ఖజానాకు ‘కిక్‌’

రాష్ట్రంలో పెరిగిన మద్యం ధరల ప్రకారం గురువారం నుంచే విక్రయాలు ప్రారంభమయ్యాయి. ధరల పెంపుతో ప్రస్తుత ఎక్సైజ్‌ పాలసీలో ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.10-12 వేల కోట్ల అదనపు ఆదాయం లభిస్తుందని అంచనా వేస్తున్నారు. మద్యం రకాలను బట్టి రూ.20 నుంచి రూ.160 వరకు పెంచుతూ రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.

Published : 20 May 2022 06:07 IST

పెరిగిన మద్యం ధరలతో 12 వేల కోట్ల దాకా అదనపు ఆదాయం?
అమలులోకి వచ్చిన కొత్త రేట్లు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో పెరిగిన మద్యం ధరల ప్రకారం గురువారం నుంచే విక్రయాలు ప్రారంభమయ్యాయి. ధరల పెంపుతో ప్రస్తుత ఎక్సైజ్‌ పాలసీలో ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.10-12 వేల కోట్ల అదనపు ఆదాయం లభిస్తుందని అంచనా వేస్తున్నారు. మద్యం రకాలను బట్టి రూ.20 నుంచి రూ.160 వరకు పెంచుతూ రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 2019-21 మద్యం విధానం ద్వారా సుమారు రూ.30 వేల కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. దీంతో ఖజానాకు ఎక్సైజ్‌ పన్నుల రూపంలో దాదాపు రూ.12 వేల కోట్ల ఆదాయం వచ్చింది. 2021-23 మద్యం విధానంలో సుమారు రూ.60 వేల కోట్ల మద్యం విక్రయాలు జరుగుతాయని భావిస్తున్నారు. గతేడాది డిసెంబరు నుంచి కొత్త మద్యం విధానం అమల్లోకి వచ్చింది. అయితే, ఈ విధానం అమలులోకి వచ్చిన తరవాత ఒకేసారి ఇంతమొత్తంలో ధరలను పెంచడంపట్ల వ్యాపారుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కువగా విక్రయాలు జరిగే ఆర్డినరీ మద్యం(చీప్‌ లిక్కర్‌) క్వార్టర్‌ బాటిల్‌ ధరలను పెంచడం వల్ల తాము మార్జిన్‌ కోల్పోతామని మద్యం వ్యాపారులు వాపోతున్నారు. మొత్తం మద్యం విక్రయాల్లో 40-50 శాతం వీటి అమ్మకాలే ఉంటాయి. సాధారణంగా రూ.100లోపు ధర ఉన్న(క్వార్టర్‌) మద్యం విక్రయాలపై వ్యాపారులకు 27 శాతం మార్జిన్‌ వచ్చేది. ప్రస్తుతం క్వార్టర్‌ బాటిల్‌ ధరను పెంచడంతో మార్జిన్‌ 20శాతానికి పడిపోయే అవకాశముందని వ్యాపారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం పెరిగిన ధరల్ని స్పెషల్‌ ఎక్సైజ్‌ ట్యాక్స్‌ పెంపుదలగా చూపిన కారణంగానూ తమకు మార్జిన్‌ రాకుండాపోతుందని వ్యాపారవర్గాలు వాపోతున్నాయి. ఆర్డినరీ మద్యం క్వార్టర్‌ బాటిల్‌ ధరల పెరుగుదల అమ్మకాలపై ప్రభావం చూపుతుందని వైన్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలాఉండగా.. బుధవారం రాత్రి విక్రయాలు ముగిసిన తర్వాత సరకు నిల్వల్ని లెక్కించేందుకు ఎక్సైజ్‌ అధికారులు వైన్స్‌లు, బార్లు, పబ్‌లను సీజ్‌ చేశారు. గురువారం సరకు లెక్కింపు సందర్భంగా ఎక్సైజ్‌ వర్గాలు పలువురు వ్యాపారులతో బేరసారాలు సాగించాయన్న ఆరోపణలు వినిపించాయి. సరకు నిల్వల్ని తగ్గించి చూపేందుకు ప్రయత్నాలు చేశారన్న ప్రచారం సాగింది.


ఏ రకంపై ఎంత..?

* బ్రాండ్లతో నిమిత్తం లేకుండా, పరిమాణంతో సంబంధం లేకుండా బీర్లపై రూ.10 చొప్పున ధర పెరిగింది. వైన్‌ ఫుల్‌ బాటిల్‌ ధర రూ.40 పెంచారు.
* క్వార్టర్‌ బాటిల్‌ ధర రూ.200లోపు ఉండే ఆర్డినరీ, మీడియం మద్యంపై ఓ రకంగా, అంతకంటే ఎక్కువ ధర ఉండే ప్రీమియం మద్యం బ్రాండ్లపై మరోరకంగా ధర పెరిగింది. ఆర్డినరీ, మీడియం మద్యం క్వార్టర్‌పై రూ.20, హాఫ్‌ బాటిల్‌పై రూ.40, ఫుల్‌ బాటిల్‌పై రూ.80 పెంచారు. ప్రీమియం బ్రాండ్ల క్వార్టర్‌పై రూ.40, హాఫ్‌ బాటిల్‌పై రూ.80, ఫుల్‌ బాటిల్‌పై రూ.160 పెరిగింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని