Govt Jobs: 1,326 వైద్య పోస్టులకు పచ్చ జెండా

రాష్ట్రంలో 1,326 వైద్యుల పోస్టులను భర్తీ చేయడానికి రంగం సిద్ధమైంది. ఈ మేరకు బుధవారం వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు(ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) ప్రకటనను వెలువరించింది. ఇందులో ప్రజారోగ్య విభాగంలో 751 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌

Updated : 16 Jun 2022 05:39 IST

 నియామక ప్రకటన వెలువరించిన వైద్య బోర్డు

ఒప్పంద, పొరుగు సేవల్లో వారికి 20 పాయింట్ల వెయిటేజి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో 1,326 వైద్యుల పోస్టులను భర్తీ చేయడానికి రంగం సిద్ధమైంది. ఈ మేరకు బుధవారం వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు(ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) ప్రకటనను వెలువరించింది. ఇందులో ప్రజారోగ్య విభాగంలో 751 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులు, వైద్య విద్య సంచాలకుల విభాగంలో 357 ట్యూటర్‌ పోస్టులు, వైద్య విధాన పరిషత్‌ పరిధిలో 211 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ జనరల్‌/జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ పరిధిలో 7 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులున్నాయి. ఈ నియామక ప్రకటన ద్వారా కొత్తగా నియమితులయ్యే వైద్యులు ప్రైవేటు ప్రాక్టీసు చేయరాదంటూ నిబంధనను విధించారు. ఎంబీబీఎస్‌, తత్సమాన అర్హత సాధించిన వారు ఈ పోస్టులకు అర్హులు. అభ్యర్థులు ఆగస్టు 14 సాయంత్రం 5 గంటలలోపు https://mhsrb.telangana.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు రుసుం రూ.200 ఆన్‌లైన్‌లో చెల్లించాలి. దరఖాస్తు పరిశీలన రుసుం రూ.120 మాత్రం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌, పీహెచ్‌, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ తదితర కేటగిరీలకు చెందినవారు చెల్లించక్కర్లేదు. మిగిలిన వారు పరిశీలన రుసుం చెల్లించాలి. అభ్యర్థులు 18-44 ఏళ్ల మధ్య వయస్కులై ఉండాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్లు(టీఎస్‌ఆర్‌టీసీ, కార్పొరేషన్లు, పురపాలికల్లో పనిచేసే వారికి వర్తించదు), ఎక్స్‌ సర్వీస్‌మెన్‌కు మూడేళ్లు, ఎన్‌సీసీకి మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌కు ఐదేళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల వరకూ వయోపరిమితిని సడలించారు. ఈ పోస్టులన్నీ మల్టీజోనల్‌కు చెందినవి. ఇందులో స్థానిక అభ్యర్థులకు రిజర్వేషన్లు 95 శాతం వర్తిస్తాయి. వంద పాయింట్లను పరిగణనలోకి తీసుకొని అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందులో ఎంబీబీఎస్‌లో సాధించిన మార్కులను 80 పాయింట్లకు లెక్కిస్తారు. విదేశాల్లో వైద్యవిద్య పూర్తి చేసిన అభ్యర్థులకు మాత్రం వారి ఎంబీబీఎస్‌ మార్కులను పరిగణనలోకి తీసుకోరు. భారత్‌లో నిర్వహించే ‘ఫారెన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్స్‌ ఎగ్జామ్‌(ఎఫ్‌ఎంజీఈ)లో వారు సాధించిన మార్కులను లెక్కలోకి తీసుకుంటారు.

వెయిటేజికి కనీసం ఆర్నెల్ల నిబంధన

రాష్ట్ర ప్రభుత్వ వైద్యంలో ఒప్పంద, పొరుగు సేవల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు 20 పాయింట్లను వెయిటేజిగా నిర్దేశించారు. ఈ పాయింట్లను కూడా ప్రాంతాల వారీగా విభజించారు. గిరిజన ప్రాంతాల్లో 6 నెలల పాటు పనిచేసిన వారికి 2.5 పాయింట్ల చొప్పున.. గిరిజనేతర ప్రాంతాల్లో పనిచేసిన వారికి ఆర్నెల్లకు 2 చొప్పున కేటాయిస్తారు. కనీసం ఆర్నెల్లు పనిచేసి ఉండాలనే నిబంధన విధించారు. వెయిటేజి ధ్రువపత్రాలను విభాగాధిపతుల నుంచి పొందాలి. ఇలా ఏ పోస్టుకు సంబంధించిన ధ్రువపత్రం పొందితే.. అదే పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలి.నిర్దేశించిన ప్రొఫార్మాలోనే ధ్రువపత్రాన్ని పొందాలి.వెయిటేజి మార్కులను నియామక ప్రకటన వెలువడిన తేదీ నాటికి లెక్కిస్తారు.

ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాల్సిన పత్రాల వివరాలు 

* ఆధార్‌ కార్డు

* ఎస్‌ఎస్‌సీ లేదా పదోతరగతి ధ్రువపత్రం

* ఎంబీబీఎస్‌ మార్కుల మెమో

* ఎంబీబీఎస్‌ సర్టిఫికెట్‌

* విదేశాల్లో అభ్యసించిన అభ్యర్థులైతే ఎఫ్‌ఎంజీఈ మార్కుల మెమో, సర్టిఫికెట్‌

* తెలంగాణ వైద్య మండలి రిజిస్ట్రేషన్‌ ధ్రువపత్రం

* ఒకటి నుంచి ఏడో తరగతి వరకూ విద్యాభ్యాస ధ్రువపత్రం

* ఇక్కడి పాఠశాలల్లో 1-7వ తరగతి వరకూ చదువుకోని అభ్యర్థులు స్థానికత సర్టిఫికెట్‌

* ఎస్సీ, ఎస్టీ, బీసీలైతే సంబంధిత కుల ధ్రువీకరణ పత్రాలు

* బీసీలైతే నాన్‌ క్రీమీలేయర్‌ సర్టిఫికెట్‌

* ఈడబ్ల్యూఎస్‌ కోటా అభ్యర్థులు తాజా ఆదాయ, ఆస్తుల అంచనా ధ్రువపత్రం

* క్రీడాకారులు సంబంధిత క్రీడా ధ్రువపత్రం

* దివ్యాంగులు సదరం.. ఎక్స్‌సర్వీస్‌మెన్‌, ఎన్‌సీసీ అయితే సంబంధిత ధ్రువపత్రం

* అభ్యర్థి ఫొటో, సంతకం ఫొటో

* అభ్యర్థులు దరఖాస్తు పత్రంలోని అన్ని కాలమ్స్‌ తప్పనిసరిగా పూర్తిచేయాలి. అసంపూర్తి దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోరు.

* తప్పుడు ధ్రువపత్రాలను సమర్పించిన వారిని అనర్హులుగా ప్రకటిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని