దృఢ సంకల్పంతో సంస్కరణలు తెచ్చాం

దృఢమైన రాజకీయ సంకల్పంతో అమలు చేస్తున్న సంస్కరణల ఫలితంగా దేశం ఇప్పుడు ఎన్నో రంగాల్లో అగ్రగామిగా నిలిచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అస్థిర ప్రభుత్వాల కారణంగా గత మూడు దశాబ్దాల్లో సంస్కరణలను పట్టుదలగా అమలు చేయలేకపోయారని

Updated : 27 May 2022 07:05 IST

2014 తర్వాత దేశంలో అనూహ్య మార్పులు
ఎన్నో రంగాల్లో భారత్‌ ఇప్పుడు అగ్రగామి
విద్యార్థులు వ్యక్తిగత లక్ష్యాలకు దేశ ప్రయోజనాలను జోడించాలి
ఐఎస్‌బీ స్నాతకోత్సవ సభలో ప్రధాని మోదీ

ఈనాడు, హైదరాబాద్‌: దృఢమైన రాజకీయ సంకల్పంతో అమలు చేస్తున్న సంస్కరణల ఫలితంగా దేశం ఇప్పుడు ఎన్నో రంగాల్లో అగ్రగామిగా నిలిచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అస్థిర ప్రభుత్వాల కారణంగా గత మూడు దశాబ్దాల్లో సంస్కరణలను పట్టుదలగా అమలు చేయలేకపోయారని ఆయన తెలిపారు. 2014 తర్వాత ఈ పరిస్థితి మారిందని, అన్ని రంగాల్లో సంస్కరణలు తీసుకువచ్చినట్లు వివరించారు. గురువారం హైదరాబాద్‌లో ఐఎస్‌బీ (ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌) ద్విదశాబ్ది వేడుకలు, 2022 పీజీపీ బ్యాచ్‌ విద్యార్థుల స్నాతకోత్సవ సభలో ప్రధాని ప్రసంగించారు. భారత్‌, జీ 20 దేశాల్లో అత్యంత వేగంగా ఎదుగుతున్న దేశమని ఆయన పేర్కొన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా సరఫరా వ్యవస్థలు కుప్పకూలినా, భారత్‌ మాత్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగిపోతోందని తెలిపారు.

ఇవీ మన ఘనతలు

‘గత ఏడాదిలో రికార్డుస్థాయిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)ను ఆకర్షించాం, స్మార్ట్‌ఫోన్‌ డేటా వినియోగంలో ప్రపంచంలోనే మొదటి స్థానం మనది. ఇంటర్నెట్‌ వినియోగదారుల సంఖ్యలో, గ్లోబల్‌ రిటైల్‌ ఇండెక్స్‌లో ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్నాం. మూడో అతిపెద్ద అంకుర వ్యవస్థ మనదే’ అని ప్రధాన మంత్రి తెలిపారు. ‘భారత్‌ అంటే వ్యాపారం’ అని ప్రపంచ దేశాలన్నీ గుర్తిస్తున్నాయని వివరించారు. ‘సంస్కరణ- సాధన- మార్పు’ అనే మంత్రంతో సమర్థ పరిపాలన అందిస్తున్నట్లు తెలిపారు. ‘ఫిన్‌టెక్‌ విభాగంలో ఎటువంటి మార్పులొచ్చాయో చూస్తున్నాం. ఒకప్పుడు బ్యాంకింగ్‌ అనేది సామాన్యులకు అందని ద్రాక్ష. కానీ ఇప్పుడు సామాన్యుల చెంతకే బ్యాంకింగ్‌ లావాదేవీలు దిగివచ్చాయ’ని వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా 40 శాతం డిజిటల్‌ లావాదేవీలు మనదేశంలో జరుగుతున్నాయని తెలిపారు. కరోనా టీకా కోసం విదేశాల వైపు చూసే పరిస్థితి నుంచి, దేశ ప్రజలందరికీ సొంత టీకా ఇవ్వటమే కాకుండా వందకు పైగా దేశాలకు ఎగుమతి చేసిన ఘనత మన సొంతమని వివరించారు. దేశంలో వైద్య కళాశాలల సంఖ్యను 380 నుంచి 600కు పైగా పెంచినట్లు తెలిపారు.

రాబోయే 25 ఏళ్లు కీలకం

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ జరుపుకొంటూ, వచ్చే పాతికేళ్లలో ఏం చేయాలనే అంశంపై దృష్టి సారించినట్లు ప్రధానమంత్రి వెల్లడించారు. ఇందులో యువత భాగస్వామ్యం ముఖ్యమని, ఐఎస్‌బీ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థ నుంచి వచ్చిన మేనేజ్‌మెంట్‌ విద్యార్థుల భాగస్వామ్యం ఉండాలని సూచించారు. ఐఎస్‌బీ దేశానికి గర్వకారణమని, ఇరవై ఏళ్ల క్రితం అప్పటి ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రారంభించిన ఈ సంస్థ వేలమంది మెరికల్లాంటి విద్యార్థులను దేశానికి అందించిందని అన్నారు. ఆసియాలోని అగ్రగామి విద్యాసంస్థల్లో ఒకటిగా స్థానం సంపాదించిన ఐఎస్‌బీ నుంచి బయటకు వస్తున్న విద్యార్థులు, తమ వ్యక్తిగత లక్ష్యాలను దేశ ప్రయోజనాలతో జోడించాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని