ఆ కోర్సుల్లో పరీక్షలకు అనుమతివ్వలేం

అనుమతి లేకుండా ప్రారంభించిన ఎంబీఏ బిగ్‌ డేటా అనాలసిస్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌ కోర్సుల్లో చేరిన విద్యార్థులు.. తమను పరీక్షలు రాయనివ్వాలని కోరడంపై హైకోర్టు అభ్యంతరం తెలిపింది.

Published : 21 May 2022 05:39 IST

విద్యార్థులు పొరపాటు చేశారన్న హైకోర్టు

ఈనాడు, హైదరాబాద్‌: అనుమతి లేకుండా ప్రారంభించిన ఎంబీఏ బిగ్‌ డేటా అనాలసిస్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌ కోర్సుల్లో చేరిన విద్యార్థులు.. తమను పరీక్షలు రాయనివ్వాలని కోరడంపై హైకోర్టు అభ్యంతరం తెలిపింది. జేఎన్‌టీయూకు సమాచారం ఇవ్వకుండా ప్రారంభించిన కోర్సుల్లో చేరి పరీక్షలకు హాజరయ్యేలా అనుమతించాలనడం సరికాదంది. తొలి సెమిస్టర్‌ పరీక్షలు రాయడానికి అనుమతించేలా విద్యాశాఖ, జేఎన్‌టీయూ, ఉన్నత విద్యామండలికి ఆదేశాలు జారీ చేయాలంటూ సికింద్రాబాద్‌కు చెందిన స్వామి వివేకానంద ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కళాశాల విద్యార్థి పి.కార్తికేయ సహా 29 మంది దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ జి.రాధారాణి ఇటీవల విచారణ చేపట్టారు. జేఎన్‌టీయూ నుంచి అఫిలియేషన్‌ లేకుండా కొత్త కోర్సుల్లో చేరేందుకు కాలేజీలు.. విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వడం చెల్లదని హైకోర్టు తీర్పునిచ్చింది. విద్యార్థులు అనుమతిలేని సిలబస్‌లో చేరి పొరపాటు చేశారని, రిస్క్‌ తీసుకున్నారంటూ వారి పిటిషన్‌ను కొట్టివేసింది. 2021-22లో ఎంబీఏలో కొత్త స్పెషలైజేషన్‌ కోర్సుల ప్రారంభానికి ఏఐసీటీఈ అనుమతిచ్చిందని, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ అందుకు అనుగుణంగా సిఫార్సు చేశారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది చెప్పారు. దీనిపై రెండు వారాల్లోగా విద్యాశాఖ నిర్ణయం తీసుకోవాలని గతంలో హైకోర్టు ఆదేశించిందని, స్పందన లేకపోవడంతో మరో వ్యాజ్యాన్ని దాఖలు చేసినట్లు తెలిపారు. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్‌ నంబర్లు, పరీక్ష కేంద్రాల వివరాలున్నాయని కళాశాల నుంచి సర్వీస్‌ ఫీజు చెల్లించడానికి ప్రయత్నిస్తే విద్యార్థులను పరీక్షలకు అనుమతించడం లేదని విశ్వవిద్యాలయం తెలిపిందన్నారు. కోర్సు ప్రారంభానికి యూనివర్సిటీ అనుమతివ్వలేదని జేఎన్‌టీయూ తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని