Updated : 23 May 2022 05:16 IST

జూన్‌ 2 నాటికి మరిన్ని బస్తీ దవాఖానాలు

జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో ఏర్పాటు

వారంలో 3 రోజులు అధికారుల ఆకస్మిక తనిఖీలు

ప్రాథమిక వైద్యం బలోపేతానికి చర్యలు

వచ్చే రెండేళ్లలో 5,240కి చేరనున్న ఎంబీబీఎస్‌ సీట్లు

‘ఈనాడు-ఈటీవీ’తో ముఖాముఖిలో వైద్య మంత్రి హరీశ్‌రావు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్యాన్ని బలోపేతం చేయడంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రధానంగా దృష్టి పెట్టారని, ఆ దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. మనలో చాలామందికి అధిక రక్తపోటు, మధుమేహం ఉన్నట్లు తెలియదని, వాటికి చికిత్స చేయించుకోకపోతే కిడ్నీలు, గుండె, మెదడు సంబంధిత వ్యాధులకు దారి తీస్తుందని ఆందోళన వెలిబుచ్చారు. జీవనశైలి వ్యాధులను తొలిదశలో నిర్ధారించే కార్యాచరణను పక్కాగా అమలు చేస్తున్నామని, తద్వారా బీపీ, షుగర్‌ వంటి దీర్ఘకాలిక వ్యాధులను అదుపులో పెట్టుకోవడం సాధ్యమవుతుందన్నారు. జూన్‌ 2వ తేదీ నాటికి హైదరాబాద్‌తో పాటు జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో మరికొన్ని బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖ పనితీరుపై ఆ శాఖ మంత్రి హరీశ్‌రావుతో ‘ఈనాడు-ఈటీవీ’ ప్రత్యేక ముఖాముఖి.

ప్రాథమిక ఆరోగ్యంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. వైద్యులు సమయపాలన పాటించడం లేదనే విమర్శలున్నాయి?
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయిలో వైద్యులు తప్పనిసరిగా ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఉండాల్సిందిగా ఆదేశాలు జారీ చేశాం. అన్ని పీహెచ్‌సీల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. చిన్న జిల్లాల వల్ల అధికార వికేంద్రీకరణ జరగడంతో జిల్లా స్థాయి వైద్యాధికారుల సంఖ్య పెరిగింది. వీరితోపాటు రాష్ట్రస్థాయి అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశాలిచ్చాం. వారంలో వీరు కనీసం 3 రోజులు ఆకస్మిక తనిఖీలు చేపట్టాలి.

రాష్ట్రవ్యాప్తంగా బస్తీ దవాఖానాలు ఎప్పటిలోగా అందుబాటులోకి వస్తాయి?
బస్తీ దవాఖానాలు రాక ముందు ఫీవర్‌ ఆసుపత్రికి రోజుకు 4వేల ఓపీ ఉండేది. ఇప్పుడు 400కు తగ్గిపోయింది. ఇప్పుడు బస్తీల్లోనే దవాఖానా అందుబాటులో ఉండటంతో అక్కడే వైద్యం, ఉచితంగా మందులు పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇప్పటివరకూ 259 బస్తీ దవాఖానాలు నెలకొల్పాం. మరో 91 స్థాపించే కార్యక్రమం తుదిదశలో ఉంది. ఇవికాకుండా జిల్లా కేంద్రాలు, ఇతర కార్పొరేషన్లలో మరో 60 ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. జూన్‌ 2 నాటికి హైదరాబాద్‌ సహా ఇతర పట్టణాల్లోనూ బస్తీ దవాఖానాల సేవలు ప్రారంభం కానున్నాయి.

వైద్యుల కొరతను ఎలా అధిగమిస్తారు?
వైద్యుల కొరత కొంత ఉన్నప్పటికీ.. దాన్ని అధిగమించడానికి దీర్ఘకాలిక ప్రణాళికను అమలు చేస్తున్నాం. అన్ని జిల్లాల్లోనూ కొత్తగా వైద్య కళాశాలలను అందుబాటులోకి తెస్తున్నాం. రాష్ట్రం ఏర్పడిన నాటికి ప్రభుత్వ వైద్యంలో ఎంబీబీఎస్‌ సీట్ల సంఖ్య 700 కాగా 2840కి పెంచాం. వచ్చే రెండేళ్లలో 16 కొత్త కాలేజీలు అందుబాటులోకి రావడం ద్వారా ఎంబీబీఎస్‌ సీట్ల సంఖ్య 5,240కి చేరనుంది. పీజీ సీట్లు కూడా రెట్టింపు పెరిగాయి. ప్రతి జిల్లాలో వైద్య కళాశాల అందుబాటులోకి రావడంతో పడకలు కనీసం 650 ఉంటాయి. వైద్యుల సంఖ్య పెరుగుతుంది. స్పెషాలిటీ వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయి. కొన్నిచోట్ల అవసరాలకు మించి వైద్యులు, నర్సులున్నారు. ఎక్కడైతే రోగుల సంఖ్య ఎక్కువగా ఉంటుందో.. అక్కడ ఎక్కువమంది సిబ్బంది ఉండేలా చూస్తున్నాం.

వైద్య ఆరోగ్యశాఖలో నియామక ప్రకటన కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు?
వైద్య ఆరోగ్యశాఖలో అతి త్వరలోనే నియామక ప్రకటన వెలువడుతుంది. కొవిడ్‌ సమయంలో పనిచేసిన ఒప్పంద, పొరుగు సేవల వైద్యులు సహా ఇతర సిబ్బందికి 20 శాతం వెయిటేజి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్తగా నియమితులయ్యే వైద్యులకు ప్రైవేటు ప్రాక్టీసును నిషేధించాలనే నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ప్రభుత్వ వైద్యంలో సేవలందిస్తున్నవారు సాయంత్రం 4 గంటలు దాటిన తర్వాత ప్రైవేటుగా ఓపీ సేవలు మాత్రం అందించవచ్చు.

విలువైన వైద్య పరికరాల నిర్వహణ, మరమ్మతు కష్టంగా మారుతోంది?
రూ.5 లక్షలు.. ఆపైన విలువ ఉండే ప్రతి వైద్య పరికరం వార్షిక నిర్వహణ కోసం ఉత్పత్తి సంస్థతోనే పరస్పర ఒప్పందం చేసుకుంటున్నాం. ఇందుకోసం రూ.28 కోట్లను కేటాయించాం. దీనికి టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఇకనుంచి ఏ ఆసుపత్రిలోనైనా వైద్య పరికరం మరమ్మతుకు గురైతే.. 24 గంటల్లోగా ఉత్పత్తి సంస్థ ప్రతినిధులు వచ్చి మరమ్మతు చేసేలా ఏర్పాట్లు చేశాం.

పారిశుద్ధ్య నిర్వహణపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది?
పారిశుద్ధ్య, భద్రతాసిబ్బందికి కనీసం వేతనాలు ఇవ్వాలని నిర్ణయించాం. కచ్చితంగా పీఎఫ్‌, ఈఎస్‌ఐ వర్తించేలా ఆదేశాలిచ్చాం. నెల మొదటి వారంలోనే జీతాలందేలా చర్యలు చేపట్టాం. గతంలో ఒక్కో పడక పారిశుద్ధ్య నిర్వహణ, భద్రతకు రూ.4500 ఉండేది. దీన్ని ఇప్పుడు రూ.7500కు పెంచాం. ఒక కాంట్రాక్టర్‌ అయిదారు ఆసుపత్రుల కంటే ఎక్కువ ఆసుపత్రుల్లో పాల్గొనడానికి వీల్లేదని కొత్త నిబంధన తెచ్చాం. బాగా పనిచేస్తున్న వారిని ప్రోత్సహిస్తున్నాం.

అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు ప్రభుత్వ వైద్యంలో తక్కువగా జరుగుతున్నాయి?
గాంధీ ఆసుపత్రి 8వ అంతస్తులో రూ.30 కోట్లతో 9 మాడ్యులర్‌ ఆపరేషన్‌ థియేటర్లు ఏర్పాటుచేయాలని నిర్ణయించాం. అందులో ఒక రొబోటిక్‌ థియేటర్‌ ఉంటుంది. ఇందులో అన్ని అవయవ మార్పిడి శస్త్రచికిత్సలూ నిర్వహిస్తాం. ఉస్మానియానూ అభివృద్ధి చేస్తున్నాం. కొత్తగా వరంగల్‌లో, హైదరాబాద్‌కు నలుదిక్కులా నెలకొల్పనున్న సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల్లోనూ అవయవ మార్పిడి శస్త్రచికిత్సల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నాం. దీనిపై ప్రజల్లోనూ చైతన్యం రావాలి. ఈ అంశంపై ‘ఈనాడు-ఈటీవీ’ క్రియాశీలకంగా వ్యవహరించాలని కోరుతున్నాను.

ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.. రాష్ట్రంలో ఆయుష్మాన్‌ భారత్‌ అమలు చేయడం లేదని విమర్శించారు?
గతేడాది మే 18న ఆయుష్మాన్‌ భారత్‌లో తెలంగాణ రాష్ట్రం చేరింది. ఇప్పటివరకూ ఆయుష్మాన్‌ భారత్‌ కింద లక్షల శస్త్రచికిత్సలు రాష్ట్రంలో చేశాం. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్‌ భారత్‌ కలిపే చేస్తున్నాం. ఆరోగ్యశ్రీ కింద రాష్ట్రంలో 87.60 లక్షల కుటుంబాలకు, ఆయుష్మాన్‌ భారత్‌ కింద 26 లక్షల కుటుంబాలకు లబ్ధి జరుగుతుంది. ఆదివారం ఉదయం గాంధీ ఆసుపత్రిని సందర్శించినప్పుడు.. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి(50)కి మోకీలు మార్పిడి ఆపరేషన్‌ చేయించుకున్నాడు. అక్కడి వ్యక్తికి ఇక్కడెలా చేశారని వైద్యుడిని అడిగితే.. ఆయుష్మాన్‌ భారత్‌ కింద చేశామన్నారు. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్‌ భారత్‌ కింద ఇప్పటివరకూ రూ.850 కోట్ల విలువైన చికిత్స అందించగా.. ఇందులో రాష్ట్రం రూ.700 కోట్లు, కేంద్రం రూ.150 కోట్లను అందించింది. మరి అమిత్‌షా అలా మాట్లాడడం ఎంతవరకూ సబబు?

బీబీనగర్‌ ఎయిమ్స్‌లో వైద్యసేవలెలా ఉన్నాయి?
ఎయిమ్స్‌కు నిర్మాణం పూర్తయిన భవనాలను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. అప్పటికే అక్కడ ఓపీ సేవలు ప్రారంభించాం. మూడేళ్ల తర్వాత చూస్తే.. ఒక్క అదనపు సేవ కూడా అందడంలేదు. మొదటి సంవత్సరం 50 మంది వైద్య విద్యార్థులు.. రెండో ఏడాది 62 మంది.. మూడో సంవత్సరం 100 మంది చేరారు. అయినా ఐపీ రోగులు లేరు. శస్త్రచికిత్సలు చేయడం లేదు. ఆపరేషన్‌ థియేటర్‌, రక్త నిధినిల్వ కేంద్రం లేవు. దీంతో ఇక్కడి వైద్యవిద్యార్థులను భువనగిరి ఆసుపత్రిలో అనుభవపూర్వక శిక్షణకు అనుమతించాం.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని