కేంద్రం రైతుల రక్తం పీల్చమంటోంది..

ప్రస్తుత పరిస్థితులను చూసి నా దేశం ఎందుకిలా ఉందని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రతి చిన్నపని కోసం ప్రతి ఒక్కరూ పోరాటం చేయాల్సి వస్తోంది. కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. వీటికి

Updated : 23 May 2022 06:49 IST

ప్రాణం పోయినా ఆ పనిచేయం

వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టబోమన్నాం

అన్నదాతకు మేలు చేయడం వారికి నచ్చట్లేదు

గిట్టుబాటు ధరకు చట్టబద్ధత కోసం పోరాడండి

మద్దతిచ్చే వారికే ఎన్నికల్లో అండగా ఉందాం

చండీగఢ్‌ సభలో సీఎం కేసీఆర్‌ పిలుపు

ప్రస్తుత పరిస్థితులను చూసి నా దేశం ఎందుకిలా ఉందని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రతి చిన్నపని కోసం ప్రతి ఒక్కరూ పోరాటం చేయాల్సి వస్తోంది. కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. వీటికి మూలాలు ఎక్కడున్నాయనే అంశంపై తప్పనిసరిగా చర్చ జరగాలని దేశ పౌరుడిగా కోరుకుంటున్నాను. ప్రతి దేశంలోనూ సమస్యలుంటాయి. కానీ మనదగ్గరున్నట్టు ఎక్కడా ఉండవు.

తెలంగాణ ఏర్పడకముందు మా రైతుల పరిస్థితి చాలా బాధాకరంగా ఉండేది. ఒక్కోరోజు పది, ఇరవై మంది ఆత్మహత్యలు చేసుకునేవారు. విద్యుత్తు ఎప్పుడొచ్చి పోతుందో తెలియదు. రాత్రిళ్లు మోటార్లు పెట్టడానికి వెళ్లి ఎంతో మంది రైతులు పాముకాట్లకు గురై ప్రాణాలు కోల్పోయేవారు. రాష్ట్రం ఏర్పడ్డాక.. దేవుడి దయతో మేం విద్యుత్తు సమస్యను పరిష్కరించాం. ఇళ్లు, వ్యాపారాలు, రైతులు, పరిశ్రమలకు 24 గంటలూ నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేస్తున్నాం.

- సీఎం కేసీఆర్‌

ఈనాడు, దిల్లీ: ‘మేం సాగుకు ఉచితంగా విద్యుత్తు ఇస్తున్నాం. కానీ దిల్లీలో మా నెత్తిన కూర్చున్న సర్కారు.. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెట్టమంటూ ఒత్తిడి చేస్తోంది. రైతుల నుంచి డబ్బు వసూలు చెయ్‌... వారి రక్తం పీల్చు అంటోంది. కానీ ప్రాణం పోయినా ఫర్వాలేదు మీటర్లు మాత్రం పెట్టం, మీరేం చేసుకుంటారో చేసుకోండి అని అసెంబ్లీ సాక్షిగా తిరస్కరించాం’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడించారు. సాగు చట్టాల రద్దుకు ఉద్యమించి విజయం సాధించిన రైతులు చట్టబద్ధమైన గిట్టుబాటు ధర కోసం దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. రైతులు తల్చుకుంటే అధికార పీఠాలు తారుమారైపోతాయని అన్నారు. సాగుచట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో చేపట్టిన ఆందోళనలో ప్రాణాలు కోల్పోయిన 693 మంది రైతుల కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున, గల్వాన్‌ లోయలో చైనా సైనికులతో పోరాడి మరణించిన నలుగురు సైనికుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున తెలంగాణ ప్రభుత్వం తరఫున సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. చండీగఢ్‌లోని ఠాగూర్‌ స్టేడియంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేసీఆర్‌.. పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌సింగ్‌ మాన్‌, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌తో కలిసి.. పంజాబ్‌, హరియాణా రాష్ట్రాలకు చెందిన 25 మంది రైతుల కుటుంబాలకు సాయం చెక్కులు పంపిణీ చేశారు. మిగిలినవి అధికారుల ద్వారా ఆయా కుటుంబాలకు అందజేశారు. ఈ సందర్భంగా రైతు కుటుంబాలను ఉద్దేశించి కేసీఆర్‌ మాట్లాడారు.

మీ బాధను పంచుకోవడానికే వచ్చా
‘కేంద్ర ప్రభుత్వం చేసిన సాగు చట్టాలపై పోరాటంలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. కేంద్రం మెడలు వంచి చట్టాలు రద్దు చేసేంతవరకూ ఉద్యమించిన రైతులు, రైతు నేతలందరికీ నమస్కరిస్తున్నా. అమరులైన వారిని తిరిగి తీసుకురాలేం. కానీ మీ బాధను పంచుకుని.. దేశమంతా మీ వెంట ఉందని భరోసా ఇవ్వడానికే ఇక్కడికొచ్చా. స్వాతంత్య్ర సమరంలో ఇక్కడి ప్రజలు చేసిన ప్రాణత్యాగాలను చరిత్ర ఎన్నటికీ మరవదు. దేశమంతా అన్నం కోసం ఆందోళన చెందుతున్నప్పుడు ఇక్కడి రైతులు నెత్తురును చెమటగా ధారపోసి దేశంలో తొలి హరితక్రాంతిని తీసుకొచ్చి అందరికీ తిండి పెట్టారు. ఇది భారతీయ చరిత్రలో ఎప్పటికీ సువర్ణాక్షరాలతో లిఖితమై ఉంటుంది. ఇక్కడ ఆమ్‌ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు సాయం అందిస్తామని కేజ్రీవాల్‌కు చెప్పినప్పుడు ఆయన దీన్ని స్వాగతించారు. నాతోపాటు వచ్చిన ఆయనకు ధన్యవాదాలు చెబుతున్నా.

కేంద్రం జీర్ణించుకోలేకపోతోంది
రైతులకు ప్రయోజనాలు కల్పించడానికి మాతో పాటు ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కానీ రాష్ట్రాలు రైతులకు మేలు చేయడం వాళ్లకు (కేంద్రంలోని వారు) ఇష్టం లేదు. అందుకే ముఖ్యమంత్రులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేసిన మీపై ఖలీస్థానీ, దేశద్రోహి అంటూ ఎన్నో ఆరోపణలు చేశారు. కేంద్రం తీరును దృష్టిలో ఉంచుకొని ఈ ఆందోళనను ఇకముందు కూడా కొనసాగించాలి. కొన్ని రాష్ట్రాలకే పరిమితం కాకుండా.. దేశవ్యాప్తంగా రైతులంతా ఏకమై పోరాడాలి. దేశానికి అన్నం పెట్టే రైతులకు న్యాయం జరిగి తీరాల్సిందే. వారికి ఎదురవుతున్న బాధాకర పరిస్థితులు తొలగిపోవాలి.

రైతులు తలచుకుంటే పీఠాలు తారుమారు
రైతులు అనుకుంటే అధికార పీఠాలు తారుమారవుతాయి. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంతో పాటు, దానికి రాజ్యాంగ రక్షణ కల్పించేంతవరకూ ఆందోళన కొనసాగించాలి. వచ్చే ఎన్నికల్లో దీనికి మద్దతిచ్చే వారికే మనం అండగా నిలవాలి. దేశవ్యాప్తంగా రైతునేతలు ఈ దిశగా ఐక్యతను తీసుకురావాలి. దేశంలోని రైతు అనుకూల ప్రభుత్వాలన్నీ ఏకమై మీ ఆందోళనకు మద్దతు పలుకుతాయి. కేంద్రం రైతుల డిమాండ్లకు తలొగ్గేవరకూ పోరాటం కొనసాగించాలని రైతు నేతలను ప్రార్థిస్తున్నాను’ అని కేసీఆర్‌ కోరారు.
ఈ కార్యక్రమంలో భారతీయ కిసాన్‌ యూనియన్‌ అధికార ప్రతినిధి రాకేశ్‌ టికాయిత్‌, తెలంగాణ ఎంపీలు నామా నాగేశ్వరరావు, రంజిత్‌రెడ్డి, సంతోష్‌కుమార్‌, వెంకటేష్‌ నేత, మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు కేసీఆర్‌ దిల్లీలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ నివాసానికి వెళ్లి మధ్యాహ్న భోజనం చేశారు. సుమారు రెండుగంటల పాటు అక్కడే గడిపారు. తర్వాత ఇద్దరూ కలిసి విమానంలో చండీగఢ్‌కు పయనమయ్యారు. అక్కడ కార్యక్రమం ముగిశాక, అందరూ పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌మాన్‌ నివాసంలో మరోసారి సమావేశమయ్యారు.


రైతుల ఆదాయం పెరగాలి: కేజ్రీవాల్‌

పంజాబ్‌లో ఆప్‌ ప్రభుత్వం వచ్చాక.. రైతుల ఆదాయం పెంచడంపై దృష్టి సారించినట్లు ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్‌ తెలిపారు. ‘రైతుల ఆదాయం పెరగనంతవరకు వారు అప్పుల బాధల నుంచి బయటపడలేరు. ముఖ్యమంత్రి భగవంత్‌మాన్‌ అధికారం చేపట్టగానే రైతు అనుకూల నిర్ణయాలు తీసుకున్నారు. తొలిపంటగా పెసర వేస్తే, కనీస మద్దతు ధరకు కొంటామని చెప్పారు. నేరుగా విత్తనాలు వేసిన రైతులకు ఎకరాకు రూ.2,500 ఇస్తామని ప్రకటించారు. విద్య, వైద్యం, విద్యుత్తు విషయంలో దిల్లీ ప్రభుత్వ కృషిని దేశం మొత్తం చూసినట్లుగానే రాబోయే రోజుల్లో రైతాంగం కోసం పంజాబ్‌ ప్రభుత్వం చేసే మంచి పనులను చూస్తుంది. పంజాబ్‌లో రైతుల పిల్లలు రైతులమవుతామని చెప్పుకొనేలా పరిస్థితులను చక్కదిద్దడానికి మేం కంకణబద్ధులమై ఉన్నాం. ఈ నమూనాను దేశం ముందుంచుతాం’ అని కేజ్రీవాల్‌ తెలిపారు. ‘మా రైతుల బాధను పంచుకోవడానికి వచ్చిన తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు’ అని పంజాబ్‌ సీఎం భగవంత్‌సింగ్‌ పేర్కొన్నారు. చలి, ఎండ, వానలను తట్టుకొని రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన కొనసాగిస్తూ ప్రాణాలు కోల్పోయిన వారిని ఆదుకోవడం మానవత్వానికి నిదర్శనమన్నారు.



సీఎం కేసీఆర్‌కు పంజాబ్‌ ఎరువుల డీలర్ల వినతి

తెలంగాణలో వ్యవసాయాభివృద్ధికి అమలు చేస్తున్న ఉచిత విద్యుత్‌, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను దేశమంతటా అమలు చేసేలా కృషి చేయాలని సీఎం కేసీఆర్‌కు జాతీయ పురుగుమందులు, ఎరువులు, విత్తనాల డీలర్ల సంఘం పంజాబ్‌ శాఖ వినతిపత్రం అందజేసింది. ఈ సంఘం ప్రతినిధులు చండీగఢ్‌లో కేసీఆర్‌ను కలసి రైతుల సమస్యలను వివరించారని సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గౌరీశెట్టి మునీందర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని