Telangana News: యూనిఫాం పోస్టుల వయోపరిమితి పెంపు

రాష్ట్రంలో యూనిఫాం ఉద్యోగాలకు పోటీపడుతున్న నిరుద్యోగులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. గరిష్ఠ వయోపరిమితిని మరో రెండేళ్లు పెంచింది. మరోవైపు గ్రూపు-1లో డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీసు (డీఎస్పీ) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల ఎత్తు అర్హత

Updated : 21 May 2022 07:25 IST

మరో రెండేళ్ల సడలింపు
కానిస్టేబుల్‌ పోస్టుకు 27 ఏళ్లు, ఎస్సైకి 30, డీఎస్పీలకు 33 సంవత్సరాలు
దరఖాస్తు గడువు 26 వరకు పెంపు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో యూనిఫాం ఉద్యోగాలకు పోటీపడుతున్న నిరుద్యోగులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. గరిష్ఠ వయోపరిమితిని మరో రెండేళ్లు పెంచింది. మరోవైపు గ్రూపు-1లో డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీసు (డీఎస్పీ) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల ఎత్తు అర్హత 167 సెంటీమీటర్ల నుంచి 165కు తగ్గించాలని కూడా సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) సోమేశ్‌కుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వయోపరిమితి పెంచుతూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దరఖాస్తు గడువును కూడా సర్కారు పెంచింది. వాస్తవానికి యూనిఫాం ఉద్యోగాల దరఖాస్తుకు గడువు శుక్రవారం రాత్రి 10 గంటలతో ముగిసింది. రెండేళ్లు సడలింపు నేపథ్యంలో మరింత మంది దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా గడువును ఈనెల 26వ తేదీ రాత్రి 10 గంటల వరకు పోలీసు నియామక మండలి పొడిగించింది. యూనిఫాం ఉద్యోగాలకు సంబంధించి ఇప్పటికే మూడేళ్ల సడలింపు ఇవ్వగా, తాజా నిర్ణయంతో మొత్తం సడలింపు అయిదేళ్లకు పెరిగింది.
* కానిస్టేబుల్‌ ఉద్యోగాల ఎంపికకు కనిష్ఠ వయసు 18 సంవత్సరాలు(జులై1, 2022 నాటికి) కాగా సాధారణ కేటగిరీలో గరిష్ఠ వయోపరిమితి 22గా ఉంది. నోటిఫికేషన్‌ సందర్భంలో మూడేళ్ల సడలింపు ఇవ్వడంతో గరిష్ఠ వయసు 25 అయింది. తాజాగా రెండేళ్ల సడలింపుతో ఇది 27 ఏళ్లు అవుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ రిజర్వుడ్‌ అభ్యర్థులకు మరో అయిదేళ్లు సడలింపు ఉన్న నేపథ్యంలో గరిష్ఠ వయోపరిమితి 32 ఏళ్లు.
*  ఎస్సై ఉద్యోగాల ఎంపికకు కనిష్ఠ వయసు 21 సంవత్సరాలు (జులై1, 2022 నాటికి) కాగా సాధారణ కేటగిరీరిలో గరిష్ఠ వయోపరిమితి 25గా ఉంది. అది ఇప్పుడు 30 ఏళ్లు అవుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ రిజర్వుడ్‌ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి 35 ఏళ్లు.
*  డీఎస్పీ పోస్టులకు కనిష్ఠ వయోపరిమితి 21 ఏళ్లు కాగా(జులై1, 2022 నాటికి).. సాధారణ కేటగిరీలో గరిష్ఠ వయోపరిమితి 28 ఏళ్లుగా ఉంది. ఇప్పుడది 33 ఏళ్లు అవుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ రిజర్వుడ్‌ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి 33నుంచి 38ఏళ్లకు పెరుగుతుంది.  
పోలీస్‌ నియామక మండలి మొత్తం 17వేలకు పైగా పోలీసు కానిస్టేబుల్‌, ఎస్సై, రవాణా, ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాలను భర్తీచేస్తున్న విషయం విదితమే. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారందరికీ సడలింపు వర్తిస్తుంది. పొరుగు రాష్ట్రాలతో సమానంగా రాష్ట్రంలో యూనిఫాం పోస్టులకు వయోపరిమితి నిర్ణయించాలంటున్న నిరుద్యోగుల డిమాండ్‌ను ఎమ్మెల్సీ పల్లారాజేశ్వర్‌రెడ్డి తాజాగా సీఎంకు వివరించారు. రెండేళ్ల వయోపరిమితి పెంచాలని కోరారు. రాష్ట్రంలో 95 శాతం స్థానికత అమలవుతోందని, రెండేళ్లుగా కరోనా తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని యువతకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.ఈ మేరకు వయోపరిమితిని పొడిగిస్తూ సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశించడంతో సీఎస్‌ వెంటనే స్పందించారు.

డీఎస్పీలు అర్హత ఎత్తు 167 సెం.మీ. నుంచి 165కు తగ్గింపు
పలువురు గ్రూప్‌1 అభ్యర్థులు కూడా ముఖ్యమంత్రిని కలిశారు. గ్రూపు-1లో డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీసు (డీఎస్పీ) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల ఎత్తు అర్హత 167 సెంటీమీటర్ల నుంచి 165కు తగ్గించాలని విన్నవించారు. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ నిర్వహించే పరీక్షలో ఐపీఎస్‌ అభ్యర్థుల అర్హత ఎత్తు 165 సెంటీమీటర్లే ఉందని వివరించారు. దీంతో రెండు సెం.మీ. అర్హత ఎత్తు తగ్గింపునకు సీఎం అంగీకరించి ఆదేశాలిచ్చారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి డీఎస్పీ అభ్యర్థులకు అర్హత ఎత్తు 167 సెంటీమీటర్లుగా ఉంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో 165 సెం.మీ. ఎత్తుగల వారికీ అవకాశం లభిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని