘర్షణలు తీవ్ర హింసాత్మకంగా మారాయి. వాటిలో 174 మంది గాయపడ్డారు. నిట్టంబువ పట్టణంలో చోటుచేసుకున్న ఘర్షణలు అధికార పార్టీకి చెందిన ఎంపీ అమరకీర్తి అథూకోరలా ఆత్మహత్యకు దారితీయడం సంచలనం సృష్టించింది. అక్కడ మరో ఇద్దరూ మృత్యువాతపడ్డారు. పరిస్థితులు చేయిదాటిపోతుండటంతో దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధిస్తున్నట్లు అధికారవర్గాలు ప్రకటించాయి. రాజధాని కొలంబోలో సైనిక బలగాలను మోహరించాయి. మహీంద రాజీనామాతో కేబినెట్‌ కూడా రద్దయింది. దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్స, ప్రధాని మహీందల రాజీనామాను డిమాండ్‌ చేస్తూ గత నెల 9నుంచి వేల మంది నిరసనకారులు వీధుల్లో కదంతొక్కుతున్నారు. కొలంబోలో వారిద్దరి నివాసాల ఎదుట బైఠాయించి నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి అధికార గృహమైన టెంపుల్‌ ట్రీస్‌కు ఎదురుగా ‘మైనాగోగామా’ పేరుతో, గొటబాయ నివాసం వద్ద ‘గొటగోగామా’ పేరుతో వారు శిబిరాలను ఏర్పాటుచేసుకున్నారు. అధికార శ్రీలంక పొడుజానా పేరామునా (ఎస్‌ఎల్‌పీపీ) పార్టీ కార్యకర్తలు, మహీంద మద్దతుదారులు ఈ శిబిరాలపై సోమవారం విరుచుకుపడ్డారు. ‘మైనాగోగామా’ టెంట్లను కూల్చివేశారు. నిరసనకారులపై దాడికి దిగారు. ‘గొటగోగామా’ వద్ద ఎస్‌ఎల్‌పీపీ కార్యకర్తలను అడ్డుకునేందుకు పోలీసులు మానవహారంగా ఏర్పడినా ప్రయోజనం లేకపోయింది. వారిని తోసుకుంటూ వందలమంది ముందుకు దూసుకెళ్లి.. ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులపై దాడి చేశారు. అధికార పార్టీ మద్దతుదారులను చెదరగొట్టేందుకు పోలీసులు జలఫిరంగులను ప్రయోగించారు. ఈ ఘర్షణల్లో 174 మంది గాయపడ్డారు. వారిలో 78 మంది ఆసుపత్రిపాలయ్యారు. స్పందించిన అధికారవర్గాలు.. తొలుత కొలంబోలో కర్ఫ్యూ ప్రకటించాయి. అనంతరం దేశమంతటికీ దాన్ని విస్తరిస్తున్నట్లు ప్రకటించాయి. పోలీసులకు సెలవులను రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులు వెలువడ్డాయి. ‘గొటగోగామా’ వద్ద పరిస్థితులను సమీక్షించేందుకు ప్రతిపక్ష సమాగి జన బలవేగయా పార్టీనేత సాజిత్‌ ప్రేమదాస వెళ్లగా..ఆయనపైకూడా దాడిచోటుచేసుకుంది. మహీంద తన మద్దతుదారులను ప్రేమదాసపైకి పురిగొల్పారని ప్రతిపక్షనేతలు ఆరోపించారు. మరోవైపు- హంబన్‌టోటలో గొటబాయ,మహీందల పూర్వీకుల ఇంటిని నిరసనకారులుతగలబెట్టారు.

అఖిలపక్ష ప్రభుత్వం ఏర్పాటు కోసమే..: మహీంద

నిరసనకారులపై తన మద్దతుదారులు దాడి చేసిన తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే ప్రధాని పదవికి మహీంద (76) రాజీనామా చేశారు. తాత్కాలిక అఖిలపక్ష ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం చేసేందుకే తాను పదవిని వీడుతున్నట్లు ట్విటర్‌ వేదికగా తెలిపారు.

రివాల్వర్‌తో కాల్చుకొని..

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టినవారిపై దాడులు చోటుచేసుకోవడం దేశవ్యాప్తంగా ప్రజలకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. పలు ప్రాంతాల్లో మహీంద మద్దతుదారుల వాహనాలను ఆపి జనం దాడి చేశారు. నిట్టంబువా పట్టణంలో పొలన్నరువా జిల్లాకు చెందిన ఎస్‌ఎల్‌పీపీ ఎంపీ అమరకీర్తి అథూకోరలా(57) కనిపించడంతో కోపంతో ఊగిపోయారు. ఆయన కారును చుట్టుముట్టారు. దీంతో వారిపై అమరకీర్తి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు గాయపడటంతో జనం కోపంతో ఊగిపోయారు. అమరకీర్తి కారును బోర్లాపడేశారు. ఆయన అక్కడి నుంచి పారిపోయి.. ఓ భవనంలో దాక్కున్నారు. ఆ భవనాన్ని వేలమంది చుట్టుముట్టడంతో.. అమరకీర్తి రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. తాము వెళ్లేసరికి ఎంపీ, ఆయన వ్యక్తిగత భద్రత అధికారి శవమై కనిపించారని పోలీసులు తెలిపారు. అమరకీర్తి కాల్పుల్లో గాయపడ్డ 27ఏళ్ల ఓ వ్యక్తి కూడా మృత్యువాతపడ్డారు. మరోవైపు- కొలంబోలో మాజీమంత్రి జాన్‌స్టన్‌ ఫెర్నాండో కార్యాలయాలు, మాజీమంత్రి నిమ్‌లాంజా, మొరాటువా మేయర్‌ సమన్‌లాల్‌ ఫెర్నాండో, అధికార పార్టీనేత కహందగమగెల నివాసాలపైనా దాడులుజరిగాయి. మైనాగొగామా, గొటగోగామా శిబిరాలపై దాడులకు కహందగమగె నేతృత్వం వహిస్తూ కనిపించడం గమనార్హం.

సంయమనం పాటించండి: గొటబాయ

తాజా ఘర్షణలను దేశాధ్యక్షుడు గొటబాయ ఖండించారు. సంయమనం పాటించాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. ‘‘ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న సమస్యలు హింసతో పరిష్కారం కావు. శాంతంగా ఉండండి. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు కలిసికట్టుగా కృషిచేద్దాం’’ అని ఆయన ట్వీట్‌ చేశారు. గత శుక్రవారం కేబినెట్‌ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించిన గొటబాయ.. దేశంలో అత్యయిక స్థితిని ప్రకటించిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని