Vice Presidential Election: ఆగస్టు 6న ఉప రాష్ట్రపతి ఎన్నిక

భారత 16వ ఉప రాష్ట్రపతి ఎన్నికకు నగారా మోగింది. ప్రస్తుత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడి పదవీకాలం ఆగస్టు 10వ తేదీతో ముగుస్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. దేశంలో రెండో అత్యున్నత పదవి

Published : 30 Jun 2022 06:24 IST

షెడ్యూల్‌ విడుదల 

జులై 5 నుంచి 19 వరకు నామినేషన్ల స్వీకరణ

ఈనాడు, దిల్లీ: భారత 16వ ఉప రాష్ట్రపతి ఎన్నికకు నగారా మోగింది. ప్రస్తుత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడి పదవీకాలం ఆగస్టు 10వ తేదీతో ముగుస్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. దేశంలో రెండో అత్యున్నత పదవి అయిన ఈ స్థానానికి ఆగస్టు 6న పోలింగ్‌ నిర్వహించాలని నిర్ణయించింది. ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో నిలిస్తే.. ఆరోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్‌ నిర్వహించి, అదే రోజు లెక్కింపు ప్రక్రియ కూడా పూర్తిచేస్తారు. ఈమేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌, కమిషనర్‌ అనూప్‌చంద్ర పాండే నేతృత్వంలో బుధవారం సమావేశమైన ఈసీ షెడ్యూల్‌ను ఖరారు చేసింది.

ఎన్నిక విధానం..

పార్లమెంటు ఉభయ సభలకు చెందిన మొత్తం 788 మంది సభ్యులు ఓటు వేస్తారు. ఇందులో 233 మంది రాజ్యసభ సభ్యులు, 12 మంది ఆ సభ నామినేటెడ్‌ సభ్యులు, 543 మంది లోక్‌సభ సభ్యులు ఉన్నారు. ఈ ఎన్నికలో ఎమ్మెల్యేలకు ఓటుహక్కు ఉండదు. ఒక్కో ఎంపీ ఓటును కేవలం ఒకటిగానే పరిగణిస్తారు. రాష్ట్రపతి ఎన్నికల్లో మాదిరిగా ప్రత్యేక విలువ ఉండదు. ఎన్నిక దామాషా పద్ధతిలో, రహస్య విధానంలో జరుగుతుంది. అభ్యర్థుల సంఖ్యను బట్టి ఓటర్లు తమకు నచ్చిన వారి పేరు పక్కన ప్రాధాన్య సంఖ్య వేయాల్సి ఉంటుంది. ఒకటో ప్రాధాన్య సంఖ్య వేయకుండా మిగతా ఎన్ని సంఖ్యలు వేసినా దాన్ని లెక్కలోకి తీసుకోరు. ఈసీ అందించే ప్రత్యేక పెన్‌ను మాత్రమే ఓటింగ్‌కు వినియోగించాలి. పార్లమెంటు భవనం తొలి అంతస్తులోని నం.63 గదిలో పోలింగ్‌ జరుగుతుంది. ఒక్కో అభ్యర్థి నామినేషన్‌ను కనీసం 20 మంది ఎంపీలు ప్రతిపాదించాలి. మరో 20 మంది బలపరచాలి. డిపాజిట్‌గా రూ. 15 వేలు చెల్లించాలి.

ఎవరికి అవకాశం?

ఈ ఎన్నికలో ఓట్లేసేది పార్లమెంటు ఉభయ సభల సభ్యులే కావడంతో సంఖ్యాబలానికి అనుగుణంగా ఎన్డీయే అభ్యర్థి గెలుపు నల్లేరు మీద నడకేనన్నది సుస్పష్టం. ఉప రాష్ట్రపతి రాజ్యసభను కూడా నిర్వహించాల్సి ఉంటుంది కాబట్టి సభా కార్యకలాపాల నిర్వహణ పట్ల అవగాహన, సభ్యులను నియంత్రించగల శక్తి సామర్థ్యాలు ఉన్నవారినే రంగంలోకి దింపే అవకాశం ఉంటుంది. క్రితంసారి కేంద్రమంత్రిగా ఉన్న ఎం.వెంకయ్యనాయుడిని పోటీకి నిలబెట్టారు. ఈసారి ఎవరిని బరిలోకి దించుతారన్నది ఆసక్తికరంగా మారింది. కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ, కేరళ గవర్నర్‌ ఆరీఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఉప రాష్ట్రపతి పదవికి దక్షిణాది వారికే  అవకాశం ఇవ్వొచ్చన్న విశ్లేషణా ఉంది. వచ్చే ఏడాది కర్ణాటక, తెలంగాణల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దక్షిణాదిలోని ఓబీసీ సామాజిక వర్గాలను ఆకట్టుకొనే ప్రయత్నం చేయొచ్చన్న ఒక వాదన ప్రచారంలో ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మతపరమైన సున్నిత వాతావరణం అలుముకొన్నందున మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తిని బరిలోకి దించే అవకాశం ఉందన్న విశ్లేషణా వినిపిస్తోంది.


వెంకయ్యనాయుడికి సరితూగేలా..

రాజ్యసభలో కీలకమైన బిల్లులను ఆమోదించే సమయంలో సభను నియంత్రణలో ఉంచుతూ.. సున్నితంగా ముందుకు సాగించడం అతిపెద్ద సవాల్‌. దీన్ని ప్రస్తుత ఛైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడు చాలా అలవోకగా నిర్వహించారు. అందుకు సరితూగేలా భాజపా నాయకత్వం ఎవరిని బరిలోకి దించుతుందో వేచి చూడాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని