దేశానికే ఆదర్శంగా తెలంగాణ

దేశానికి తెలంగాణ అన్నింటా ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు తెలిపారు. తమ రాష్ట్రం అన్ని రంగాల్లో సాధించిన విజయాలు మొత్తం దేశానికి వన్నె తెస్తున్నాయని, మార్గనిర్దేశం చేస్తున్నాయని చెప్పారు.

Updated : 21 May 2022 06:01 IST

మా పాలనతోనే రాష్ట్రం ముందంజ
దేశం ముందుకు వెళ్లాలంటే విప్లవాత్మక సంస్కరణలు అవసరం
అవకాశాలను వినియోగించుకోండి
లండన్‌లో పారిశ్రామికవేత్తలతో మంత్రి కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: దేశానికి తెలంగాణ అన్నింటా ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు తెలిపారు. తమ రాష్ట్రం అన్ని రంగాల్లో సాధించిన విజయాలు మొత్తం దేశానికి వన్నె తెస్తున్నాయని, మార్గనిర్దేశం చేస్తున్నాయని చెప్పారు. ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలను ఆకర్షించే ఒక అద్భుత పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణ మారడానికి, దేశానికి ఆర్థికదన్నుగా నిలవడానికి తమ పరిపాలన, సంస్కరణలే ప్రధాన కారణమన్నారు. ప్రజలకు అత్యంత ఆవశ్యకమైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు, ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టు అయిన కాళేశ్వరాన్ని అతి తక్కువ సమయంలో నిర్మించిన తీరు చరిత్రాత్మకమని తెలిపారు. భారత్‌ ప్రపంచంతో పోటీపడి ముందుకు పోవాలంటే అద్భుతమైన, విప్లవాత్మకమైన పాలన సంస్కరణలు చేపట్టాలన్నారు. లండన్‌లోని భారతీయ రాయబార కార్యాలయం శుక్రవారం నెహ్రూ సెంటర్‌లో కేటీఆర్‌ గౌరవార్థం ఆత్మీయ సమావేశం నిర్వహించింది. డిప్యూటీ హై కమిషనర్‌ సుజిత్‌ జొయ్‌ ఘోష్‌, నెహ్రూ సెంటర్‌ డైరెక్టర్‌ అమిష్‌ త్రిపాఠి ఇతర ఉన్నతాధికారులు, కంపెనీల అధిపతులు, పారిశ్రామికవేత్తలు, ప్రవాసభారతీయులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి కేటీఆర్‌ ప్రసంగించారు. ‘‘ప్రపంచంలోని అనేక దేశాల జనాభా వృద్ధాప్యం వైపు నడుస్తుంటే, జనాభాలో అత్యధికంగా గల యువజనశక్తితో భారత్‌ అగ్రశ్రేణి దేశంగా మారేందుకు గొప్ప అవకాశం ఉంది. ప్రస్తుత విధానాలను సమగ్రంగా మార్చి... పెట్టుబడులకు స్నేహపూర్వక వాతావరణాన్ని ఏర్పాటు చేయడం, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించి పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించడం ద్వారా దేశాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. తెలంగాణ విజయ రహస్యమిదే. ఇదే స్ఫూర్తితో పురోగమిస్తున్నాం. ఎనిమిదేళ్ల ప్రాయం గల రాష్ట్రం ఇప్పుడు దేశానికి నాలుగో అతిపెద్ద ఆర్థిక వాటాదారుగా మారింది. దేశానికి వచ్చే ప్రతీ పారిశ్రామికవేత్త ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ సాధించిన విజయాలు రాష్ట్రానికే పరిమితం కావు. వాటిని భారతదేశ విజయాలుగా పరిగణించి, ప్రపంచానికి చాటాలి. వివిధ దేశాల్లో ఉన్న ప్రవాసభారతీయులు మాతృదేశ అభివృద్ధికి విశేష కృషి చేయాలి. బ్రిటన్‌ పారిశ్రామికవేత్తలకు భారత్‌లో, తెలంగాణలో చక్కటి అవకాశాలున్నాయి. వాటిని వినియోగించుకోవాలి. తద్వారా భారత్‌, బ్రిటన్‌ సంబంధాలను మరింత దృఢతరం చేయాలి’’ అని కేటీఆర్‌ సూచించారు. సమావేశంలో ఆహూతులు విద్య, ఉపాధి, దేశంలో జరుగుతున్న ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ఆర్థికాభివృద్ధి వంటి అనేక అంశాలపై అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. సమావేశంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌ పాల్గొన్నారు.


వేదాంత గ్రూపు ఛైర్మన్‌తో భేటీ

ప్రపంచ ప్రసిద్ధ వేదాంత గ్రూపు ఛైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌తో మంత్రి కేటీఆర్‌ శుక్రవారం లండన్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులకు సంస్థను ఆహ్వానించారు. పవర్‌ పాయింటు ప్రజెంటేషన్‌ ద్వారా ఆయన తెలంగాణ పారిశ్రామిక విధానం, టీఎస్‌ఐపాస్‌, భూబ్యాంకు, మానవ వనరుల లభ్యత, మౌలిక వసతుల గురించి వివరించారు. త్వరలోనే తమ బృందం హైదరాబాద్‌ను సందర్శించి, పెట్టుబడుల అవకాశాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని అనిల్‌ అగర్వాల్‌ హామీ ఇచ్చారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని