
Chandrababu: ఏపీలో అరాచకపాలనపై యుద్ధం
జగన్‌ను ఇంటికి పంపేద్దాం
రైతులూ ఉరేసుకోవద్దు.. ప్రభుత్వాన్నే ఉరితీద్దాం
ఉద్యోగులకు అండగా ఉంటా
సభ చూశాక జగన్‌కు నిద్రపట్టదు
మహానాడు వేదికగా తెదేపా అధినేత చంద్రబాబు
మహానాడు ప్రాంగణం నుంచి ‘ఈనాడు’ ప్రత్యేక ప్రతినిధి: ‘ఆంధ్రప్రదేశ్‌లోని అరాచక విధ్వంసక పాలనపై మహానాడు వేదికగా యుద్ధం మొదలయింది. జగన్ ప్రభుత్వాన్ని ఉరితీద్దాం. ఆయన్ను ఇక ఇంటికి పంపేద్దాం. ముందస్తు ఎన్నికలొచ్చినా సాగనంపేద్దాం’ అని తెదేపా అధినేత చంద్రబాబు మహానాడు వేదికగా పిలుపునిచ్చారు. క్విట్ జగన్.. సేవ్ ఆంధ్రప్రదేశ్ అని 5 కోట్ల మంది ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారని చెప్పారు. ‘మీరంతా తాడోపేడో తేల్చుకోవాలని వచ్చారు.. చైతన్యం, పట్టుదల, కసితో పోరాటంలో పాలుపంచుకోవడానికి నేను సైతం అంటూ తరలివచ్చారు.. ఇప్పుడున్న ముఖ్యమంత్రిని ఎంత తొందరగా ఇంటికి పంపుదామా అన్న ఉత్సాహంతో కదలివచ్చారు.. ఈ రాష్ట్రాన్ని ఉన్మాదుల పాలన నుంచి కాపాడాలని, గాడిలో పెట్టాలని వచ్చారు’ అని చంద్రబాబు పార్టీ శ్రేణులను, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఒంగోలు శివారులోని మండువవారి పాలెంలో శనివారం మహానాడు సందర్భంగా నిర్వహించిన బహిరంగసభలో చంద్రబాబు ప్రసంగించారు.
ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నది వెనుకబడిన వర్గాలు కాదని, సుబ్బారెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డిలేనని ధ్వజమెత్తారు. ‘‘సుబ్రమణ్యం హత్య కేసులో తెదేపా పోరాటంతో ఎమ్మెల్సీ అనంత్బాబును అరెస్టు చేశారు. మరి వివేకానందరెడ్డి హత్య కేసులో భారతి మేనబావ అవినాశ్‌రెడ్డి, ఆయన తండ్రిని అరెస్టు చేయగలరా?’’ అని సవాల్ చేశారు. జగన్ అప్పులు చేసి ఆ సొమ్మంతా తన సొంత ఖజానాకు మళ్లిస్తున్నారన్నారు. ధరలు పెరిగిపోయి, రాష్ట్రాన్ని మరో శ్రీలంకలా మార్చేస్తుంటే ఊరుకుందామా అని ప్రశ్నించారు. ఉద్యోగులకు అండగా ఉండి, వారి తరఫున పోరాడతానని ప్రకటించారు. 25 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా కోసం కేంద్రం మెడలు వంచుతామన్న జగన్ ఇప్పుడు కేంద్రం కాళ్లపై పడుతున్నారని విమర్శించారు. రైల్వేజోన్, వెనుకబడిన ప్రాంతాలకు నిధులు, విభజన హామీలను జగన్ ఏం చేశారని నిలదీశారు. రాజకీయ ఉద్దేశాలతో చేసిన జిల్లాల విభజనను తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే సరిదిద్దుతానని ప్రకటించారు. సభికులంతా ‘సీఎం సీఎం’ అని నినదిస్తుండగా ఉత్సాహంగా ప్రారంభమైన ఆయన ప్రసంగం.. క్రమంగా ఆగ్రహంగా మారి ఆవేశంగా సాగింది. ప్రభుత్వ విధానాలు, అస్తవ్యస్త నిర్ణయాలపై ఆయన సభికులను ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. జన సమూహంతో క్విట్ జగన్...సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ నినాదాలు చేయించారు.
జగన్ అవినీతి రూ.1.75 లక్షల కోట్లు
‘‘రాష్ట్రం అప్పులను జగన్ రూ.8 లక్షల కోట్లకు పెంచారు. ఇదంతా ప్రజలే తీర్చాలి. మరోవైపు కుటుంబానికి రూ.లక్ష భారం వేశారు. కోటీ 50 లక్షల కుటుంబాలకు నెలకు రూ.12 లక్షల భారం అంటే ఎంత? ఈ డబ్బంతా ఏం చేస్తున్నారు? ఊరూపేరూ లేని జేబ్రాండ్ మద్యంతో జనం జేబులు గుల్లచేస్తున్నారు. ఒకప్పుడు క్వార్టరు రూ.9 ఉండేది. ఇప్పుడు రూ.21 అయింది. పెంచిన ఆ రూ.12 జగన్ జేబులోకి వెళ్లిపోతోంది. మద్యం దుకాణాల్లో ఆన్లైన్ చెల్లింపులు వద్దని, నగదు మాత్రమే తీసుకుంటున్నారు. ఆ సొమ్ములో ఏడాదికి రూ.5వేల కోట్లు జగన్ సొంత ఖజానాకు వెళ్లిపోతోంది. ఈ మూడేళ్లలో జగన్ రూ.1.75 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారు. ట్రాక్టరు ఇసుక అప్పట్లో రూ.500-600కు ఇస్తే ఇప్పుడు రూ.5వేలు. (జనంలో నుంచి ఎవరో రూ.6,000అని అరిచారు). ఊళ్లలో మట్టి, బాక్సైట్, లేటరైట్ మొత్తం ఖనిజ సంపద వీరికే కావాలి. బెదిరింపులు, సెటిల్మెంట్లు. ఎకరం రూ.5 లక్షలు, రూ.6 లక్షలున్న భూమిని ప్రభుత్వ అవసరాలకు రూ.కోటికి కొని పంచుకు తినేస్తున్నారు. బద్వేల్లో రికార్డులు మార్చేసి, 800 ఎకరాలు ఆక్రమించేశారు. రోజూ 500 నుంచి 1000 లేటరైట్ లారీలు భారతీ సిమెంట్‌కు వెళ్లిపోతున్నాయి. సిమెంటు ధర మాత్రం తగ్గించరు.
శ్రీలంకలా మార్చేస్తున్నారు.. ఊరుకుందామా?
సినిమా వాళ్లనీ గుప్పిట్లో పెట్టుకోవాలనుకున్నారు. బాలకృష్ణ అఖండ సినిమా ఆడనివ్వకూడదని ప్రత్యేక ఆటలకు అనుమతివ్వలేదు. విడుదలై బ్రహ్మాండంగా ఆడింది. గడపగడపకు వైఎస్సార్ పార్టీ అని వెళ్తే ప్రజలు నిలదీస్తారని భయపడి.. గడప గడపకు ప్రభుత్వం అని మార్చారు. పోలీసులను వెంట తీసుకువెళ్లి ప్రజలు నిలదీయకుండా అడ్డుకోవాలనుకున్నారు. జీవితాలను నాశనం చేసి ఏ మొహం పెట్టుకుని వస్తున్నారంటూ ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీయాలి. పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి. రేపే మాపో రాష్ట్రం శ్రీలంకలా మారిపోయేలా ఉంది. అయినా ఊరుకుందామా? ఎన్ని కేసులైనా పెట్టుకోండి. భయపడను. బుల్లెట్లా దూసుకొస్తా.
సంక్షేమం ఎవరు చేశారు?
రాష్ట్రంలో సంక్షేమానికి నాంది పలికింది తెదేపా, ఎన్టీఆర్. రూ.2కిలో బియ్యం, పక్కా ఇళ్లు, చీర, ధోవతి ఇచ్చిందెవరు, వ్యవసాయ పంపుసెట్లకు మోటార్లు లేకుండా చేసిందెవరు? సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, చంద్రన్న బీమా, నిరుద్యోగ భృతి, విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇచ్చిందెవరు? విదేశీ విద్యను అందించింది మేం కాదా? మా హయాంలో సంక్షేమానికి 51 శాతం ఖర్చు చేస్తే వైకాపా 41 శాతానికి తగ్గించింది. ఆయన పాలనలో ప్రజల ఆదాయం పెరగలేదు. ఖర్చులు పెరిగాయి. రాష్ట్రంలో ఎవరైనా ఆనందంగా ఉన్నారా? ఆస్పత్రుల్లో మందులున్నాయా? వ్యవసాయశాఖ పనిచేస్తోందా? రైతులు చితికిపోయారా లేదా? ఆత్మహత్యలు పరిష్కారం కాదు. వైకాపాను ఉరితీద్దాం రండి. ఎవరికైనా ఉద్యోగాలు వచ్చాయా? నేను ఐటీ, టీచరు, పోలీసు ఉద్యోగం ఇస్తే.. జగన్ వాలంటీరు ఉద్యోగం ఇచ్చాడు. ఆఖరికి పాచిపని చేసుకోవాలన్నా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వెళ్లాల్సిన దుస్థితి వచ్చింది. గతంలో నేను రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాను. జగన్ దావోస్ వెళ్లి ఏం తెచ్చారు? అదానీ, గ్రీన్ కోతో ఒప్పందాలు కుదుర్చుకున్నది నేను కాదా?
సెల్‌ఫోనే ఆయుధంగా పోరాడదాం
మహానాడుకు వచ్చిన భారీ స్పందన వారి సొంత మీడియాకు కనిపిస్తోందా? మీడియానూ ప్రభుత్వం భయపెడుతోంది. మీ సమస్యలన్నింటినీ సెల్‌ఫోనే ఆయుధంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయండి. కేసులు పెడతారని భయపడొద్దు. నేను అండగా ఉంటా. మీకోసం ఉద్యమిస్తా.
జగన్‌కు ఇక నిద్రలేని రాత్రులే
‘మన సభ చూసి ఈరోజు నుంచి జగన్‌కు నిద్రపట్టదు. డబ్బులు కడతామన్నా మహానాడుకు బస్సులివ్వలేదు. ప్రైవేటు వాహనాలను రానివ్వలేదు. సభకు వచ్చే కార్లలో గాలి తీసేశారు. పోలీసులూ.. మీ గాలి నేను తీసేస్తా. మాకు అడ్డు రాకండి.. మా శాంతిభద్రతలు మేమే చూసుకుంటామని చెప్పాం. అదుపు తప్పితే పోలీసులనూ నియంత్రించే శక్తి తెలుగు తమ్ముళ్లకు ఉంది. బస్సులు నిలిపివేస్తే మనుషులు రారనుకున్నారు. ఇబ్బందిపెడితే భయపడతామనుకున్నారు. మంత్రులతో యాత్ర పెడితే జనాలు నమ్ముతారనుకున్నారు. వారి సభలు వెలవెలపోతే మన సభలు కళకళలాడాయి. మహానాయకుడు ఎన్టీఆర్ వారసులం మనం. ఆయన స్ఫూర్తితో ప్రజల కోసం కొండనైనా బద్దలుకొట్టగలం. ఎన్టీఆర్ శతజయంతి సంవత్సరం సందర్భంగా ఏడాదంతా కార్యక్రమాలు నిర్వహించి, ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళతాం. జిల్లాల్లో మినీ మహానాడు నిర్వహిస్తాం.
సామాజిక న్యాయం ఎవరికి?
వైకాపా నిజంగా సామాజిక న్యాయం చేసింది ఎవరికి? రాజ్యసభ సీట్లు ఆంధ్రవాళ్లకు 6, తెలంగాణకు 2, ముంబయి వారికి ఒకటి ఇచ్చారు. తనతోపాటు సీబీఐ కేసుల్లో ఉన్న ముగ్గురు నిందితులతోపాటు.. తెదేపా నుంచి తీసుకున్న ఇద్దరికి, సీబీఐ కేసులు వాదించే మరొకరికి అవకాశం కల్పించారు. బీసీలకు ఆదరణపథకం లేదు. ఎస్సీలకు ఉప ప్రణాళిక అమల్లేదు. 29కార్యక్రమాలను తీసేశారు. నిజమైన సామాజిక న్యాయం పాటించింది తెదేపానే. వైకాపా ప్రభుత్వం ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయలేదు. సీపీఎస్ రద్దు చేయలేదు. టీడీ, డీఏలు ఇవ్వడం లేదు. విలేకర్లకు ఇళ్లస్థలాలు, అక్రిడిటేషన్ ఇవ్వలేదు. కరోనాతో చనిపోయినవారికి పరిహారం చెల్లించలేదు. అందరికీ న్యాయం చేస్తా.
అమరావతి, పోలవరం ఏమయ్యాయి?
ఎన్నికలకు ముందు అమరావతి కొనసాగిస్తామని చెప్పిన జగన్‌రెడ్డి.. ఇప్పుడు దాన్ని నాశనం చేశారు. నీటిపారుదల ప్రాజెక్టులపై రూపాయి ఖర్చు చేయలేదు. పోలవరాన్ని మేం 72%పూర్తి చేస్తే ఈ మూడేళ్లలో మిగిలింది కట్టలేకపోయారు. రివర్స్‌టెండర్ల పేరుతో ప్రాజెక్టునే రివర్స్ చేసేశారు. వెలిగొండ ప్రాజెక్టుపై రూ.1,500 కోట్లు ఖర్చుచేశాం. తెదేపా ప్రభుత్వం ఉంటే మూడు నెలల్లో దాన్ని పూర్తి చేసి నీరిచ్చేది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టుతో పాటు ప్రకాశం జిల్లాలోని అన్ని ప్రాజెక్టులు పూర్తిచేస్తాం. అప్పులకు కక్కుర్తిపడి రైతుల మోటార్లకు మీటర్లు పెట్టి, వారి జీవితాలు నాశనం చేయాలని జగన్ చూస్తున్నారు’’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు. మహానాడు సభకు భూములిచ్చిన రైతులను అభినందించారు.
అధికారం కోసం కులమతాల మధ్య గొడవలు పెడతారు
‘మహానాడు జరగకుండా జగన్మోహన్రెడ్డి కుట్రలు, కుతంత్రాలు పన్నారు. లక్షల మంది వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఇది జగన్‌కు, వైకాపాకు చెంపదెబ్బ. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని రూ.లక్ష కోట్లు దోపిడీ చేసి 16 నెలలు జైల్లో ఉన్న దొంగకు 2019 ఎన్నికల్లో ఓట్లు వేశారు. మూడేళ్లలో ఏ ప్రాంతమైనా ఏ వర్గమైనా సంతోషంగా ఉందా? పదవి కోసం ఏ ఇబ్బంది పెట్టడానికైనా ఆయన సిద్ధపడతారు. అధికారం కోసం ప్రాణాలతో చెలగాటమాడతారు. తెదేపా గెలుస్తుందని తెలిసే.. అమలాపురంలో వారి మంత్రి ఇంటిని జగన్ డైరెక్షన్లో తగులబెట్టి అల్లకల్లోలం చేశారు. రాష్ట్రంలో మంచి రోజులు రావాలంటే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు మంచి రోజులు రావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి.’
- కె.అచ్చెన్నాయుడు, తెదేపా ఏపీ అధ్యక్షుడు
దేశమంటే మనుషులు కాదు.. మట్టి అన్నట్లు వైకాపా పాలన
‘మనం మనం కలిస్తే జనం.. జనం జనం కలిస్తే సునామీ.. ప్రభంజనం. ఉప్పొంగిన సముద్రంలా మహానాడుకు పసుపు సైన్యం తరలివచ్చింది. ప్రపంచ పటంపై తెలుగు సంతకం, తెలుగు ఆత్మ గౌరవానికి ఆరడుగుల ప్రతిరూపం.. తెలుగుజాతి చైతన్యానికి విశ్వరూపం నందమూరి తారకరామారావు. సామాజిక సమస్యలు, పేదల ఇబ్బందులను అంశాలుగా ఎంచుకుని సినిమాలు చేశారు. అందుకే ఆయన అందరి గుండెల్లో శాశ్వతంగా నిలిచారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను అధికార పీఠంపై కూర్చోబెట్టి గౌరవించారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. జగన్ పాలనలో పెట్రోలు, డీజిల్ రేట్లు పెంచారు. విద్యుత్తు ఛార్జీలు మూడేళ్లలో ఏడు సార్లు పెంచారు. దేశమంటే మనుషులు కాదు.. దేశమంటే మట్టి అన్నట్లుగా వైకాపా అధికారం చెలాయిస్తోంది. తెదేపాను అధికారంలోకి తెస్తేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుంది’
- బాలకృష్ణ, సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే
రాక్షసుడి పాలనలో విధ్వంసం
‘చంద్రబాబు రాముడైతే.. జగన్ రాక్షసుడు. రాముడి పాలనలో నిర్మాణం జరిగింది. రాక్షసుడి పాలనలో విధ్వంసం జరుగుతోంది. చంద్రబాబుకు ముందుచూపుంటే.. జగన్‌కు ‘మందు’ చూపుంది. జగన్ ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి జేసీబీ పాలన సాగుతోంది. ప్రజా వేదిక కూల్చారు. అక్కడి నుంచి పేద ప్రజల ఇళ్లపై పడ్డారు. కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. అణచివేత అధికమైతే తిరుగుబాటు తీవ్రమవుతుంది. ఆ తిరుగుబాటు ఒంగోలు గడ్డ నుంచి ప్రారంభమైంది’
- లోకేశ్, తెదేపా ప్రధాన కార్యదర్శి
విడిపోయాక విభిన్న పరిస్థితులు..
రెండు రాష్ట్రాలుగా విడిపోయాక విభిన్న పరిస్థితులు తలెత్తాయి. తెలంగాణలో దొరల పాలన, ఆంధ్రలో దొంగల పాలన. మాకు సచివాలయం లేదు, మీకు రాజధాని లేదు. మా దగ్గర ప్రభుత్వ భూములు అమ్ముతున్నారు. మీ దగ్గర ప్రభుత్వ ఆస్తులు తనఖా పెడుతున్నారు. తెలంగాణలో యువతకు గొర్లు కాసే పని.. ఆంధ్రలో జగన్‌రెడ్డి మటన్‌షాపుల ద్వారా గొర్లు కోసే పని ఇచ్చారు. అక్కడ కల్వకుంట్ల రాజ్యాంగం, ఇక్కడ రాజారెడ్డి రాజ్యాంగం వచ్చాయి.
ఆకట్టుకున్న పిట్టకథ: ‘నాలుగెకరాల భూమిలో నాట్లు వేసిన ఒకావిడ.. ఇటీవలే కుమారుడికి పెళ్లి చేసింది. శోభనం రోజున పెళ్లి కుమారుడు.. గదిలో అడుగుపెట్టగానే తల్లి రాములయ్యా కరెంటొచ్చింది జర మోటారు పెట్టిరాయ్యా.. అని పిలిచింది. కుమారుడు సైకిలేసుకుని పొలానికి పోయి మోటారు వేయగానే మళ్లీ కరెంటు పోయింది. అక్కడుండి ఏం చేస్తామని మళ్లీ ఇంటికొచ్చి గదిలోకి పోయాడు. అంతలోనే మళ్లీ తల్లి.. కరెంటొచ్చింది.. మోటారు వేసి రమ్మని పిలిచింది.. ఇలా ఉదయం వరకు వెళ్లి రావడమే సరిపోయింది. దీంతో పెళ్లి కుమార్తె.. రూ.6 లక్షలు ఇచ్చి చేసుకుంటే అటు ఇటు తిరుగుతున్నవ్.. అంటూ వదిలేసి పోయింది. దీంతో పెద్ద మనుషులు వెళ్లి మాట్లాడి.. పవర్ ప్రాబ్లమ్ పిల్లగానికి కాదు.. ప్రభుత్వానిదని వివరించారు. అందుకే చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది’
- నర్సిరెడ్డి, పార్టీ తెలంగాణ నాయకులు
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Joe root: కోహ్లీ,స్మిత్‌లను దాటేసిన రూట్
-
General News
Knee Problem: మోకాళ్ల నొప్పులా..? ఇలా చేయండి
-
Politics News
Andhra News: అధికార పార్టీ అయినా... నెల్లూరు జిల్లాలో ఆ ఎమ్మెల్యే తీరే వేరు!
-
Movies News
Happy Birthday: అతిథిగా టామ్ క్రూజ్.. సరదాగా ‘హ్యాపీ బర్త్‌డే’ ప్రీ రిలీజ్ ఈవెంట్
-
General News
Cancer treatment: క్యాన్సర్ చికిత్స తర్వాత ఏం చేయాలి..?
-
India News
Rahul Gandhi: భాజపా ముఖ్య సమస్యల్ని మేనేజ్ చేస్తూ.. ఆర్థిక వ్యవస్థను దిగజారుస్తోంది: రాహుల్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Venu: అందుకే సినిమాలకు దూరంగా ఉన్నా: వేణు తొట్టెంపూడి
- Rajya Sabha: రాజ్యసభకు ఇళయరాజా, విజయేంద్రప్రసాద్.. మోదీ కంగ్రాట్స్
- Venu Madhav: ఒక్క సీన్ అనుకుంటే మూడు సీన్లు అయ్యాయి
- Trending English words:ఈ 10 ట్రెండింగ్ ఇంగ్లిష్ పదాల గురించి తెలుసా?
- Driver Jamuna: ‘డ్రైవర్ జమున’గా ఐశ్వర్య రాజేశ్.. ఉత్కంఠ భరితంగా ట్రైలర్
- Amazon Prime Day sale: అమెజాన్ ప్రైమ్ డే సేల్ తేదీలు ఫిక్స్.. ఈ కార్డులపై ప్రత్యేక ఆఫర్లు!
- Andhra News: అధికార పార్టీ అయినా... నెల్లూరు జిల్లాలో ఆ ఎమ్మెల్యే తీరే వేరు!
- Happy Birthday: అతిథిగా టామ్ క్రూజ్.. సరదాగా ‘హ్యాపీ బర్త్‌డే’ ప్రీ రిలీజ్ ఈవెంట్
- Telangana News: నిమ్జ్ కోసం బలవంతపు భూసేకరణ.. రైతు బిడ్డ ఆవేదన
- ఒకటే గొప్పనుకుంటే.. ఆరు చోట్ల సాధించింది!