Published : 23 Jun 2022 03:12 IST

28 నుంచి రైతుబంధు సొమ్ము జమ

వ్యవసాయ, ఆర్థికశాఖలకు సీఎం కేసీఆర్‌ ఆదేశాలు

మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: ప్రస్తుత వానాకాలం(ఖరీఫ్‌) సీజన్‌కు రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో ఈ నెల 28 నుంచి వేయాలని సీఎం కేసీఆర్‌ ఆర్థిక, వ్యవసాయ శాఖలకు ఆదేశాలు జారీచేశారు. ఈ క్రమంలో ఈ సీజనులోనూ సకాలంలో సొమ్ము జమచేస్తామని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. రైతుబంధు కింద తొలిరోజు మొదట ఎకరా రైతుల ఖాతాల్లో, రెండోరోజున 2 ఎకరాలవారికి... ఇలా రోజూ ఎకరా చొప్పున పెంచుతూ జమచేస్తామని రైతులెవరూ అపోహ పడవద్దని ఆయన చెప్పారు. బుధవారం హైదరాబాద్‌ నాంపల్లి పబ్లిక్‌ గార్డెన్స్‌లో రైతుబంధు సమితి కార్యాలయంలో వ్యవసాయ శాఖ కాల్‌సెంటర్‌ను మంత్రి ప్రారంభించారు. భద్రాద్రి జిల్లా కాకర్ల గ్రామంలో ఇటీవల మరణించిన రైతు వెంకటేశ్వర్లుకు రైతుబీమా కింద రూ.5లక్షల పరిహారాన్ని జీవితబీమా సంస్థ ద్వారా వ్యవసాయశాఖ తాజాగా విడుదల చేసింది. దీనిపై మంత్రి నిరంజన్‌రెడ్డి కాల్‌సెంటర్‌ నుంచి నేరుగా రైతు కుమారుడు రవీంద్రబాబుకు ఫోన్‌ చేశారు.. పరిహారం అందిందా అని అడిగి తెలుసుకున్నారు. రోజూ ఉదయం 9.30 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకూ రైతులతో మాట్లాడేందుకు ఐదుగురు సిబ్బంది పనిచేస్తారని చెప్పారు.  అవసరమైన వారు 9052703339,  9052713339,  9052723339, 9052743339,  9052753339 నంబర్లలో కాల్‌సెంటర్‌ను సంప్రదించవచ్చని వివరించారు.

8 విడతలలో రూ.50,447 కోట్ల సాయం

కేంద్రం ఆర్థిక నిబంధనల పేరుతో కొర్రీలు పెట్టాలని చూసినా రైతుబంధు పథకాన్ని ఆపకుండా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈనెల 28 నుంచి సొమ్ము జమచేయాలని నిర్ణయించడం రైతుల పట్ల ఆయనకున్న అభిమానానికి నిదర్శనమని మంత్రి నిరంజన్‌రెడ్డి చెప్పారు. ఇప్పటి వరకు 8 విడతలలో ఈ పథకం కింద రూ.50,447.33 కోట్ల సాయం చేశామని గుర్తుచేశారు. ఈ వానాకాలంలో 70 లక్షల ఎకరాలలో పత్తి, 5 లక్షల ఎకరాలలో కంది సాగు లక్ష్యమని మంత్రి చెప్పారు. రైతుబంధు సమితి కార్యాలయంలో వానాకాలం విత్తనాలు, ఎరువుల లభ్యతపై ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు.

హంతకుడి సంతాపంలా బండి సంజయ్‌ లేఖ

రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల చెల్లింపులు, వ్యవసాయశాఖ పనితీరుపై ముఖ్యమంత్రికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌ లేఖ రాయడం...‘హంతకుడే సంతాపం తెలిపినట్లుందని మంత్రి నిరంజన్‌రెడ్డి విమర్శించారు.

మంత్రిని కలసిన అస్సాం రైతులు..

అస్సాంకు చెందిన రైతు ఉత్పత్తిదారుల కంపెనీలకు చెందిన 20 మంది రైతుల బృందం తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థలో శిక్షణ పొందింది. ఈ క్రమంలో సంస్థ ఛైర్మన్‌ కొండబాల కోటేశ్వర్‌రావు, ఎండీ కేశవులు వెంటరాగా మంత్రి నిరంజన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా ఆయన నివాసంలో కలసింది.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని