CJI: మట్టి వాసన మర్చిపోవద్దు

తెలుగువారు వృత్తి-ప్రవృత్తుల రీత్యా ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా మూలాలను, మట్టి వాసనను, మాతృ భాషను, సంస్కృతి-సంప్రదాయాలను విడనాడవద్దని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.వి.రమణ కోరారు.

Updated : 27 Jun 2022 06:12 IST

 ప్రతి ఇంటిలో పెద్దబాలశిక్ష పుస్తకం ఉండాలి

దిల్లీలో నా బంగ్లాపై తెలుగులో నామఫలకం తగదన్నారు

అయినా నేను దానిని తొలగించలేదు

వాషింగ్టన్‌లో సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ వెల్లడి

ఈనాడు, దిల్లీ: తెలుగువారు వృత్తి-ప్రవృత్తుల రీత్యా ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా మూలాలను, మట్టి వాసనను, మాతృ భాషను, సంస్కృతి-సంప్రదాయాలను విడనాడవద్దని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.వి.రమణ కోరారు. ‘గ్రామీణ ప్రాంతాల నుంచి అనేక కష్టనష్టాలు ఎదుర్కొని మీరు ఇక్కడకు వచ్చారు. ఆస్తులు అమ్మి మిమ్మల్ని చదివించిన తల్లిదండ్రులను గుర్తుకు తెచ్చుకోండి. మట్టి వాసన మర్చిపోకండి. మీ బంధుమిత్రులు, చదువు నేర్పిన గురువులను తప్పనిసరిగా ఏడాదికి ఒకసారో, రెండుసార్లో కలిసి మాట్లాడండి. ఫోన్లో మాట్లాడడం కంటే స్వయంగా వెళ్లి పలకరిస్తే వచ్చే అనుభూతి వేరు’ అని ఆయన చెప్పారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన వాషింగ్టన్‌ డీసీలో ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన ‘‘మీట్‌ అండ్‌ గ్రీట్‌’’లో పాల్గొని మాట్లాడారు.

వారు వద్దన్నా నేను వినలేదు

తెలుగు వాళ్లంతా పరస్పరం తెలుగులోనే మాట్లాడుకోవాలి. బిడ్డలకు మాతృభాష ప్రథమ భాషగా విద్యాబోధన సాగాలి. తెలుగులో ఉత్తరాలు రాసే సంప్రదాయాన్ని కొనసాగించండి. తెలుగులో మాట్లాడడానికి సిగ్గుపడకండి. నేను తెలుగు వాడిని, ఆంధ్రవాడిని, నా మాతృభాష తెలుగు అని సగర్వంగా చెప్పే పరిస్థితి తెచ్చుకోవాలి. అది అసాధ్యమైన విషయం కాదు. నేనో ఉదాహరణ చెబుతా. సుప్రీంకోర్టుకు న్యాయమూర్తులుగా మాకు బంగ్లాలు ఇస్తారు. ఇంటి ముందు నామ ఫలకాలు హిందీలో పెడతారు. అడిగితే ఇంగ్లిషులో పెడతారు. నేను తెలుగులో పెట్టమని అడిగా. అవి లేవన్నారు. ఓ కాంగ్రెస్‌ మంత్రికి విషయం తెలిసి తెలుగులో ఓ బోర్డు రాయించి పంపించారు. నూతలపాటి వెంకటరమణ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి అని తెలుగులో ఉంది. సుప్రీంకోర్టులో సీనియర్‌ న్యాయమూర్తి ఒకరు ఒకరోజు మా ఇంటికి వచ్చారు. రాజధానిలో తెలుగులో నామ ఫలకం ఉండడం మంచిది కాదు, తీసివేయమని చెప్పారు. సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ కావాలంటే ఇలా చేయడం మంచిది కాదు, ఓ పెద్దవాడిగా సలహా ఇస్తున్నా అని అన్నారు. మాతృభాషలో పేరు పెట్టుకున్నంత మాత్రాన నాకు చీఫ్‌ జస్టిస్‌ పదవి రాదంటే దానికి నేను సిద్ధపడే ఉన్నాను. ఆ విషయంలో నేను ఏమాత్రం రాజీపడను. తెలుగు భాషలోనే నా పేరు ఉండాలని చెప్పాను. సీజేఐ అయ్యాక కూడా నా నివాసం గేట్ల ముందు ఇంగ్లిషుతో పాటు తెలుగులో నా పేరు ఉంటుంది. మన సంస్కృతిని, మన భాషను మర్చిపోతే మన జాతి అంతరించిపోతుంది. ఆ పరిస్థితి ఉండకూడదు.

ఐక్యత, శాంతితోనే అభివృద్ధి..

ఈ పాఠశాల ప్రాంగణంలోకి ప్రవేశించగానే ఇది ప్రభుత్వ పాఠశాలా.. ప్రైవేటు పాఠశాలా అని అడిగాను. ప్రభుత్వ పాఠశాల అన్నారు. చాలా సంతోషించాను. నేను చదుకునే రోజుల్లోని పాఠశాలలు గుర్తుకు వచ్చాయి. ఇంత చక్కని వాతావరణం ఇక్కడ పాఠశాలల్లో ఉంది. మన దేశంలోని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇంత చక్కని వాతావరణం ఉంటే ఎంత బాగుంటుందనే ఆలోచన వచ్చింది. అమెరికా బాగా అభివృద్ధి చెందడానికి కారణం ఈ సమాజం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని తరగతులు, అన్ని దేశాలు, వర్గాల ప్రజలను రెండు చేతులు చాచి హృదయానికి హత్తుకోవడమే. ఇతర భాషా సంస్కృతులను గౌరవించాలి. మనం వేమన, సుమతీ శతకాలను మర్చిపోయాం. ఆ శతక సాహిత్యాన్ని ముద్రించి లేదా ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ చేయించి పిల్లలతో చదివించండి. ప్రతి ఇంట్లో పెద్ద బాలశిక్ష ఉండాలి. అందులో భాష, సంస్కృతికి సంబంధించిన విషయాలు ఎన్నో ఉంటాయి. పిల్లలకు ఇంగ్లిషు కథలతో పాటు తెలుగు కథలు చెప్పడం మంచిది. పిల్లలకు మాతృమూర్తి మీద ఎలా గౌరవం ఉంటుందో మనకు మాతృభాషపై అలాంటి గౌరవం ఉండాలి. బిడ్డకు తల్లి ఏరకమైన ప్రేమ అందిస్తుందో అలానే మనం భాష, సంస్కృతికి గౌరవం ఇవ్వాలి. మన ఇంట్లో, ప్రత్యేకించి అమెరికాలో పిల్లలు తెలుగులో మాట్లాడేటప్పుడు అనేక తప్పులు చేస్తున్నారు. వాళ్లను హేళన చేస్తే ఏనాడూ ఆ భాష మాట్లాడరు. తప్పును సరిదిద్దాలి తప్ప ఎగతాళి చేయకూడదు’’ అని జస్టిస్‌ రమణ చెప్పారు.

‘తేనెసోకనో తియ్యని గుడి
పచ్చదనం చూడ కళ్లలో వెలుగు దివ్యకాంతి
త్యాగరాజ కీర్తన చెవులకింపైన రీతి
సంపెంగలు చూడ నాసిక పొందే
మధురానుభూతి
ఇది మన మాతృభాష తెలుగు ఖ్యాతి
అంటూ తన ప్రసంగాన్ని సీజేఐ ముగించారు.

స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను పరిరక్షించుకోవాలి

ఫిలడెల్ఫియాలోని చారిత్రక ‘ఇండిపెండెన్స్‌ హాల్‌’ను సందర్శించిన తర్వాత సీజేఐ జస్టిస్‌ రమణ మాట్లాడుతూ- స్వేచ్ఛ, స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యాలను కాపాడుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా అవిశ్రాంతంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ పవిత్ర స్థలం నుంచి ఉద్భవించిన విలువలు ప్రజాస్వామ్య దేశాలన్నింటికీ స్ఫూర్తిని ఇచ్చాయని చెప్పారు. అవి ఈ నాటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తున్నాయన్నారు.


తెలుగుకు విదేశాల్లో గుర్తింపు సంతోషకరం

‘‘తెలుగు జాతి గొప్పదనాన్ని, తెలుగు ఘనతను ప్రపంచానికి చాటిచెప్పిన ఎన్టీఆర్‌ వాక్చాతుర్యానికి, ఘంటశాల గాత్రానికి, వారి ఉచ్చారణకు ముగ్ధులమైన మా తరంవాళ్లం తెలుగు భాషపై పట్టు సంపాదించుకోగలిగాం. పున్నమి వెన్నెల, తియ్యని తేనె, కోయిల కిలకిలారావాలు, మంచిగంధపు పొడి, మల్లెపూల పరిమళం, గులాబీ రేకుల మార్దవం, వేసవి సాయంకాలపు వానజల్లు, చల్లని గాలి, కృష్ణశాస్త్రి కవిత్వం ఇలా సృష్టిలో హాయిగొలిపే అన్నింటిని రంగరించిందే తెలుగు భాష అని ఒక కవి అన్నారు. అలాంటి తెలుగు బలపడే విధంగా, గొప్ప అంతర్జాతీయ భాషగా గుర్తింపు తెచ్చేలా మనం కృషి చేయాల్సి ఉంది. తెలుగు బిడ్డలుగా పుట్టడం అదృష్టంగా భావించాలి. తెలుగు భాషకు వేరే దేశాల్లో ఎక్కువ గుర్తింపు రావడం సంతోషకరం. మీ పిల్లలకు ఎలా తెలుగు భాష, సంస్కృతులు నేర్పుతున్నారో మీరు పుట్టిన ప్రాంతాల్లో తెలుగు పాఠశాలల బాగుకు ఒక సంస్థలా ఏర్పడి కృషి చేయాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని