Updated : 22 May 2022 10:23 IST

త్వరలో దేశంలో సంచలనం

ముఖ్యమంత్రి కేసీఆర్‌
దిల్లీలో పాఠశాల, మొహల్లా క్లినిక్‌ల పరిశీలన
అక్కడి విద్యావిధానం బాగుందని ప్రశంస
తెలంగాణ నుంచి తామూ నేర్చుకుంటామన్న కేజ్రీవాల్‌
ముఖ్యమంత్రిని కలిసిన యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌

ఈనాడు, దిల్లీ: ‘వ్యాపారులు కలిసినప్పుడు వ్యాపారం గురించే మాట్లాడుకుంటారు.. రాజకీయ నాయకులు కలిస్తే రాజకీయాలే మాట్లాడుకుంటారు.. త్వరలో దేశంలో సంచలనం జరగాలి.. జరుగుతుంది. ఏం జరుగుతుందో చూడండి’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. దిల్లీలో సర్వోదయ పాఠశాల సందర్శన అనంతరం ముఖ్యమంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అంతకుమందు యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌.. కేసీఆర్‌ను ఆయన నివాసానికి వచ్చి కలిశారు. ఇదే విషయమై విలేకరులు ప్రస్తావించగా, కేసీఆర్‌ పై విధంగా స్పందించారు. మన దేశం రాష్ట్రాల సమాఖ్య అని రాజ్యాంగం మొదటి పేజీలోనే ఉందని... కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను కలుపుకొని వెళ్లకపోతే ఇబ్బందులు తప్పవని సీఎం వ్యాఖ్యానించారు. ఉత్తరాది రాష్ట్రాల పర్యటనకు బయలుదేరిన కేసీఆర్‌ శనివారం దిల్లీలో బస చేశారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో దక్షిణ మోతీబాగ్‌లోని సర్వోదయ పాఠశాలను సందర్శించారు. అప్పటికే పాఠశాలలో వేచి ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌, ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియాలు కేసీఆర్‌ను సాదరంగా స్వాగతించారు. పాఠశాల గదులు, వసతులను పరిశీలించిన కేసీఆర్‌.. విద్యాబోధన, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యావిధానాన్ని మెరుగుపర్చిన తీరును సిసోడియా, ఎమ్మెల్యే అతీశి మార్లేనాలు పవర్‌ పాయింట్‌ ద్వారా ఆయనకు వివరించారు. దిల్లీ పాఠశాలల్లో స్టారప్స్‌ను ప్రోత్సహించేందుకు కొత్తగా ప్రవేశపెట్టిన బిజినెస్‌ బ్లాస్టర్స్‌లో పాలుపంచుకున్న విద్యార్థులతో కేసీఆర్‌ ముచ్చటించారు.

దిల్లీ విద్యావిధానంపై అధ్యయనం

అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ విలేకరులతో మాట్లాడుతూ దిల్లీలో విద్యావ్యవస్థ బాగుందని, దేశంలో మరెక్కడా ఇలాంటి విద్యావిధానం లేదన్నారు. దేశవ్యాప్తంగా ఈ విధానం రావాలని అభిప్రాయపడ్డారు. విద్యార్థులను ఉద్యోగాలు సృష్టించేవారిగా మార్చే విధానం బాగుందని కొనియడారు. కేంద్రం నూతన విద్యావిధానం తీసుకొస్తున్న సంగతి ప్రస్తావించగా, అందరినీ కలుపుకొని వెళ్తే ఆ విధానం పనికివస్తుందని, లేకుంటే ఇబ్బందులు తప్పవన్నారు. దిల్లీ విద్యావిధానాన్ని కాపీ కొట్టబోమని.. తమ రాష్ట్ర ఉపాధ్యాయులను, ఉపాధ్యాయ సంఘాల నేతలను ఇక్కడికి పంపి అధ్యయనం చేయిస్తామని ఓ ప్రశ్నకు కేసీఆర్‌ బదులిచ్చారు. ‘దిల్లీ ప్రభుత్వం సిబ్బందిని విదేశాలకు పంపి విద్యా ప్రమాణాలు తయారు చేసింది. అందుకు వారు చాలా మొత్తం ఖర్చుపెట్టారు. మేం మా సిబ్బందిని దేశ రాజధానికి పంపించి తక్కువ వ్యయంతోనే జ్ఞానం సంపాదించుకుంటాం’ అని ఆయన అన్నారు. అరవింద్‌ కేజ్రీవాల్‌ మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఇక్కడి పాఠశాల చూడడానికి రావడం తమకు గౌరవంగా ఉందన్నారు. విద్యావిధానంపై ఎన్నో ప్రశ్నలు అడిగారని, విద్యాశాఖపై ఆయనకు చాలా ఆసక్తి ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం చాలా మంచి పనులు చేస్తోందని.. వాటిని తాము తెలుసుకుంటామన్నారు. ఇలా ఒకరి నుంచి మరొకరు నేర్చుకోవడం వల్ల దేశానికి మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు.

ఇక్కడి క్లినిక్‌లను చూసే బస్తీ దవాఖానాలు: కేసీఆర్‌

అనంతరం కేసీఆర్‌ మహ్మద్‌పురలోని మొహల్లా క్లినిక్‌ను సందర్శించారు. అక్కడ అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆ క్లినిక్‌లకు వచ్చే రోగులకు ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్‌, ఈసీజీ అవసరమైతే ప్రభుత్వ ఖర్చుతో ఉచితంగా పరీక్షలు చేయిస్తున్నామని కేజ్రీవాల్‌ కేసీఆర్‌కు వివరించారు. మొత్తం వెయ్యి మొహల్లా క్లినిక్‌లు, 120 పాలి క్లినిక్‌లు, 35 సూపర్‌ స్పెషలైజ్డ్‌ క్లినిక్‌ల ఏర్పాటు తమ లక్ష్యమని కేజ్రీవాల్‌ వివరించారు. వీటికి ఔషధాలు ఎలా కొంటారని దిల్లీ ఆరోగ్య శాఖమంత్రి సత్యేంద్రజైన్‌ను కేసీఆర్‌ అడిగారు. కంపెనీల నుంచి నేరుగా కొనుగోలు చేయడంతో వ్యయం తగ్గుతోందని ఆయన బదులిచ్చారు. దిల్లీలోని మొహల్లా క్లినిక్‌లను చూసే.. హైదరాబాద్‌లో తాము బస్తీ దవాఖానాలు తెరిచామని కేసీఆర్‌ తెలిపారు. తమ దగ్గర దవాఖానాల్లో వేతనాల ప్రాతిపదికన వైద్యులను నియమిస్తున్నామని మంత్రి ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. మీరు ఏ విధానం పాటిస్తున్నారని సత్యేంద్ర జైన్‌ను అడగగా తాము ఒక్కో రోగిని పరీక్షించినందుకు రూ.40 చొప్పున వైద్యులకు ఇస్తున్నామని జైన్‌ సమాధానమిచ్చారు. దిల్లీలోనూ, హైదరాబాద్‌లోనూ ఈ క్లినిక్‌ల ద్వారా మంచి సేవలు అందుతున్నాయని కేసీఆర్‌ అన్నారు. విద్యా, వైద్య రంగాల్లో కేజ్రీవాల్‌ ప్రభుత్వం వినూత్నంగా పనిచేస్తూ పేదలకు అండగా నిలిచిందని ప్రశంసించారు. సుమారు రెండు గంటలపాటు సాగిన ఈ సందర్శనలో ఆయన వెంట తెరాస లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, ఎంపీలు డాక్టర్‌ గడ్డం రంజిత్‌రెడ్డి, బొర్లకుంట వెంకటేష్‌ నేత, జోగినపల్లి సంతోష్‌కుమార్‌, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ ఉన్నారు.

అఖిలేశ్‌తో చర్చలు

ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ శనివారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. ముఖ్యమంత్రి అధికారిక నివాసం 23, తుగ్లక్‌ రోడ్‌కు మధ్యాహ్నం 12.30 గంటలకు వచ్చిన అఖిలేశ్‌ 3.10 గంటల వరకు అక్కడే ఉన్నారు. ఆయనకు కేసీఆర్‌ స్వాగతం పలికి ఇంటి లోపలికి తీసుకెళ్లారు. వారిద్దరి చర్చల్లో మిగిలిన తెరాస నాయకులూ పాల్గొన్నారు. అంతా కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికలపై వారి మధ్య చర్చ సాగింది. విపరీతమైన దౌర్జన్యం, ధన ప్రవాహం, కుల, మతపరమైన విభేదాలతో భాజపా విజయం సాధించిందని అఖిలేశ్‌ కేసీఆర్‌కు వివరించారు. విపక్ష పాలిత రాష్ట్రాలు, విపక్ష నేతల విషయంలో కేంద్రం తీరుపై వారు చర్చించారు. సీఎం కేసీఆర్‌ దిల్లీ పాఠశాల సందర్శన ముగించుకుని తన నివాసానికి చేరుకున్నాక.. ఎన్డీటీవీ కో ఛైర్‌పర్సన్లు ప్రణయ్‌రాయ్‌, రాధికారాయ్‌ వచ్చి ఆయనతో భేటీ అయ్యారు.

నేడు కేజ్రీవాల్‌ ఇంట భోజనం.. అనంతరం చండీగఢ్‌కు..

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం మధ్యాహ్నం దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇంటికి వెళ్లనున్నారు. అక్కడ మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రులు, వారి బృందాలతో కలిసి చండీగఢ్‌ వెళ్లనున్నారు. అక్కడ రైతు ఉద్యమ సమయంలో మరణించిన రైతు కుటుంబాలను పరామర్శిస్తారు. వారికి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన పరిహారపు చెక్కులను అందించనున్నారు.


Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని