సినిమాలు మంచి మార్గాన్ని చూపాలి

సినిమాలు వినోదం పంచడంతో పాటు మంచి మార్గాన్ని, విలువైన విజ్ఞానాన్ని అందించేలా ఉండాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అర్థవంతమైన సినిమాలు రావాలని ఆయన ఆకాంక్షించారు.

Published : 21 May 2022 06:11 IST

హింస, అశ్లీలతకు తావుండొద్దు
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

మాదాపూర్‌, న్యూస్‌టుడే: సినిమాలు వినోదం పంచడంతో పాటు మంచి మార్గాన్ని, విలువైన విజ్ఞానాన్ని అందించేలా ఉండాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అర్థవంతమైన సినిమాలు రావాలని ఆయన ఆకాంక్షించారు. సినిమాల్లో హింస, అశ్లీలత ఉండరాదని, శృంగారం శ్రుతి మించరాదని వెంకయ్యనాయుడు సూచించారు. శుక్రవారం సాయంత్రం తానా ప్రపంచ సాహిత్య వేదిక, సిరివెన్నెల కుటుంబం ఆధ్వర్యంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి జయంతిని హైదరాబాద్‌ మాదాపూర్‌లోని శిల్పకళావేదికలో నిర్వహించారు. ఈ సందర్భంగా సిరివెన్నెల సమగ్రసాహిత్యం పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి ఆవిష్కరించి మాట్లాడారు. ‘ఒకప్పుడు మాయాబజార్‌ లాంటి సినిమాలు వంద రోజులు ఆడాయి, ఇప్పుడు వస్తున్న కొన్ని సినిమాలు ఫస్ట్‌షో తరువాత షో ఉంటుందో.. లేదో కూడా తెలియడం లేదు. మంచి సినిమా తీసే వారిని, మంచి పాటలు రాసే వారిని ప్రోత్సహించాలి. సినిమా పాటను ఆర్థికంగా కాకుండా అర్థవంతంగా రాసిన గొప్ప వ్యక్తి సిరివెన్నెల సీతారామశాస్త్రి. భాషతో పాటు విషయ ప్రావీణ్యం ఉన్న ఆయన రాసిన పాటలు వింటుంటే మనసు ఆనందడోలికల్లో తేలియాడుతుంది. సిరివెన్నెలతో నాకు చిన్నప్పటి నుంచి స్నేహం ఉంది’ అన్నారు. సినీ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. కవి పాడుతున్నప్పుడు విని ఆనందించడంలో ఎంతో గొప్ప విలాసం ఉందని..అలాంటి విలాసాన్ని సిరివెన్నెల దగ్గర పొందానన్నారు. ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు మాట్లాడుతూ.. సిరివెన్నెల సమగ్ర సాహిత్య సంపుటి పుస్తకంలోని 680 పేజీల్లోని ప్రతి పాటను తాను పూర్తిగా చదివానని, అందులో గొప్ప సాహిత్యం ఉందన్నారు. కార్యక్రమంలో తానా అధ్యక్షులు లావు అంజయ్యచౌదరి, మాజీ అధ్యక్షులు  తోటకూర ప్రసాద్‌ తదితరులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని