Updated : 23 Jun 2022 06:51 IST

Uddhav Thackeray: ఉద్ధవ్‌ రాజీనామా?

 వైదొలగేందుకు సిద్ధమన్న కాసేపటికే అధికార నివాసం ఖాళీ

స్వగృహం ‘మాతోశ్రీ’కి చేరిక

ముఖ్యమంత్రి పదవిని శిందేకు ఇద్దామన్న పవార్‌!

అదేమీ లేదన్న సంజయ్‌ రౌత్‌...

బలపరీక్షకు సిద్ధమేనని ప్రకటన

భాజపాతో వెళ్దామంటున్న ఏక్‌నాథ్‌

గువాహటికి మారిన శిబిరం

ముంబయి/గువాహటి: సొంత పార్టీలో తిరుగుబాటుతో తీవ్ర కలత చెందిన శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారా!  ఆయన దక్షిణ ముంబయిలోని అధికారిక నివాసం ‘వర్ష’ను బుధవారం రాత్రి ఖాళీ చేసి తన సొంత గృహం బాంద్రాలోని ‘మాతోశ్రీ’కి వెళ్లడం ఆ ఊహాగానాలకు బలమిస్తోంది. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ శిందేను ముఖ్యమంత్రిగా చేద్దామని అధికార మహా వికాస్‌ అఘాడీ (ఎంవీఏ) కూటమిలో కీలక నేత, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ ప్రతిపాదించినట్లు వార్తలు వచ్చాయి. బుధవారం సాయంత్రం శివసేన ఎమ్మెల్యేలు, ఆ పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఫేస్‌బుక్‌ లైవ్‌ ద్వారా ప్రసంగించిన ఠాక్రే..సీఎం పదవి నుంచి, శివసేన అధ్యక్ష పదవి నుంచి వైదొలిగేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైనా వచ్చి తన రాజీనామా లేఖను తీసుకెళ్లి రాజ్‌భవన్‌లో ఇవ్వవచ్చని అన్నారు. ఈ పరిణామాలన్నిటి నేపథ్యంలో సీఎం పదవికి ఉద్ధవ్‌ రాజీనామా చేసి ఉండవచ్చనే వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే, ఠాక్రే సీఎం పదవికి రాజీనామా చేశారన్న ప్రచారాన్ని శివసేన అధికార ప్రతినిధి, ఎంపీ సంజయ్‌ రౌత్‌ తోసిపుచ్చారు. అవసరమైతే అసెంబ్లీలో బలపరీక్షకు ఎంవీఏ కూటమి సిద్ధంగా ఉందన్నారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం ఏక్‌నాథ్‌ను ముఖ్యమంత్రిని చేద్దామంటూ శరద్‌ పవార్‌ సూచించారనే ప్రచారాన్నీ రౌత్‌ తోసిపుచ్చారు. పవార్‌ అలాంటి సలహానే ఇవ్వలేదని, ప్రస్తుత రాజకీయ సంక్షోభాన్ని ఐక్యంగా ఎదుర్కొందామని చెప్పారని తెలిపారు.

మాదే అసలైన శివసేన: శిందే

అసమ్మతి ఎమ్మెల్యేలతో గుజరాత్‌లోని సూరత్‌ నుంచి బుధవారం ఉదయం అస్సాం ప్రధాన నగరం గువాహటికి చేరుకున్న తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ శిందే తమదే అసలైన శివసేన అని ప్రకటించారు. తనకు 34 మంది శివసేన ఎమ్మెల్యేల మద్దతుందని పేర్కొంటూ ఆ మేరకు వారి సంతకాలతో కూడిన తీర్మానాన్ని బుధవారం సాయంత్రం విడుదల చేశారు. పార్టీ శాసనసభా పక్ష నేతగా వారు తనను ఎన్నుకున్నట్లు తెలిపారు. మంగళవారం ఆయనను ఆ పదవి నుంచి ఉద్ధవ్‌ ఠాక్రే తొలగించిన విషయం తెలిసిందే. ప్రస్తుత శివసేన చీఫ్‌ విప్‌ సునీల్‌ ప్రభును తొలగించి ఆ స్థానంలో తమ వర్గానికి చెందిన భరత్‌ గొగవాలేను నియమించినట్లు కూడా పేర్కొన్నారు. అంతకుముందు ముంబయిలో నిర్వహిస్తున్న పార్టీ శాసనసభా పక్ష భేటీకి హాజరుకావాలంటూ సునీల్‌ ప్రభు లేఖ రాయడాన్ని శిందే తప్పుపట్టారు. గైర్హాజరైన వారిపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాల్సి వస్తుందని సునీల్‌ ఆ లేఖలో హెచ్చరించారు. చీఫ్‌విప్‌గా సునీల్‌ నియామకం చెల్లదని, తమ చీఫ్‌ విప్‌ భరత్‌ జారీ చేసిన నోటీసే చెల్లుబాటవుతుందని శిందే ట్వీట్‌ చేశారు.

‘అపవిత్ర కూటమి...అవినీతి ప్రభుత్వం’

కాంగ్రెస్‌, ఎన్సీపీ, శివసేనల కూటమి అపవిత్రమైనదని, ఎంవీఏ సంకీర్ణ ప్రభుత్వం అవినీతిమయమని శిందే ధ్వజమెత్తారు. శివసేన ఆ కూటమి నుంచి బయటకు వచ్చి భాజపాతో చేతులు కలపాలని డిమాండ్‌ చేశారు. ఇదే విషయాన్ని మంగళవారం తనకు ఫోన్‌ చేసిన ఉద్ధవ్‌ ఠాక్రేకు స్పష్టం చేసినట్లు వెల్లడించారు. ఎంవీఏ సర్కారును శివసేన ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేక పోతున్నారని, అందుకే తిరుగుబాటు చేయాల్సి వచ్చిందని సమర్థించుకున్నారు. స్వతంత్రులతో కలిసి తనకు మొత్తం 46 మంది ఎమ్మెల్యేల మద్దతుందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా బుధవారం సాయంత్రం సూరత్‌ మీదుగా మరో నలుగురు ఎమ్మెల్యేలు గువాహటీలోని అసమ్మతి శిబిరానికి చేరుకున్నారు. వీరిలో ఇద్దరు శివసేనకు చెందిన వారు కాగా మిగిలిన ఇద్దరు స్వతంత్రులు. శాసనసభలో శివసేనకు మొత్తం 55 మంది ఎమ్మెల్యేలున్నారు.

అంతకుముందు బుధవారం ఉదయం సూరత్‌ నుంచి ప్రత్యేక విమానంలో సహచరులతో కలిసి ఏక్‌నాథ్‌ శిందే గువాహటి చేరుకున్నారు. ఆ తర్వాత నగరంలోని విలాసవంతమైన ర్యాడిసన్‌ బ్లూ హోటల్‌కు వెళ్లారు. శాసనసభ్యులు బస చేసిన హోటల్‌ను అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, జలవనరుల శాఖ మంత్రి పీయూష్‌ హజారికా సందర్శించినట్లు తెలిసింది.


హిందుత్వను వదిలిపెట్టలేదు: ఉద్ధవ్‌ ఠాక్రే

లవంతంగా తమను తీసుకెళ్లారని తిరుగుబాటు శిబిరంలో ఉన్న ఎమ్మెల్యేలు కొందరు ఫోన్‌ చేసి చెప్పారని ఉద్ధవ్‌ ఠాక్రే తెలిపారు. వారు ముంబయికి తిరిగి వచ్చేయాలనుకుంటున్న చెప్పారన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు తన వద్దకు వచ్చి ఏ ఒక్కరు తనను రాజీనామా చేయమని కోరినా వెంటనే పదవి నుంచి వైదొలగుతానని ఠాక్రే చెప్పారు. తన తర్వాత కూడా శివసేన నేతే సీఎం అయితే సంతోషిస్తానని పేర్కొన్నారు. ఏక్‌నాథ్‌ శిందే తిరుగుబాటు బావుటా ఎగురవేసిన తర్వాత తొలిసారి ఫేస్‌బుక్‌ లైవ్‌లో బుధవారం సాయంత్రం ఠాక్రే..శివసేన ఎమ్మెల్యేలను, పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఉద్వేగంగా ప్రసంగించారు. హిందుత్వమే శివసేన భావజాలమని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులతో భేటీ కావడం లేదన్న విమర్శలపై స్పందిస్తూ...‘గత ఏడాది వెన్నెముకకు శస్త్రచికిత్స వల్ల ప్రజలను కలుసుకోలేకపోయాన’ని తెలిపారు. పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని సమర్థంగా నడపలేనని ఎమ్మెల్యేలు భావిస్తే తన రాజీనామా లేఖను తీసుకెళ్లి రాజ్‌భవన్‌లో ఇవ్వొచ్చని అన్నారు. ఠాక్రేకు కొవిడ్‌ సోకడంతో ఫోన్‌, వీడియో కాల్‌ ద్వారానే ఆయన ఎమ్మెల్యేలు, ఇతర పార్టీల నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. వైరస్‌ లక్షణాలు కనిపించడంతో రాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ(80) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

‘బలవంతంగా ఇంజెక్షన్లు ఇచ్చారు’

రెబల్‌ మంత్రి ఏక్‌నాథ్‌ శిందేతో సూరత్‌ వెళ్లిన శివసేన ఎమ్మెల్యే నితిన్‌ దేశ్‌ముఖ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది వ్యక్తులు తనను బలవంతంగా ఆస్పత్రికి తీసుకెళ్లి.. ఇంజెక్షన్లు ఇచ్చారని తెలిపారు. ఎలాగోలా తప్పించుకుని సురక్షితంగా మహారాష్ట్రకు రాగలిగానని చెప్పారు. ఉద్ధవ్‌ ఠాక్రేకే తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని