PM Modi: 26న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈనెల 26న రాష్ట్ర పర్యటనకు రానున్నారు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఐఎస్‌బీ వార్షికోత్సవంలో ఆయన పాల్గొంటారు. ఈ పర్యటన నేపథ్యంలో ప్రధానికి ఘనస్వాగతం పలకడంతో పాటు సీనియర్‌ నేతలతో

Updated : 19 May 2022 07:31 IST

ఐఎస్‌బీ వార్షికోత్సవానికి హాజరు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈనెల 26న రాష్ట్ర పర్యటనకు రానున్నారు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఐఎస్‌బీ వార్షికోత్సవంలో ఆయన పాల్గొంటారు. ఈ పర్యటన నేపథ్యంలో ప్రధానికి ఘనస్వాగతం పలకడంతో పాటు సీనియర్‌ నేతలతో భేటీకి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రయత్నిస్తున్నారు. అనుమతి కోసం ప్రధానమంత్రి కార్యాలయాని(పీఎంవో)కి సమాచారం పంపించారు. పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై నేతలతో బుధవారం చర్చించారు. బేగంపేటలో పార్టీ నేతలు ప్రధానమంత్రిని కలిసేలా రిసెప్షన్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మరోవైపు ఈనెల 26న రామగుండంలోని ఎరువుల ఫ్యాక్టరీని ప్రధానితో ప్రారంభింపజేసే కార్యక్రమానికి సన్నాహాలు జరిగాయి. అదేవిధంగా హైదరాబాద్‌ శివారు జినోంవ్యాలీలో నిర్మాణం పూర్తయిన జాతీయ జంతు వనరుల సౌకర్యం, జీవ వైద్య పరిశోధన సంస్థ (నేషనల్‌ యానిమల్‌ రిసోర్స్‌ ఫెసిలిటీ ఫర్‌ బయోమెడికల్‌ రీసెర్చ్‌)నూ ప్రధాని ప్రారంభించాలని  పీఎంఓకు ప్రతిపాదనలు వెళ్లినట్లు సమాచారం. ఈ రెండింటిపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఐఎస్‌బీ కార్యక్రమం తర్వాత ప్రధాని చెన్నైకి వెళ్తారని భాజపా వర్గాల సమాచారం. సంజయ్‌ యాత్ర సందర్భంగా సభలకు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హాజరయ్యారు. ఇప్పుడు ప్రధాని 26న వస్తున్నారు. మూడు వారాల వ్యవధిలో ముగ్గురు అగ్రనేతల రాష్ట్ర పర్యటనతో కాషాయదళంలో నూతన ఉత్సాహం నెలకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని