ప్రముఖ రచయిత శీలా వీర్రాజు కన్నుమూత

ప్రముఖ అభ్యుదయ రచయిత, కవి, చిత్రకారుడు శీలా వీర్రాజు (83) తన అక్షరయాత్రను ముగించారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం రాత్రి ఏడు గంటలకు

Published : 02 Jun 2022 05:04 IST

రవీంద్రభారతి, న్యూస్‌టుడే: ప్రముఖ అభ్యుదయ రచయిత, కవి, చిత్రకారుడు శీలా వీర్రాజు (83) తన అక్షరయాత్రను ముగించారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం రాత్రి ఏడు గంటలకు హైదరాబాద్‌ సరూర్‌నగర్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. ఇటీవల ఆయనకు శస్త్రచికిత్స జరిగింది. నాలుగు రోజుల కిందటే ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకొచ్చారు. గుండెకు శస్త్రచికిత్స చేయాల్సి ఉండగా హఠాత్తుగా మృతి చెందారు. ఆయన భార్య శీలా సుభద్రాదేవి కూడా సుప్రసిద్ధ రచయిత్రి, కవయిత్రి. ఈ దంపతులకు కుమార్తె పల్లవి ఉన్నారు. వీర్రాజు రాజమహేంద్రవరంలో 1939 ఏప్రిల్‌ 22న జన్మించారు. విద్యాభ్యాసం కూడా అక్కడే జరిగింది. కళాశాలలో చదివే రోజుల్లోనే కథలు రాయడం మొదలుపెట్టారు. 1957 నుంచి 1976 వరకు ఎనిమిది కథా సంపుటాలు తీసుకొచ్చారు. 1961లో హైదరాబాద్‌కు వచ్చిన ఆయన రెండేళ్ల పాటు కృష్ణాపత్రికలో పనిచేశారు. తర్వాత 1963 జులై నుంచి 1990 జనవరి 31 వరకు సమాచార, పౌర సంబంధాల శాఖలో అనువాదకుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. సాహితీ మిత్రులంతా ఆయనను ‘శీలావి’ అని ప్రేమగా పిలిచేవారని ప్రముఖ రచయిత నాళేశ్వరం శంకరం తెలిపారు. చిత్రకారుడు కూడా అయిన వీర్రాజు ఎందరో ప్రముఖ రచయితల గ్రంథాలకు ముఖచిత్రాలు గీశారు. 1967లో ‘కొడిగట్టిన సూర్యుడు’ కథాసంపుటికి ‘ఫ్రీవర్స్‌ ఫ్రంట్‌’ మొదటి పురస్కారాన్ని అందుకున్నారు. 1969లో మైనా నవలకు ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ పురస్కారం, 1991లో ‘శీలా వీర్రాజు కథలు’ సంపుటానికి తెలుగువర్సిటీ బహుమతి, 1994లో కొండేపూడి శ్రీనివాస్‌రావు సాహితీ సత్కారం, డా.బోయి భీమన్న వచన కవితా పురస్కారం తెలుగు విశ్వవిద్యాలయం ద్వారా అందుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు