అంతర్రాష్ట్ర మార్గాలు మరింత సుగమం

దేశంలోని వివిధ రాష్ట్రాలతో తెలంగాణ రహదారి అనుసంధానత మరింత విస్తరించనుంది. వివిధ రాష్ట్రాల మధ్య సరకు, ప్రజారవాణాను మరింత పెంచేందుకు ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి గతిశక్తి పథకంతో తెలంగాణలోని అయిదు జాతీయ రహదారుల విస్తరణకు మార్గం సుగమమైంది

Updated : 21 May 2022 05:46 IST

తెలంగాణలో 848 కిలోమీటర్ల మేర అనుసంధానత
రూ. 24,053 కోట్లతో రహదారుల విస్తరణ
పీఎం గతిశక్తి పథకంలో అయిదు దారులు
ఈనాడు - హైదరాబాద్‌

దేశంలోని వివిధ రాష్ట్రాలతో తెలంగాణ రహదారి అనుసంధానత మరింత విస్తరించనుంది. వివిధ రాష్ట్రాల మధ్య సరకు, ప్రజారవాణాను మరింత పెంచేందుకు ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి గతిశక్తి పథకంతో తెలంగాణలోని అయిదు జాతీయ రహదారుల విస్తరణకు మార్గం సుగమమైంది. ఈ దిశగా కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ప్రణాళిక రూపొందించింది. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి తెలంగాణ మీదుగా వివిధ రాష్ట్రాలను అనుసంధానిస్తూ ఉన్న రహదారులను ఎక్స్‌ప్రెస్‌వేలుగా మార్చనుంది. ఆయా మార్గాల్లో సరకు రవాణా ఇప్పటికే భారీగా సాగుతోంది. ఈ రహదారుల విస్తరణతో రవాణా సదుపాయాలు మెరుగవనున్నాయి. కేంద్రం అధ్యయనం చేసి దేశంలో సరకు రవాణా పెద్ద ఎత్తున సాగే అయిదు మార్గాలను ఎంపిక చేసింది. వాటన్నిటినీ నాలుగు/ఆరు వరుసలకు విస్తరించనున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే రెండు నుంచి నాలుగు వరుసల రహదారులున్నాయి.

ఆర్థిక కారిడార్లు 

పీఎం గతిశక్తి పథకానికి ఎంపిక చేసిన మార్గాలను తెలంగాణలోని వివిధ ప్రాంతాల మీదుగా 848 కిలోమీటర్ల మేర విస్తరించనున్నారు. వీటి వ్యయ అంచనా రూ. 24,053 కోట్లు. వాటిలో నాగ్‌పుర్‌-విజయవాడ కారిడార్‌ కీలకం. మంచిర్యాల, వరంగల్‌, ఖమ్మం మీదుగా ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దునున్న విజయవాడ రహదారిలో ఇది విలీనమవుతుంది. అయిదు ప్యాకేజీలుగా ఈ విస్తరణ పనులు పూర్తి చేయనున్నారు. వరంగల్‌-ఖమ్మం, ఖమ్మం-విజయవాడ మార్గాల విస్తరణ ప్రణాళిక తుది దశలో ఉంది. ఈ కారిడార్‌లోని మంచిర్యాల-రేపల్లెవాడ మీదుగా మహారాష్ట్ర సరిహద్దు వరకు గతంలో చేపట్టిన విస్తరణ పనులను ఈ పథకంలో కలిపారు. సుమారు 95 కిలోమీటర్లున్న ఈ మార్గం పనులు ఈ ఏడాది డిసెంబరు నాటికి పూర్తి కానున్నాయి. మిగిలిన మూడు ప్యాకేజీల సవివర నివేదికలు త్వరలో కొలిక్కి రానున్నాయి. హైదరాబాద్‌-విశాఖపట్నం కారిడార్‌లోని 59 కిలోమీటర్లున్న సూర్యాపేట-ఖమ్మం రహదారి నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఖమ్మం నుంచి దేవరపల్లి రహదారి విస్తరణకు వీలుగా భూ సేకరణ కసరత్తు సాగుతోంది. తెలంగాణలోని బెల్లంపల్లి నుంచి మహారాష్ట్ర సరిహద్దు వరకు 65 కిలోమీటర్ల మేర విస్తరణకు వీలుగా అలైన్‌మెంటును కన్సల్టెన్సీ సంస్థ సిద్ధం చేస్తోంది. ఇండోర్‌-హైదరాబాద్‌ మార్గాన్ని మూడు ప్యాకేజీలుగా సిద్ధం చేస్తున్నారు.

ఎకనామిక్‌ కారిడార్‌ 

ఆర్థికంగా విస్తృత అవకాశాలున్న మార్గాలను కేంద్రం ఎకనామిక్‌ కారిడార్‌గా గుర్తించింది. రానున్న అయిదేళ్ల వ్యవధిలో ఈ మార్గాల్లో 25 శాతం మేర సరకు రవాణా పెరుగుతుందని అంచనా. తొలిదశలో దేశవ్యాప్తంగా తొమ్మిది వేల కిలోమీటర్ల మేర రహదారులను విస్తరించాలని నిర్ణయించింది. ఇందులో తెలంగాణలోని 548 కిలోమీటర్లను ఎంపిక చేసింది.


ఇంటర్‌ కారిడార్‌ రూట్‌ 

రెండు రాష్ట్రాలు లేదా రెండు కారిడార్ల మధ్య భారీగా ట్రాఫిక్‌ రద్దీ ఉన్న వాటిని ఇంటర్‌ కారిడార్‌ రూట్లుగా కేంద్రం గుర్తించింది. ఇందులో దేశవ్యాప్తంగా ఎనిమిది వేల కిలోమీటర్ల రహదారులను గుర్తించింది. తొలిదశలో ఆరు వేల కిలోమీటర్ల మేర విస్తరించాలని నిర్ణయించింది. ఇందులో తెలంగాణలోని మూడు వందల కిలోమీటర్ల మార్గాన్ని ఎంపిక చేసింది.


మార్చి నాటికి ప్రాంతీయ రింగ్‌ రోడ్డు పనులు ప్రారంభం! 

హైదరాబాద్‌ అవుటర్‌ రింగు రోడ్డు అవతల నుంచి నిర్మించనున్న ప్రాంతీయ రింగు రోడ్డు నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు జాతీయ రహదారుల సంస్థ కసరత్తు చేస్తోంది. వచ్చే ఏడాది మార్చి నాటికి గుత్తేదారును ఎంపిక చేసి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టాలన్న యోచనలో ఉంది. ప్రాంతీయ రింగు రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌)ను రెండు భాగాలుగా నిర్మించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. 158 కిలోమీటర్ల ఉత్తర భాగాన్ని తొలుత నిర్మించేందుకు అవసరమైన భూ సేకరణకు ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చింది. ఆ మేరకు భూసేకరణ నోటిఫికేషన్లు సైతం ఒకదాని తరవాత మరొకటి జారీ అవుతున్నాయి. తెలంగాణలో వచ్చే మార్చి నాటికి మొత్తం 715 కిలోమీటర్లకు సంబంధించిన రహదారుల విస్తరణ పనులు చేపట్టాలన్నది జాతీయ రహదారుల సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. వీటిలో ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంతో సహా పది మార్గాలున్నాయి. ఈ రహదారుల నిర్మాణానికి సుమారు రూ.28,615 కోట్ల వ్యయం అవుతుందన్నది అంచనా.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని