ముంపునకు హద్దుల్లేవు..!

వర్షాకాలం వచ్చిందంటే చాలు.. చెరువుల సమీపంలోని నివాస ప్రాంతాల వారికి వణుకు మొదలవుతుంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం(ఎఫ్‌టీఎల్‌) ప్రాంతంలో నిర్మించుకున్న వారికి నిద్రే ఉండదు. ఇలా ఎన్నో ఏళ్ల నుంచి ముంపు చోటుచేసుకుంటున్నా..

Published : 22 May 2022 03:01 IST

రాష్ట్రంలో నాల్గోవంతు చెరువులకూ ఎఫ్‌టీఎల్‌ ఎల్లలు కరవు

ఈనాడు, హైదరాబాద్‌: వర్షాకాలం వచ్చిందంటే చాలు.. చెరువుల సమీపంలోని నివాస ప్రాంతాల వారికి వణుకు మొదలవుతుంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం(ఎఫ్‌టీఎల్‌) ప్రాంతంలో నిర్మించుకున్న వారికి నిద్రే ఉండదు. ఇలా ఎన్నో ఏళ్ల నుంచి ముంపు చోటుచేసుకుంటున్నా.. ఆ చెరువుల ఎఫ్‌టీఎల్‌ గుర్తించి హద్దులు ఏర్పాటు చేయాలన్న ఆలోచన అధికారులకు రావడం లేదు. ఇదే అదనుగా ముంపు ప్రాంతాల్లో వెంచర్లు వెలుస్తూనే ఉన్నాయి. రాష్ట్రంలో మిషన్‌ కాకతీయ కింద చెరువుల పునరుద్ధరణలో భాగంగా ఎఫ్‌టీఎల్‌లను నిర్ధారించాలని ప్రభుత్వం ఆదేశించింది. 25 వేల చెరువుల పునరుద్ధరణ చేపట్టినప్పటికీ హద్దు రాళ్లు వేసింది పావుభాగమైనా లేవు. ప్రధానంగా కాలనీలు, పట్టణాలు, మండల కేంద్రాలను ఆనుకుని ఉండే చెరువులు చాలా వరకు కబ్జాకు గురయ్యాయి. మచ్చుకు కొన్ని..

* వరంగల్‌లో దాదాపు 12 చెరువుల ఎఫ్‌టీఎల్‌ ఆక్రమణకు గురైంది. సంగారెడ్డి, మెదక్‌ జిల్లాలోనూ చాలా చెరువులకు ఇదే పరిస్థితి

* నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి ఊర చెరువులో పది ఎకరాలకుపైగా కబ్జా జరిగింది.

* మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట చెరువులో ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్‌లలో కడ్డీలు పాతి మరీ ఆక్రమణలు జరిగినా.. వాటిని పూర్తిగా తొలగించడం లేదు.

* హెచ్‌ఎండీఏ పరిధిలో సంగారెడ్డి, హైదరాబాద్‌, సిద్దిపేట జిల్లాల్లోని మండలాల్లో 361 చెరువుల శిఖం ప్రాంతంలో ఎఫ్‌టీఎల్‌ హద్దులు తేల్చాల్సి ఉంది.

* హైదరాబాద్‌ నగరంలో పట్టుమని వంద చెరువులకైనా హద్దులు లేవంటే పరిస్థితి ఎలా ఉందో అంచనా వేయొచ్చు.

* ఇంకా చాలాచోట్ల చెరువులు ఆక్రమణలకు గురయ్యాయి. కోర్టుల్లోనూ వ్యాజ్యాలు ఉన్నాయి.

ఏదీ సన్నద్ధత..: ఏటా వర్షాకాలంలో చెరువులకు వరద వచ్చి శిఖం ప్రాంతాలు ముంపునకు గురయినప్పుడే యంత్రాంగం హడావుడి చేస్తోంది. చెరువుల్లోకి నీటిని తీసుకొచ్చే పాటుకాల్వలే కాక.. నీటిని బయటకు పంపే వాటిపైనా ఆక్రమణల తొలగింపును పూర్తిగా చేపట్టక ప్రతిసారీ కాలనీల్లోకి వరద వచ్చి చేరుతోంది. హైదరాబాద్‌, వరంగల్‌ నగరాలతోపాటు జిల్లా కేంద్రాల్లో చాలాచోట్ల ఈ పరిస్థితి పునరావృతమవుతోంది. హైదరాబాద్‌లో వరద నీటి తరలింపునకు ప్రత్యేక డ్రైనేజీ నిర్మాణాలు మొదలుపెట్టినా పనులు కొలిక్కి రాలేదు. మరోవైపు వర్షాకాలం సమీపిస్తోంది. ఈలోగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టాల్సిన చర్యలపై యంత్రాంగం ఎలాంటి సన్నద్ధత ప్రకటించలేదు. రెండేళ్ల క్రితం వచ్చిన వరదలతో రాష్ట్రవ్యాప్తంగా భారీనష్టమే వాటిల్లింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని అప్రమత్తం కావాల్సి  ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని