ఔరా... అనేల

తెలంగాణలో పట్టణీకరణ వేగంగా జరుగుతున్న నేపథ్యంలో వ్యవసాయ భూముల క్రయవిక్రయాలకు రెక్కలొచ్చాయి. హైదరాబాద్‌ సహా చుట్టుపక్కల జిల్లాల్లో పెద్ద సంఖ్యలో అమ్మకాలు జరుగుతున్నాయి. ఆరేళ్ల క్రితంతో పోలిస్తే

Updated : 28 Jun 2022 07:58 IST

రాష్ట్రంలో వ్యవసాయ భూముల క్రయవిక్రయాల్లో జోరు
2021-22లో ఆరు లక్షలకుపైగా లావాదేవీలు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో పట్టణీకరణ వేగంగా జరుగుతున్న నేపథ్యంలో వ్యవసాయ భూముల క్రయవిక్రయాలకు రెక్కలొచ్చాయి. హైదరాబాద్‌ సహా చుట్టుపక్కల జిల్లాల్లో పెద్ద సంఖ్యలో అమ్మకాలు జరుగుతున్నాయి. ఆరేళ్ల క్రితంతో పోలిస్తే అమ్మకాల్లో రెండున్నర రెట్ల వృద్ధి నమోదవగా, 2021-22 ఆర్థిక సంవత్సరంలోనే రికార్డు స్థాయిలో ఆరు లక్షలకుపైగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. భూమి నమ్మకమైన పెట్టుబడిగా మారడం, రాబడులు ఆశాజనకంగా ఉండటమే దీనికి కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

స్థిరాస్తి రంగంలో జోరు కొనసాగుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా భూముల ధరలు గణనీయంగా పెరిగాయి. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూముల కనీస ధర ఎకరం రూ.10 లక్షల దాకా ఉండగా, హైదరాబాద్‌ చుట్టుపక్కల జిల్లాల్లో రూ. కోట్లలోనే పలుకుతున్నాయి. హైదరాబాద్‌తో ముడిపడిన రంగారెడ్డి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఎకరా రూ.20 కోట్ల నుంచి రూ.50 కోట్లదాకా పలుకుతోంది. అయినా కొనేందుకు కొనుగోలుదారులు ముందుకొస్తుండటం, మంచి ధర లభిస్తుండటంతో అమ్మేందుకూ రైతులు సిద్ధమవుతున్నారు. కరోనా ప్రభావం నేపథ్యంలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో విక్రయాలు మందగించినప్పటికీ, ఆ తర్వాత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా సుమారు మూడు రెట్లు పెరగడం గమనార్హం.

ఫాం లాండ్స్‌ సంస్కృతితో

ఇటీవల కాలంలో ఖాళీ స్థలాలతోపాటు, ఫాంలాండ్స్‌ (వ్యవసాయ భూములు), ఫాంహౌస్‌ల సంస్కృతి పెరిగింది. ధనవంతులు, ఉన్నతోద్యోగులు, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు వంటి వారు ఆర్థిక స్తోమతను బట్టి నగర శివార్లలో ఎకరా, అర ఎకరా చొప్పున కొనుగోలుచేసి ఫాంహౌస్‌లు నిర్మించుకుంటున్నారు. భూముల అమ్మకాల్లో జోరుకు ఇది కూడా కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. ‘‘ముఖ్యంగా హైదరాబాద్‌ పరిసరాల్లోని రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్‌, సిద్దిపేట, మహబూబ్‌నగర్‌, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లో ఈ తరహా క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌కు 70 కిలోమీటర్ల దూరంలోని సదాశివపేట, 130 కిలోమీటర్లు దూరంలో కర్ణాటక సరిహద్దుల్లోని నారాయణ్‌ఖేడ్‌ వంటి  ప్రాంతాల్లో ఫాంలాండ్స్‌ పేరిట వ్యవసాయ భూముల్ని పావు ఎకరం, అర ఎకరం చొప్పున విక్రయిస్తున్నారని’ ఉదహరిస్తున్నారు.

రాబడికి భరోసా..

మారిన పరిస్థితుల దృష్ట్యా మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి పెట్టుబడిగా భూములను ఎంచుకోవడం కూడా అమ్మకాలు పెరగడానికి కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ‘‘బ్యాంకుల్లో డిపాజిట్‌ల రూపంలో దాచుకోవడం, బంగారం కొనుగోలు, వడ్డీ వ్యాపారాల కంటే భూములపై రాబడి అధికంగా ఉంటోంది. దీంతో వేలమంది దీన్ని నమ్మకమైన పెట్టుబడిగా భావిస్తూ ఇళ్ల స్థలాలు, భూముల కొనుగోలుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాల్లో సాగునీటి లభ్యత పెరగడంతో కాస్త స్తోమత ఉన్న రైతులు వ్యవసాయ భూముల కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు. బయటి ప్రాంతాల రైతులూ ఇక్కడ సాగుభూముల కొనుగోళ్లు జరుపుతున్నారు. క్రయవిక్రయాల్లో వృద్ధి కొనసాగడానికి ఇవన్నీ దోహదం చేస్తున్నాయి’అని నిపుణులు పేర్కొంటున్నారు.

భూముల విక్రయాల్లో రంగారెడ్డి టాప్‌... తర్వాత సంగారెడ్డి

గత ఏడాది వ్యవసాయ భూముల అమ్మకాలను విశ్లేషిస్తే అత్యధికం రంగారెడ్డి జిల్లాలోనే ఉన్నాయి. తర్వాత స్థానంలో సంగారెడ్డి, వికారాబాద్‌, సిద్దిపేట, నల్గొండ, మెదక్‌ జిల్లాలు ఉన్నాయి. హెచ్‌ఎండీఏకు అనుబంధంగా ఉన్న భువనగిరి, మహబూబ్‌నగర్‌ జిల్లాలతోపాటు నాగర్‌కర్నూల్‌, కామారెడ్డి లాంటి కీలక జిల్లాల్లో ఎక్కువగా ఉంటున్నాయి.


హైదరాబాద్‌కు వంద కిలోమీటర్ల పరిధిలో..

హైదరాబాద్‌ చుట్టుపక్కల వంద కిలోమీటర్ల పరిధిలో స్థిరపడేందుకు ఔత్సాహికులు ఆసక్తి చూపుతుండటంతో.. స్థిరాస్తి వ్యాపారులు ఆయా ప్రాంతాల్లో భూముల కొనుగోలుకు ఆసక్తిచూపుతున్నారు. కొందరు ప్రస్తుత అవసరాలకోసం కొనుగోళ్లు జరుపుతుండగా, కొందరు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కొంటున్నారు. ప్రధానంగా హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారిలో షాద్‌నగర్‌, జడ్చర్ల వరకూ, ముంబయి జాతీయ రహదారిలో సంగారెడ్డి, సదాశివపేట వరకు, వరంగల్‌ జాతీయ రహదారిలో భువనగిరి, యాదగిరిగుట్ట వరకు, చేవెళ్ల రోడ్డులో వికారాబాద్‌ వరకు, రాజీవ్‌ రహదారిలో సిద్దిపేట వరకు కొనుగోళ్లు ఊపందుకున్నాయి. అవుటర్‌ రింగ్‌రోడ్డుతోపాటు.. రీజినల్‌ రింగ్‌ రోడ్డు అందుబాటులోకి రానుండటంతో ఆ పరిసరాల్లోనూ క్రయవిక్రయాలు జోరందుకున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని