KTR: దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నారు

భాజపా తీరు అయితే జుమ్‌లా (అబద్ధం) లేదంటే హమ్‌లా (దాడి)లా ఉందని రాష్ట్ర మంత్రి, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విమర్శించారు. ఆ పార్టీ వద్ద విషం తప్ప విషయం లేదన్నారు. రూ.కోటి కోట్ల అప్పులు చేశారని

Updated : 28 Jun 2022 06:42 IST

రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకుంటున్నారు

బలం లేకపోయినా 8 రాష్ట్రాల్లో అధికారం

భాజపా దగ్గర విషం తప్ప విషయం లేదు

సిన్హాకు ఓటేయాలని ఇతర పార్టీలనూ కోరతాం

గిరిజన మహిళ రాష్ట్రపతి అయితే గిరిజనుల బతుకులు మారతాయా?

తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌

భీష్ముడు మంచివాడైనా కౌరవుల పక్షాన నిలిచినందుకు ఓటమి తప్పలేదు. భాజపా నియంతృత్వ, నిరంకుశ, అప్రజాస్వామిక విధానానికి వ్యతిరేకంగా ఆ పార్టీ అభ్యర్థిని తిరస్కరిస్తున్నాం.. ద్రౌపదీ ముర్ముపై మాకు వ్యక్తిగతంగా విముఖత లేదు. గిరిజన, మహిళా అభ్యర్థి కాబట్టి సమర్థించాలనే వాదనకు మేం వ్యతిరేకం. 

- కేటీఆర్‌

ఈనాడు, దిల్లీ: భాజపా తీరు అయితే జుమ్‌లా (అబద్ధం) లేదంటే హమ్‌లా (దాడి)లా ఉందని రాష్ట్ర మంత్రి, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విమర్శించారు. ఆ పార్టీ వద్ద విషం తప్ప విషయం లేదన్నారు. రూ.కోటి కోట్ల అప్పులు చేశారని ఆరోపించారు. హిందు- ముస్లిం, పాకిస్థాన్‌-బంగ్లాదేశ్‌ అంటూ కాలం గడుపుతున్నారని.. తమకు బలం లేకపోయినా దాదాపు ఎనిమిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను తలకిందులు చేసి అధికారం దక్కించుకున్నారన్నారు. చట్టబద్ధ సంస్థలను గుప్పిట్లో పెట్టుకొని విపక్షాలపై వాటిని వేట కుక్కల్లా ఉసిగొల్పి రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశంలో అంబేడ్కర్‌ రాజ్యాంగానికి బదులు మోదీ రాజ్యాంగం అమలవుతోందన్నారు. సోమవారం విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌సిన్హా నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన తెలంగాణభవన్‌లో విలేకరులతో మాట్లాడారు.‘‘రాష్ట్రానికి రూ.నాలుగు లక్షల కోట్లు ఇచ్చామని ఒకరు.. రూ.12 లక్షల కోట్లు ఇచ్చామని మరొకరు.. ఇలా భాజపా నేతలు మనిషికో తీరు మాట్లాడుతున్నారు. చిత్తశుద్ధి ఉంటే జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్‌ వస్తున్న ఆ పార్టీ పెద్దలు తెలంగాణకు ఇచ్చిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి. రాష్ట్ర ప్రజలు కేంద్రానికి చెల్లించిన దానికంటే.. కేంద్రం ఎక్కువ నిధులిచ్చినట్లు రుజువు చేస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరాన్ని తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తే కేంద్రం ఎనిమిదేళ్లలో ఒక్క ప్రాజెక్టు కట్టలేదు. జాతీయ హోదా ఇచ్చిన పోలవరం ప్రాజెక్టునూ పూర్తి చేయలేకపోయారు. దేశంలోని అన్ని గ్రామాలకు విద్యుత్తు ఇచ్చామని ప్రధానమంత్రి మోదీ చెప్పారు. నేటికీ గుజరాత్‌లో కరెంటు లేని గ్రామాలున్నాయి. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ ముర్ము సొంత గ్రామంలో ఇప్పుడు విద్యుత్తు స్తంభాలు వేస్తున్నారు’’ అని అన్నారు.


‘‘భాజపాకు గిరిజనులపై చిత్తశుద్ధి ఉంటే గిరిజన రిజర్వేషన్ల పెంపు బిల్లును ఆమోదించాలి. గిరిజన విశ్వ విద్యాలయం ఏర్పాటు చేయాలి. ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన 7 గిరిజన మండలాలను తిరిగి తెలంగాణలో చేర్చాలి. ప్రతిపక్ష అభ్యర్థికి సహకరించినంత మాత్రాన ఆ కూటమిలో ఉన్నట్లు కాదు. శరద్‌ పవార్‌, మమతా బెనర్జీలు కేసీఆర్‌ను కోరడంతో సిన్హాకు మద్దతు ఇస్తున్నాం’’

- కేటీఆర్‌


13 మంది మరణిస్తే ద్రౌపదీ ముర్ము ఒక్క ప్రకటన చేయలేదు

గిరిజన మహిళ రాష్ట్రపతి అయితే దేశంలో గిరిజనుల బతుకులు మారతాయా అని కేటీఆర్‌ ప్రశ్నించారు. ‘‘ఒడిశాలో కళింగనగర్‌ ప్లాంట్‌ నిర్మాణానికి వ్యతిరేకంగా గిరిజనులు ఆందోళన చేస్తే పోలీసులు జరిపిన కాల్పుల్లో 13 మంది మరణించారు. ఆ సమయంలో రాష్ట్ర మంత్రిగా ఉన్న ముర్ము తన పదవికి రాజీనామా చేయలేదు. కనీసం విచారం తెలుపుతూ ప్రకటన విడుదల చేయలేదు. తెరాస అధినేత కేసీఆర్‌ ఆదేశం మేరకు విపక్షాల అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాకు మద్దతు తెలిపాం. ఆయనకు ఓటు వేయాలని ఇతర పార్టీలనూ కోరతాం’’ అని కేటీఆర్‌ చెప్పారు.

‘సాలు దొర...సెలవు దొర’పై మండిపాటు

‘సాలు దొర...సెలవు దొర’ అనే భాజపా ప్రచారంపై కేటీఆర్‌ మండిపడ్డారు. కేసీఆర్‌ బొమ్మ లేకపోతే భాజపా రాష్ట్ర కార్యాలయం వైపు చూసే వారే లేరన్నారు. తాము కూడా మోదీ ఫొటోలకు చెప్పుల దండ వేసి గాడిదలపై ఊరేగించగలమని.. కానీ అది తమ సంస్కారం కాదన్నారు. 1984లో ఎన్టీఆర్‌ ప్రభుత్వాన్ని ఇందిరాగాంధీ కూలదోస్తే ప్రజలు తిరగబడి మళ్లీ అధికారంలోకి తెచ్చారని తెలిపారు. అలాగే భాజపాపై వ్యతిరేకత.. తిరుగుబాటు తెలంగాణ నుంచో, కేసీఆర్‌ రూపంలో వస్తుందో చెప్పలేమన్నారు. ఆ ధిక్కార స్వరం దేశం మొత్తాన్ని చైతన్యపరచవచ్చన్నారు. జాతీయపార్టీ ఏర్పాటుపై ప్రశ్నించగా తినబోతూ రుచులు అడగవద్దని కేటీఆర్‌ చెప్పారు. సమావేశంలో తెరాస లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు, ఎంపీలు డాక్టర్‌ గడ్డం రంజిత్‌రెడ్డి, బొర్లకుంట వెంకటేష్‌ నేత, కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్‌, పి.రాములు, వద్దిరాజు రవిచంద్ర పాల్గొన్నారు. విలేకరుల సమావేశం అనంతరం యశ్వంత్‌ సిన్హా ఇంటికి వెళ్లిన కేటీఆర్‌, తెరాస ఎంపీలు ఆయనతో భేటీ అయ్యారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని