ప్రొటోకాల్‌ ప్రకారమే విద్యుదుత్పత్తి

వచ్చే నీటి సంవత్సరం నుంచి కృష్ణా పరీవాహకంలోని ప్రధాన ప్రాజెక్టుల్లో విద్యుదుత్పత్తి విషయంలో కచ్చితమైన ప్రొటోకాల్‌ పాటించేలా రెండు రాష్ట్రాలు ఒక విధానాన్ని అనుసరించాలి. సీడబ్ల్యూసీ, కేడబ్ల్యూడీటీ అవార్డుల మేరకు నిబంధనలను అమలు చేయాలి. దీనికి అవసరమైన విధానాల రూపకల్పన,

Published : 21 May 2022 05:13 IST

జలాశయ నిర్వహణ కమిటీ భేటీలో చర్చ
సమావేశానికి హాజరుకాని తెలంగాణ
నిర్వహణ విధివిధానాలు పక్కాగా ఉండాలి: ఏపీ

ఈనాడు, హైదరాబాద్‌: వచ్చే నీటి సంవత్సరం నుంచి కృష్ణా పరీవాహకంలోని ప్రధాన ప్రాజెక్టుల్లో విద్యుదుత్పత్తి విషయంలో కచ్చితమైన ప్రొటోకాల్‌ పాటించేలా రెండు రాష్ట్రాలు ఒక విధానాన్ని అనుసరించాలి. సీడబ్ల్యూసీ, కేడబ్ల్యూడీటీ అవార్డుల మేరకు నిబంధనలను అమలు చేయాలి. దీనికి అవసరమైన విధానాల రూపకల్పన, అమలు అవసరమని జలాశయాల నిర్వహణ విధానాల రూపకల్పనపై కృష్ణా బోర్డు ఏర్పాటుచేసిన జలాశయాల నిర్వహణ కమిటీ(ఆర్‌ఎంసీ) అభిప్రాయపడింది. శ్రీశైలం, సాగర్‌, పులిచింతల జలాశయాల్లో పాటించాల్సిన ప్రొటోకాల్‌.. ఇతర అంశాలపై చర్చించేందుకు శుక్రవారం హైదరాబాద్‌లోని జలసౌధలో కమిటీ కన్వీనర్‌ రవికుమార్‌ పిళ్లై అధ్యక్షతన  మొదటి సమావేశం జరిగింది. దీన్ని వాయిదా వేయాలని ఇప్పటికే తెలంగాణ సభ్యులు కోరారు. సమావేశానికి కూడా హాజరుకాలేదు. ఏపీ నుంచి జలవనరులశాఖ ఈఎన్‌సీ నారాయణరెడ్డి, జెన్‌కో సీఈ సుజయకుమార్‌ హాజరయ్యారు. కమిటీలో కృష్ణా బోర్డు సభ్యుడు ముతాంగ్‌, రెండు రాష్ట్రాల నీటిపారుదలశాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌లు, జన్‌కో సీఈలు కూడా సభ్యులుగా ఉన్నారు. సమావేశంలో శ్రీశైలం, సాగర్‌ల కింద విద్యుదుత్పత్తికి అనుసరించాల్సిన విధానంపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలిసింది. పవర్‌హౌస్‌ల నిర్వహణతో పాటు జలాశయాల రూల్‌కర్వ్స్‌పై చర్చించినట్లు తెలిసింది. చర్చకు వచ్చిన అంశాలకు సంబంధించిన నోట్‌ను రాష్ట్రప్రభుత్వానికి పంపి అభిప్రాయం తెలపాలని నీటిపారుదలశాఖకు కమిటీ సూచించనున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని