మా లక్ష్యం.. ఉజ్వల భారతం

‘సహజ సిద్ధమైన ప్రకృతి సంపద, మానవ వనరులు, అత్యుత్తమ భౌగోళిక పరిస్థితులున్న భారత్‌ను మనసు పెడితే అమెరికాను మించిన ఆర్థిక సామర్థ్యమున్న దేశంగా మార్చవచ్చు. ఇలాంటి ఉజ్వల హిందుస్థాన్‌ను ఆవిష్కరించేందుకు ఎంతైనా శ్రమిస్తామని’ సీఎం కేసీఆర్‌ ప్రకటించారు.

Updated : 27 May 2022 07:17 IST

మూడు నెలల్లో సంచలన వార్తను ప్రకటిస్తాం
దేవేగౌడతో సమావేశానంతరం కేసీఆర్‌ ప్రకటన

దేశంలో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందన్నది ముఖ్యం కాదు.. ఎవరు ప్రధాని అయ్యారన్నదీ కీలకం కాదు.. ప్రస్తుత పాలనలో దేశం స్వాతంత్య్రానికి పూర్వంలాగే ఉంది. మనతో పాటు స్వాతంత్య్రాన్ని పొందిన దేశాలన్నీ ఎంతో పురోగతి సాధించాయి. ప్రస్తుతం దేశ ప్రజలకు ఉజ్వల భారత్‌ అవసరం ఎంతైనా ఉంది.

- సీఎం కేసీఆర్‌


ఈనాడు, బెంగళూరు: ‘సహజ సిద్ధమైన ప్రకృతి సంపద, మానవ వనరులు, అత్యుత్తమ భౌగోళిక పరిస్థితులున్న భారత్‌ను మనసు పెడితే అమెరికాను మించిన ఆర్థిక సామర్థ్యమున్న దేశంగా మార్చవచ్చు. ఇలాంటి ఉజ్వల హిందుస్థాన్‌ను ఆవిష్కరించేందుకు ఎంతైనా శ్రమిస్తామని’ సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఆయన గురువారం బెంగళూరులో మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ, ఆయన కుమారుడు, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామిలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వర్తమాన రాజకీయాలు, ఆర్థిక స్థితిగతులపై చర్చించారు. దాదాపు 3 గంటల పాటు కొనసాగిన ఈ చర్చల తర్వాత సీఎం కేసీఆర్‌.. కుమారస్వామితో కలిసి విలేకరులతో మాట్లాడారు. దేవేగౌడతో జాతీయ రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిపారు. ఈ చర్చలు దేశాన్ని నిర్మాణాత్మకంగా తీర్చిదిద్దే దిశగా కొనసాగాయని చెప్పారు. రెండు, మూడు నెలల్లో సంచలన వార్తను వినిపిస్తామని ప్రకటించారు.

అమెరికాను మించిపోతాం..

మనకంటే తక్కువ జీడీపీ ఉన్న చైనా ప్రస్తుతం 16 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక సామర్థ్యాన్ని సాధిస్తే మనం ఐదు ట్రిలియన్‌ డాలర్ల వద్దనే నిలిచిపోయామని కేసీఆర్‌ తెలిపారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతదేశంలో సమర్థమైన యువశక్తి, మానవ వనరులు, వేలాది టీఎంసీల నీటిలభ్యత, సౌర విద్యుత్తు అందుబాటులో ఉన్నా నేటికీ తాగునీరు, విద్యుత్తు కోసం ఇబ్బంది పడుతున్నామని విచారం వ్యక్తం చేశారు. ‘పరిశ్రమలు మూతపడ్డాయి, జీడీపీ తగ్గింది. ద్రవ్యోల్బణం పెరిగి, రూపాయి విలువ పడిపోయింది. రైతులు, దళితులు, గిరిజనులే కాదు ఎవ్వరూ సంతోషంగా లేరు. ఇది భారత్‌కు అవమానకరమైన సందర్భం. మాధ్యమాలు, బుద్ధి జీవులు నవ భారత నిర్మాణంలో చేతులు కలపాలి’ అని పిలుపునిచ్చారు. సంచలన వార్తలపై దృష్టి సారించకుండా నిర్మాణాత్మక సమాజాన్ని సాధించాలన్నారు. అందరి సహకారంతో దేశంలో మార్పు తథ్యమన్నారు. కుమారస్వామి మాట్లాడుతూ దసరా పండుగ సందర్భంగా దేశానికి ఓ శుభవార్త అందిస్తామని ప్రకటించారు. దేవేగౌడ, కేసీఆర్‌ల చర్చలు దేశానికి సమగ్ర పాలన అందించే దిశగా సాగాయని ఆయన తెలిపారు. ఈ భేటీలో ఎంపీ సంతోష్‌కుమార్‌, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

దేవేగౌడతో భేటీ నిమిత్తం బెంగళూరుకు వచ్చిన కేసీఆర్‌కు స్వాగతం పలుకుతూ పలు వీధుల్లో ఫ్లెక్సీలు వెలిశాయి. గురువారం ఉదయం 11 గంటలకు హెచ్‌ఏఎల్‌ విమానాశ్రయానికి చేరుకున్న కేసీఆర్‌ మధ్యాహ్నం 1:35 గంటలకు పద్మనాభనగరలోని దేవేగౌడ నివాసానికి చేరుకున్నారు. అక్కడ కుమారస్వామి, ఆయన కుమారుడు నిఖిల్‌గౌడలు కేసీఆర్‌కు స్వాగతం పలికారు.  సీఎం కేసీఆర్‌ రాక సమాచారాన్ని అందుకున్న స్థానిక వ్యాపారవేత్తలు, తెరాస అభిమానులు పెద్ద ఎత్తున దేవేగౌడ నివాసానికి తరలి వచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని