CM KCR: సీఎం కేసీఆర్‌ దేశవ్యాప్త పర్యటన

జాతీయ స్థాయిలో పలు రాజకీయ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుక్రవారం నుంచి దేశవ్యాప్తంగా పర్యటించనున్నారు. ఇందులో భాగంగా రాజకీయ, అర్థిక, మీడియా రంగాలకు చెందిన ప్రముఖులతో సమావేశమవుతారు. దేశం కోసం వీర మరణం పొందిన సైనిక కుటుంబాలను ఆదుకోనున్నారు. జాతీయ రైతు ఉద్యమంలో అసువులు బాసిన అన్నదాతల కుటుంబాలను పరామర్శించనున్నారు.

Published : 20 May 2022 06:07 IST

నేటి నుంచి ఎనిమిది రోజుల పాటు కార్యక్రమాలు
రైతు ఉద్యమంలో కన్నుమూసిన అన్నదాతల కుటుంబాలకు పరామర్శ..
దిల్లీ, పంజాబ్‌ సీఎంలు కేజ్రీవాల్‌, భగవంత్‌లతో కలిసి చెక్కుల పంపిణీ
అన్నాహజారే, దేవేగౌడలతో సమావేశాలు

ఈనాడు, హైదరాబాద్‌: జాతీయ స్థాయిలో పలు రాజకీయ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుక్రవారం నుంచి దేశవ్యాప్తంగా పర్యటించనున్నారు. ఇందులో భాగంగా రాజకీయ, అర్థిక, మీడియా రంగాలకు చెందిన ప్రముఖులతో సమావేశమవుతారు. దేశం కోసం వీర మరణం పొందిన సైనిక కుటుంబాలను ఆదుకోనున్నారు. జాతీయ రైతు ఉద్యమంలో అసువులు బాసిన అన్నదాతల కుటుంబాలను పరామర్శించనున్నారు.

నేడు దిల్లీకి..

ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుక్రవారం మధ్యాహ్నం దిల్లీకి బయల్దేరి వెళతారు. అక్కడ వివిధ రాజకీయ పార్టీల నేతలతో, ప్రముఖ ఆర్థికవేత్తలతో సమావేశమవుతారు. ఈ సందర్భంగా దేశ ఆర్థిక పరిస్థితులపై చర్చించనున్నారు. జాతీయ మీడియా సంస్థల ప్రముఖులతోనూ సమావేశాలు నిర్వహిస్తారు. 22న మధ్యాహ్నం.... దిల్లీ నుంచి చండీగఢ్‌ వెళ్తారు. రైతు ఉద్యమంలో కన్నుమూసిన పంజాబ్‌, హరియాణా ఉత్తర్‌ ప్రదేశ్‌, దిల్లీ రాష్ట్రాలకు చెందిన సుమారు 600 మంది కుటుంబాలను ఆయన పరామర్శిస్తారు.ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున చెక్కులు పంపిణీ చేస్తారు.ఈ కార్యక్రమాన్ని...దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌లతో కలిసి నిర్వహిస్తారు. 26న ఉదయం... బెంగళూరు వెళ్లనున్నారు. అక్కడ మాజీ ప్రధాని దేవేగౌడ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిలతో సమావేశమవుతారు. మే 27న రాలేగావ్‌ సిద్ధి వెళ్లి ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారేతో భేటీ అవుతారు. అక్కడి నుంచి శిరిడీ వెళ్లి సాయిబాబాను దర్శించుకుని హైదరాబాద్‌కు తిరిగొస్తారు. ఆ తర్వాత మే 29 లేదా 30న పశ్చిమ బెంగాల్‌, బిహార్‌ రాష్ట్రాల పర్యటనకు ఆయన సంసిద్ధం కానున్నారు. గల్వాన్‌ లోయలో వీరమరణం పొందిన భారత సైనిక కుటుంబాలను సీఎం పరామర్శిస్తారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విధంగా వారి కుటుంబాలనూ ఆదుకోనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని