Modi: ప్రజల్లోనే ఉందాం.. ఎన్నికేదైనా గెలుద్దాం

ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలను, విపక్షాల విధ్వంసకర విధానాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతోపాటు ఎన్నికలపై మరింత దృష్టి సారించాలని భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గం నిర్ణయించింది. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ఎలా గెలిచాం.. త్వరలో ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో అనుసరించే వైఖరి గురించి చర్చ సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జోక్యం చేసుకొని ఎన్నికలపై మరింత  దృష్టి పెట్టి పని చేయాలని సూచించినట్లు తెలిసింది. లబ్ధిదారులను కలుస్తూ, కార్యకర్తలతో మమేకం అవుతూ పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించాలని దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.

Updated : 03 Jul 2022 06:55 IST

భవిష్యత్తులో మరింత కష్టపడాలని నేతలకు మోదీ పిలుపు
పార్టీ యంత్రాంగమంతా ఒక జిల్లాలో ఒకరోజు ఉండాలని సూచన
తెలంగాణపై నేడు ప్రత్యేక పత్రం
హైదరాబాద్‌లో ప్రారంభమైన భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు
ఈనాడు - హైదరాబాద్‌


కేంద్ర ప్రభుత్వం ప్రజాసంక్షేమం, దేశ సమగ్రత కోసం పని చేస్తుంటే విపక్షాలు విధ్వంసాన్ని కోరుకుంటున్నాయి. భాజపా ప్రభుత్వం ప్రజల అభివృద్ధికి పాటుపడుతుంటే విపక్షాలు తమ కుటుంబాల అభివృద్ధి కోసం పని చేస్తున్నాయి. మోదీని వ్యతిరేకించడంలో భాగంగా విపక్షాలు దేశాన్నీ వ్యతిరేకిస్తున్నాయి.

- భాజపా జాతీయ కార్యవర్గ సమావేశం


ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలను, విపక్షాల విధ్వంసకర విధానాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతోపాటు ఎన్నికలపై మరింత దృష్టి సారించాలని భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గం నిర్ణయించింది. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ఎలా గెలిచాం.. త్వరలో ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో అనుసరించే వైఖరి గురించి చర్చ సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జోక్యం చేసుకొని ఎన్నికలపై మరింత  దృష్టి పెట్టి పని చేయాలని సూచించినట్లు తెలిసింది. లబ్ధిదారులను కలుస్తూ, కార్యకర్తలతో మమేకం అవుతూ పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించాలని దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా కేంద్రమంత్రులు, భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, అనుబంధ సంఘాల ఛైర్మన్లు, అన్ని రాష్ట్రాల అధ్యక్షులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

శనివారం ఉదయం మొదట అధ్యక్షుడు నడ్డా అధ్యక్షతన మూడుగంటల పాటు జరిగిన పదాధికారుల సమావేశం.. కార్యవర్గ సమావేశంలో చర్చించాల్సిన ఎజెండాను ఖరారు చేసింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, పార్టీ ప్రభావం తక్కువగా ఉన్న ప్రాంతాలకు విస్తరించడం, భాజపాయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పరిస్థితి, రాజకీయ, ఆర్థిక తీర్మానాలు ఇలా పలు అంశాలు ఎజెండాగా ఉండాలని నిర్ణయించింది. సాయంత్రం నాలుగుగంటలకు ప్రారంభమైన కార్యవర్గ సమావేశం రాత్రి ఎనిమిదిన్నర వరకు జరిగింది. తిరిగి ఆదివారం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జరగనుంది. కార్యవర్గ సమావేశంలో వేదికపై ప్రధానమంత్రి మోదీ, అధ్యక్షుడు జేపీ నడ్డా, రాజ్యసభలో పార్టీ పక్షనేత పీయూష్‌గోయల్‌ ఉన్నారు. ఇందులో ఆర్థిక పరిస్థితిపై తీర్మానం తర్వాత ఎన్నికలపై చర్చ జరిగింది.

24 గంటలపాటు ఒక జిల్లాలో ఉండాలి

ఇటీవల యూపీ, త్రిపురల్లో జరిగిన ఉప ఎన్నికల్లో పార్టీ విజయానికి కారణాలు, అనుభవాలను ఆ రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు చెప్పారు. ఎన్నికలు జరగనున్న గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, నాగాలాండ్‌ రాష్ట్రాల అధ్యక్షులు ఎలా సన్నద్ధం అవుతున్నదీ నివేదించారు. ఒక రోజు ఒక జిల్లాలో మొత్తం యంత్రాంగమంతా కార్యక్రమాలు చేపట్టడంతోపాటు ఎన్నికల వరకు అనుసరించనున్న వ్యూహాన్ని గుజరాత్‌ పార్టీ అధ్యక్షుడు వివరించారు. ఈ సమయంలో  మోదీ జోక్యం చేసుకొని అన్ని రాష్ట్రాల అధ్యక్షులు దీన్ని పరిగణనలోకి తీసుకోవాలని, పార్టీ యంత్రాంగమంతా 24 గంటలపాటు ఒక జిల్లాలో ఉండి లబ్ధిదారులను కలవడం, కార్యకర్తలతో మమేకం కావడం వల్ల ప్రయోజనం ఉంటుందని పేర్కొన్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. లోక్‌సభ సభ్యులు కూడా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇదే పద్ధతిని అనుసరించాలని పేర్కొన్నట్లు తెలిసింది. ఆజంగఢ్‌, రాంపుర్‌ లోక్‌సభ ఉప ఎన్నికల పలితాల గురించి చర్చ సమయంలో నాయకులు క్రమంగా అక్కడ డబుల్‌ ఇంజిన్‌ స్లోగన్‌ పని చేస్తోందనగా, అన్ని వెనకబడిన వర్గాల్లోనూ విద్య, అభివృద్ధిపైన దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రధాని సూచించినట్లు తెలిసింది. తెలంగాణలో 119 నియోజకవర్గాలకు ఒక్కో ముఖ్యనాయకుడు వెళ్లి సమావేశాలు నిర్వహించడం, కార్యకర్తలతో సమావేశం కావడం గురించి జేపీ నడ్డా వివరించగా, ఇలా కార్యవర్గ సమావేశాలు జరిగినప్పుడే కాకుండా ఎప్పుడూ చేయాలని కూడా ప్రధానమంత్రి సూచించినట్లు తెలిసింది. మత్స్య సహకార రంగాలపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాలని కూడా ప్రధానమంత్రి సూచించినట్లు తెలిసింది. కార్యవర్గ సమావేశం ముగింపు సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం ప్రధానమంత్రి మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలిసింది. 

విపక్షాలు విధ్వంసాన్ని కోరుకుంటున్నాయి..

కేంద్ర ప్రభుత్వం ప్రజాసంక్షేమం, దేశ సమగ్రత కోసం పని చేస్తుంటే విపక్షాలు విధ్వంసాన్ని కోరుకుంటున్నాయని భాజపా జాతీయ కార్యవర్గ సమావేశం  అభిప్రాయపడింది. మోదీని వ్యతిరేకించడంలో భాగంగా విపక్షాలు దేశాన్నీ వ్యతిరేకిస్తున్నాయని పేర్కొంది. రానున్న అసెంబ్లీ ఎన్నికలు, 2024 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేపట్టాల్సిన ప్రచార వ్యూహం గురించి చర్చించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. బూత్‌స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ విధానాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం, విపక్షాల వైఖరిని ఎండగట్టడంపై మొదటి రోజు ప్రధానంగా చర్చ జరిగినట్లు  పార్టీ వర్గాలు తెలిపాయి.. కార్యవర్గ సమావేశాల ముగింపు సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడే అవకాశం ఉంది.

తెరాసపై పోరు ఉద్ధృతం

తెలంగాణపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించిన భాజపా కార్యవర్గ సమావేశంలో రాష్ట్రంలోని పరిస్థితిపై ప్రత్యేకంగా ఓ పత్రాన్ని విడుదల చేయనుంది. ఈ విషయాన్ని పార్టీ జాతీయ నాయకత్వం అధికారికంగానే ప్రకటించింది. మొదటిరోజే దీనిని విడుదల చేయాలని నిర్ణయించినా సమయాభావం వల్ల రెండోరోజుకు వాయిదా వేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణ గురించి ప్రత్యేకంగా ఓ పత్రాన్ని విడుదల చేయాలని పదాధికారుల సమావేశంలో నిర్ణయించామని, కార్యవర్గంలో చర్చించిన తర్వాత విడుదల చేస్తామని పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, రాజస్థాన్‌ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే సింధియా ప్రకటించడం ప్రాధాన్యాన్ని సంతరించుకొంది. కుటుంబపాలన, అవినీతి, తెలంగాణ ఏర్పడిన లక్ష్యాన్ని సాధించకపోవడం, భాజపా కార్యకర్తలపై జరుగుతున్న దాడులు, తదితర అంశాల గురించి ఇందులో ప్రస్తావించనున్నారు. ఈ పత్రాన్ని ఆధారం చేసుకొని రాబోయే రోజుల్లో రాష్ట్రంలో తెరాసకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టాలని నిర్ణయించినట్లు భాజపా వర్గాలు తెలిపాయి. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు భాజపా విస్తరించిందని, ఇందులో భాగంగా తెలంగాణ కూడా భాజపా ఖాతాలో చేరుతుందని హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ అభిప్రాయపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు