Updated : 26 May 2022 06:17 IST

సౌరవెలుగులకు ససేమిరా

రూఫ్‌టాప్‌ల ఏర్పాటు పనులను నిలిపివేసిన సోలార్‌ సంస్థలు
టీఎస్‌ రెడ్కో ఖరారు చేసిన ధరలతో నష్టం వస్తుందని వాదన
ఉత్పత్తి వ్యయం పెరిగిందని.. రేట్లు పెంచాలని డిమాండ్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఇళ్లపై సౌర విద్యుత్‌ ఏర్పాటుకు ముందుకొస్తున్న సామాన్యులకు నిరాశ తప్పడం లేదు. ప్రభుత్వం ఖరారు చేసిన ధరలపై సోలార్‌ విద్యుత్‌ ఏర్పాటుకు ప్రైవేట్‌ సోలార్‌ సంస్థలు ససేమిరా అంటున్నాయి. రాష్ట్రంలో ఇళ్లు, కార్యాలయాలు, వాణిజ్య సముదాయాల భవనాలపై(రూఫ్‌టాప్‌) రాయితీపై సౌరవిద్యుత్‌ ఏర్పాటు పనులు దాదాపుగా నిలిచిపోయాయి. గత ఆర్థిక సంవత్సరం(2021-22) కోసం గత జనవరిలో రూఫ్‌టాప్‌ ధరలను ‘తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ’(టీఎస్‌ రెడ్కో) టెండర్ల ద్వారా ఖరారు చేసింది. ఒక కిలోవాట్‌కు రూ.52 వేల ధరను నిర్ణయించింది. వినియోగదారులు రాయితీ పోను రూ.37,330 చెల్లించాల్సి ఉంటుంది. రాయితీని కేంద్రం భరిస్తుంది. ఇదే విధంగా 2, 3, 4, 5, 10.. ఇలా వివిధ కిలోవాట్ల ధరలను టెండర్ల ద్వారా నిర్ణయించారు. ఇవే ధరలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23)లోనూ అమలు చేయాలని రాష్ట్రానికి కేంద్రం సూచించింది. ఈ ఏడాది 25 వేల కిలోవాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల సౌర విద్యుత్‌ ఏర్పాటుకు రాష్ట్రానికి కేంద్రం అనుమతించింది. కానీ, జనవరి నుంచి ఇప్పటివరకూ కేవలం 1,800 కిలోవాట్ల సామర్థ్యం గలవి(7.2 శాతం) మాత్రమే ఏర్పాటు చేశారు. అయితే టెండర్ల ద్వారా ఖరారు చేసిన ధరలకు సౌర విద్యుత్‌ ఏర్పాటుకు సోలార్‌ సంస్థలు విముఖత చూపుతున్నాయి. సామగ్రి, ఇంధన ధరలు పెరిగాయనీ.. పైగా బేసిక్‌ కస్టమ్‌ డ్యూటీ(బీసీడీ)ని కేంద్రం పెంచిందని చెబుతున్నాయి. కిలో వాట్‌కు మరో రూ.8 వేలు అదనంగా చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నాయి. టెండర్లను ఖరారు చేసి నాలుగు నెలలే అయిందని.. అప్పుడే ధరలను పెంచడం సాధ్యం కాదని టీఎస్‌ రెడ్కో వాదిస్తోంది. ఈ అంశంపై ఈ నెల 23న కేంద్ర నూతన, సంప్రదాయేతర ఇంధన వనరుల మంత్రిత్వశాఖ(ఎంఎన్‌ఆర్‌ఈ)తో చర్చించాలని సంస్థ నిర్ణయించింది. ఇతర రాష్ట్రాల్లోని ధరలనూ పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని యోచిస్తోంది. సోలార్‌ కంపెనీలు సహకరించకపోతే తెలంగాణకు కేటాయించిన 25 వేల కిలోవాట్ల సౌరవిద్యుత్‌ను ఇతర రాష్ట్రాలకు కేంద్రం మళ్లిస్తుందేమోనని అధికారులు ఆందోళన చెందుతున్నారు.

దిగుమతులు తగ్గించాలని సుంకం వడ్డింపు

సౌర ఫలకాలను కంపెనీలు ఎక్కువగా చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. అక్కడి నుంచి దిగుమతి తగ్గించాలని.. స్వదేశీ తయారీ, వినియోగం పెంచాలనే ఉద్దేశంతో ఫలకాల దిగుమతిపై కేంద్రం బేసిక్‌ కస్టమ్‌ సుంకం(బీసీడీ)ని 10 నుంచి 40 శాతానికి పెంచింది. దేశీయంగా ఫలకాల లభ్యత తక్కువగా ఉందని, దిగుమతి సుంకం పెంచడం వల్ల తాము ధరలు పెంచాల్సి వస్తోందని జున్నా సోలార్‌ సంస్థ సీఎండీ జున్నా శేఖర్‌రెడ్డి ‘ఈనాడు’కు తెలిపారు. 5 కిలోవాట్‌ సామర్థ్యం గల రూఫ్‌టాప్‌ సౌర విద్యుత్‌ ప్యానెళ్ల తయారీకి 150 కిలోల వరకూ స్టీల్‌ వాడతారు. గతంలో స్టీల్‌ ధర కిలోకు రూ.45 ఉండేది. ఇప్పుడు రూ.75కి చేరింది. అల్యూమినియం 40 కిలోలు కావాలి. దీని ధర కిలోకు రూ.140 నుంచి రూ.150కి పెరిగింది. ఈ కారణంగా ఒక కిలో వాట్‌ సామర్థ్యం గల ప్యానెళ్ల ధర సగటున రూ.8 వేలు పెరిగిందని.. అందువల్ల ప్రస్తుత ధరలకు సౌర విద్యుత్‌ ఏర్పాటు సాధ్యపడదని ప్రభుత్వానికి కంపెనీలు తెలిపాయి.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని