ఈ యాప్‌.. అంధులకు కంటిచూపు!

అంధులు ఉపయోగించేందుకు వీలుగా...వివిధ సాఫ్ట్‌వేర్‌ సంస్థలు ఇప్పటికే పలు యాప్‌లకు రూపకల్పన చేశాయి. మానవీయ కోణంలో ఆయా సంస్థలు ఉచితంగా వీటి సేవలను అందిస్తున్నాయి. ‘గూగుల్‌ లుక్‌ అవుట్‌’ ‘మనీ అప్లికేషన్‌’ ‘స్క్రీన్‌ రీడర్‌’ లాంటి యాప్‌లను ప్రత్యేకంగా అంధుల కోసం రూపొందించారు.

Published : 20 May 2022 06:04 IST

కార్యాలయాలు, మాల్స్‌.. ఎక్కడైనా వాడొచ్చు
ఎల్‌వీపీ నేత్ర వైద్య సంస్థ ఆధ్వర్యంలో రూపకల్పన

ఈనాడు, హైదరాబాద్‌: అంధులు ఉపయోగించేందుకు వీలుగా...వివిధ సాఫ్ట్‌వేర్‌ సంస్థలు ఇప్పటికే పలు యాప్‌లకు రూపకల్పన చేశాయి. మానవీయ కోణంలో ఆయా సంస్థలు ఉచితంగా వీటి సేవలను అందిస్తున్నాయి. ‘గూగుల్‌ లుక్‌ అవుట్‌’ ‘మనీ అప్లికేషన్‌’ ‘స్క్రీన్‌ రీడర్‌’ లాంటి యాప్‌లను ప్రత్యేకంగా అంధుల కోసం రూపొందించారు. వీటికి భిన్నంగా తాజాగా ఎల్వీ ప్రసాద్‌ నేత్ర వైద్య సంస్థ ఒక ప్రత్యేక యాప్‌ను తయారు చేసింది. ప్రస్తుతం ఆసుపత్రిలో కొన్ని ప్రాంతాల్లో అంధుల కోసం దీనిని ప్రయోగాత్మకంగా వినియోగిస్తోంది. విజయవంతం కావడంతో ఇతర ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు ఈ సేవలు విస్తరించడానికి సమాయత్తమవుతోంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. గురువారం ఆసుపత్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వైద్యులు ఈ యాప్‌ (స్పేస్‌ఫెల్ట్‌) సేవల గురించి వివరించారు.

ఇవీ విశేషాలు...
* బహిరంగ ప్రాంతాలకు అంధులు వెళ్లేటప్పుడు ఇబ్బందులు పడుతుంటారు. చేతిలో మొబిలిటీ కేన్‌(స్టిక్‌) ఉన్నప్పటికీ ఇతర సమాచారం కోసం ఎవరిపైనైనా ఆధారపడక తప్పదు. స్పేస్‌ఫెల్ట్‌ యాప్‌తో ఎవరి సహాయం లేకుండానే అంధులు ఎక్కడైనా తిరిగే వీలు ఏర్పడనుంది.
* ఈ యాప్‌ను స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకొని ఉపయోగించుకోవచ్చు. అయితే ముందుగా ఆయా సంస్థలు ఈ యాప్‌ కింద నమోదు చేసుకోవాలి.
* తద్వారా ఆయా కార్యాలయం లేదంటే షాపింగ్‌ మాల్‌లో ఉన్న ప్రదేశాలను యాప్‌తో అనుసంధానం చేస్తారు. అక్కడి విశేషాలు...ప్రత్యేకతలను ముందే యాప్‌లో రికార్డు చేస్తారు. ఇలా సమాచారం అంతా నిక్షిప్తం చేసి ఒక ప్యాకేజీగా రూపొందిస్తారు. అక్కడ అన్ని ప్రాంతాల్లో ఒక క్యూఆర్‌ కోడ్‌ అందుబాటులో ఉంచుతారు.
* ప్యాకేజి అందుబాట్లో ఉన్న ప్రదేశాలకు అంధులు వెళ్లినప్పుడు వెంటనే వారి ఫోన్‌కు ఒక బీప్‌ సౌండ్‌తో నోటిఫికేషన్‌ వస్తుంది. దీంతో ఆ సంస్థకు సంబంధించి ప్యాకేజీని డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.
* అనంతరం క్యూఆర్‌ కోడ్‌ స్కానర్‌తో అక్కడ ఉన్న అన్ని ప్రాంతాల్లో సులువుగా సంచరించవచ్చు.
* ఇలా ఈ సేవలను ఎక్కడైనా వినియోగించుకునే వీలుందని వైద్యులు తెలిపారు. మాల్స్‌, విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, పార్కులు, ఆసుపత్రులు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో ఉపయోగపడుతుందని చెప్పారు. రైలు ఎక్కేటప్పుడు క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి బోగి ఎక్కడ ఉంది...రిజర్వు అయిన సీటు నంబరు తదితర వివరాలను తెలుసుకుని అంధులు సులువుగా ప్రయాణం చేయవచ్చు. ఎవరి సహాయం అవసరం ఉండదని ఎల్వీ ప్రసాద్‌ పునరావాస సేవల పరిశోధన కేంద్రం ఇన్‌ఛార్జి డాక్టర్‌ బ్యూలా క్రిస్టీ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని