Updated : 23 Jun 2022 07:36 IST

రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాలను ప్రోత్సహించాలి

అప్పుడే దేశంలో పరిశ్రమల స్థాపనకు ఊతం

ఆత్మనిర్భర్‌ భారత్‌ కోసం పునరాలోచించుకోవాలి

కేంద్రానికి మంత్రి కేటీఆర్‌ సూచన

జహీరాబాద్‌ నిమ్జ్‌లో తొలి పరిశ్రమకు భూమిపూజ

ఈనాడు - సంగారెడ్డి

తెలంగాణ మాదిరిగా అభివృద్ధిలో పరుగులు తీస్తున్న రాష్ట్రాలను ప్రోత్సహించే విధంగా కేంద్ర ప్రభుత్వం పనిచేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌-బెంగళూరు మధ్య డిఫెన్స్‌ ఇండస్ట్రియల్‌ ప్రొడక్షన్‌ కారిడార్‌ను ఏర్పాటు చేయాలని గతంలో రక్షణమంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్‌ను కోరామన్నారు. తమ మాటలను బేఖాతరు చేసి బుందేల్‌ఖండ్‌కు తీసుకెళ్లారన్నారు. పరిశ్రమ వేళ్లూనుకున్న చోట కాకుండా... ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓట్లున్నాయి.. సీట్లున్నాయంటూ రాజకీయ ఆపేక్షతో పోతామంటే పని జరగదన్నారు. దేశంలో పరిశ్రమలకు ఊతమివ్వాలన్నా, ఆత్మనిర్భర్‌ భారత్‌ నినాదం ఫలవంతం కావాలన్నా కేంద్రం పునరాలోచించుకోవాలని సూచించారు. పరిశ్రమల స్థాపనకు అనుకూల వాతావరణం ఎక్కడుందో గుర్తించి ఆ మేరకు నిర్ణయాలు తీసుకోవాలని ఆయన కేంద్రానికి హితవు పలికారు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం చీలపల్లి వద్ద నిమ్జ్‌లో రక్షణ రంగ పరికరాల ఉత్పత్తి సంస్థ వెమ్‌ టెక్నాలజీస్‌ ఏర్పాటు చేయనున్న తొలి పరిశ్రమ నిర్మాణ పనులకు ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు వి.వెంకటరాజుతో కలిసి మంత్రి కేటీఆర్‌ బుధవారం భూమిపూజ నిర్వహించారు. అనంతరం జహీరాబాద్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి... అక్కడ నిర్వహించిన బహిరంగసభలో పాల్గొన్నారు. కేటీఆర్‌ మాట్లాడుతూ... రక్షణ రంగానికి సంబంధించి రూ.1,000 కోట్లతో వెమ్‌ సంస్థ నిమ్జ్‌లో పెట్టుబడులు పెడుతోందన్నారు. జహీరాబాద్‌ యువతకు ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలిచ్చేలా కృషి చేయాలని ఆయన సంస్థ ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. బంగారం లాంటి భూములను కోల్పోతున్న రైతులకు బాధ ఉంటుందని, వారికి మెరుగైన పరిహారం దక్కేలా అధికారులు చొరవ తీసుకోవాలని సూచించారు. తమది రైతుల పొట్టగొట్టే ప్రభుత్వం కాదన్నారు. టాస్క్‌ద్వారా జహీరాబాద్‌లో ఏపీజే అబ్దుల్‌కలాం పేరిట సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ను అందుబాటులోకి తేనున్నామన్నారు. ఇందుకోసం ఇప్పటికే విద్యుత్‌ వాహనాల పరిశోధనలో కీలకంగా ఉన్న వార్విక్‌ విశ్వవిద్యాలయంతోనూ చర్చలు జరుపుతున్నామన్నారు.

విద్యుత్‌ వాహనాలదే భవిష్యత్తు

జహీరాబాద్‌ మండలం బూచినెల్లిలో నెలకొల్పిన ఎంజీ ఈవీ పార్కును మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. కంపెనీ సిద్ధం చేసిన విద్యుత్‌ వాహనాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ప్రపంచ భవిష్యత్తు విద్యుత్‌ వాహనాలతో ముడిపడి ఉందన్నారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తీసుకొచ్చిన పాలసీల వల్ల తెలంగాణలో చాలా విద్యుత్‌ వాహన తయారీ సంస్థలు రానున్నాయన్నారు. రానున్న రోజుల్లో ట్రాక్టర్లు కూడా విద్యుత్తుతో నడుస్తాయన్నారు. దేశంలోనే అతి పెద్దదైన ప్రొటోటైపింగ్‌ ఫెసిలిటీని హైదరాబాద్‌లో ఆగస్టులో అందుబాటులోకి తేనున్నామన్నారు. అనంతరం మంత్రి జహీరాబాద్‌ శివారులోని మహీంద్రా ఫ్యాక్టరీని సందర్శించారు. ఇప్పటి వరకు ఆ సంస్థ 2,99,999 ట్రాక్టర్లు ఉత్పత్తి చేయగా.. తాజాగా తయారు చేసిన మూడో లక్ష ట్రాక్టరును కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్‌, టీఎస్‌ఐఐసీ అధ్యక్షుడు గ్యాదరి బాలమల్లు, ఎండీ నర్సింహారెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి, సంగారెడ్డి జడ్పీ అధ్యక్షురాలు మంజుశ్రీ, కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌, ఎంపీలు బీబీపాటిల్‌, సురేష్‌రెడ్డి, గల్లా జయదేవ్‌, ఎమ్మెల్యేలు కొనింటి మాణిక్‌రావు, క్రాంతికిరణ్‌, భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీలు శేరి సుభాష్‌రెడ్డి, యాదవరెడ్డి, కేంద్ర రక్షణ శాఖ మాజీ సహాయమంత్రి పల్లంరాజు తదితరులు పాల్గొన్నారు.


నిమ్జ్‌ రైతుల నిరసనలు... అరెస్టులు
కేటీఆర్‌ పర్యటన సందర్భంగా పోలీసుల లాఠీఛార్జి

ఈనాడు, సంగారెడ్డి, న్యూస్‌టుడే, ఝరాసంగం, న్యాల్‌కల్‌: నిమ్జ్‌ కోసం జహీరాబాద్‌ నియోజకవర్గంలోని ఝరాసంగం, న్యాల్‌కల్‌ మండలాల్లో భూములు కోల్పోతున్న రైతులు కేటీఆర్‌ పర్యటన సందర్భంగా నిరసనలకు దిగారు. పోలీసులు లాఠీలకు పనిచెప్పడంతో ఇద్దరు రైతులకు స్వల్ప గాయాలయ్యాయి. ఒక మహిళ స్పృహ కోల్పోయారు. వెమ్‌ సంస్థ భూమిపూజ కోసం బుధవారం మంత్రి కేటీఆర్‌ రానున్న సందర్భంగా పోలీసులు ఈ ప్రాంతాన్ని దిగ్బంధనం చేశారు.   భూనిర్వాసితుల సంఘం నాయకులను అదుపులోకి తీసుకున్నారు. గ్రామాల్లో హోటళ్లు, కిరాణా దుకాణాలను బంద్‌ చేయించారు. తమ భూములను బలవంతంగా లాక్కుంటున్నారని ఆరోపిస్తూ.. రైతులు కేటీఆర్‌ భూమిపూజ చేస్తున్న ప్రాంతానికి వస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా స్వల్ప లాఠీఛార్జి చేయడంతో ఇద్దరు రైతులు గాయపడ్డారు.   300మందికి పైగా నిరసనకారులను అరెస్టు చేసి వివిధ ఠాణాలకు తరలించారు.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని