Updated : 18 Jan 2022 09:47 IST

Formula ERace: సాగర్‌ తీరంలో ప్రపంచ ఫార్ములా ఈ-రేస్‌

నవంబరు- ఫిబ్రవరి మధ్య హైదరాబాద్‌లో పోటీలు
2.37 కిలోమీటర్ల ప్రత్యేక ట్రాక్‌
ఎలక్ట్రిక్‌ వాహనరంగానికి మరింత ఊతం: మంత్రి కేటీఆర్‌

ఫార్ములా ఈ-రేస్‌కు వేదికగా హైదరాబాద్‌ ఎంపికపై సోమవారం కేటీఆర్‌ సమక్షంలో ఒప్పంద

పత్రాలు  చూపుతున్న గ్రీన్‌కో సంస్థ సీఈవో అనిల్‌ చలమలశెట్టి,ఫార్ములా-ఈ సహ వ్యవస్థాపకుడు

అల్బెర్టో లాంగో, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌

ఈనాడు, హైదరాబాద్‌: అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఫార్ములా ఈ-రేస్‌కు తెలంగాణ వేదిక కానుంది. ఫార్ములా వన్‌కు ప్రత్యామ్నాయంగా పూర్తిగా ఎలక్ట్రిక్‌ కార్లతో నిర్వహించే ఈ పోటీలకు హైదరాబాద్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇప్పటికే పారిస్‌, రోమ్‌, లండన్‌, హాంకాంగ్‌, న్యూయార్క్‌, బెర్లిన్‌ తదితర 18 నగరాలు వేదికగా ఉండగా... మరో 60 నగరాలతో పోటీపడి కొత్త వేదికగా భారత్‌ నుంచి తొలిసారిగా హైదరాబాద్‌ ఈ అవకాశాన్ని దక్కించుకుంది. నవంబరు 22 నుంచి ఫిబ్రవరి వరకు ఫార్ములా ఈ-రేసు పోటీలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతాయని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ ఈ సందర్భంగా తెలిపారు. హైదరాబాద్‌లో పోటీలు జరిగే తేదీలను త్వరలోనే నిర్వాహకులు ప్రకటిస్తారని ఆయన చెప్పారు. దీని కోసం నెక్లెస్‌రోడ్‌, సచివాలయం, తెలుగుతల్లి ఫ్లైఓవర్‌, హుస్సేన్‌సాగర్‌ చుట్టూ 2.37 కిలోమీటర్ల ఈ-రేసింగ్‌ ట్రాక్‌ను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ, వాడకాన్ని పెద్దఎత్తున ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. పినాకిల్‌ ఎలక్ట్రిక్‌ కార్‌ రేసింగ్‌ ఛాంపియన్‌ షిప్‌ పేరిట జరిగే ఫార్ములా ఈ-రేసుకు హైదరాబాద్‌ను వేదికగా ఎంపిక చేస్తూ అంతర్జాతీయ వాహన సమాఖ్య ఫార్మలా-ఈతో రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో సోమవారం ఒప్పందం కుదుర్చుకుంది. ఫార్ములా-ఈ సహ వ్యవస్థాపకుడు, చీఫ్‌ ఛాంపియన్‌ షిప్‌ ఆఫీసర్‌ అల్బెర్టో లాంగో, ప్రమోటర్‌, గ్రీన్‌కో సంస్థ సీఈవో అనిల్‌ చలమలశెట్టి, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌లు ఈ ఒప్పంద పత్రంపై సంతకాలు చేశారు. దీనిపై మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తంచేశారు. తెలంగాణకు గర్వకారణమన్నారు. పోటీల నిర్వహణ వల్ల ఎలక్ట్రిక్‌ వాహనాలపై ప్రజలకు మరింత అవగాహన వస్తుందని, దేశవ్యాప్తంగా వినియోగం పెరుగుతుందన్నారు. బీజింగ్‌లో జరిగిన పోటీల్లో భారత్‌కు చెందిన ఫార్ములా జట్టు మూడో స్థానంలో నిలిచిందని, హైదరాబాద్‌లో జరిగే పోటీల్లో అగ్రస్థానం పొందుతుందనే ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు. త్వరలో హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు ఎలక్ట్రిక్‌ వాహనాలు అంతర్జాతీయ ప్రదర్శన నిర్వహిస్తామని కేటీఆర్‌ చెప్పారు.

హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న ఫార్ములా ఈ-రేస్‌ ట్రాక్‌ నమూనా

తెలంగాణ విధానం దేశంలోనే అత్యుత్తమం

అత్యుత్తమ ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ విధానాన్ని రాష్ట్రం అమలు చేస్తోందని, దీని ద్వారా దేశవ్యాప్తంగా వినియోగం విస్తృతమైందని మంత్రి తెలిపారు. ఇప్పటికే సీతారామ్‌పూర్‌, దివిటిపల్లిలో వాహనాల తయారీ పరిశ్రమల సమూహాలను ఏర్పాటు చేశామని, పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నామని కేటీఆర్‌ వెల్లడించారు. ఫార్ములా-ఈ సహ వ్యవస్థాపకుడు అల్బెర్టో లాంగో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం అత్యంత వేగంగా ఈ-రేసు నిర్వహణకు అనుమతులిచ్చిందన్నారు. కేటీఆర్‌ చొరవే ఇందుకు కారణమన్నారు. సౌదీ ఆరేబియాలో 28, 29 తేదీల్లో జరిగే ఏబీబీ ప్రపంచ ఫార్ములా-ఈ దిరియా ప్రిక్స్‌-2022 రేసుకు హాజరు కావాలని కేటీఆర్‌ను ఆహ్వానించగా మంత్రి సానుకూలంగా స్పందించారు. సమావేశంలో ట్రాక్‌ అండ్‌ ఓవర్లే డైరెక్టర్‌ అగస్‌ జోమానో, మహీంద్రా రేసింగ్‌ సీఈవో దిల్‌బాగ్‌ గిల్‌, మేఘా సంస్థ ప్రతినిధి అఖిల్‌రెడ్డి, రాష్ట్ర ఎలక్ట్రిక్‌ వాహనాల సంచాలకుడు సుజయ్‌ కారంపురి మాట్లాడారు.

ఫార్ములా- ఈ అంటే?

ఫార్ములా వన్‌.. రేసింగ్‌పై అభిరుచి ఉన్న ప్రపంచ వ్యాప్త అభిమానులందరికీ పరిచయం అక్కర్లేని ఛాంపియన్‌షిప్‌ ఇది. కార్లను ట్రాక్‌పై రయ్‌మని పరుగులు పెట్టిస్తూ.. తమ వేగంతో రేసర్లు ఎఫ్‌1లో అదరగొడతారు. ఏడాదిలో 20కు పైగా గ్రాండ్‌ప్రిలు.. వాటిల్లో గెలిచిన పాయింట్ల ఆధారంగా చివర్లో అగ్రస్థానంలో నిలిచే రేసర్‌కు ప్రపంచ ఛాంపియన్‌ టైటిల్‌ దక్కుతుంది. మరి ఫార్ములా- ఈ అంటే.. అది కూడా ఫార్ములా వన్‌ లాంటిదే. కానీ అక్కడ ఇంధనంతో నడిచే కార్లు పోటీల్లో పరుగులు పెడితే.. ఫార్ములా- ఈ రేసుల్లో  ఎలక్ట్రిక్‌ కార్లు ట్రాక్‌పై దూసుకెళ్తాయి. ఫార్ములా- ఈ, ఎఫ్‌1 మధ్య ఇదే ప్రధాన తేడా. ఎఫ్‌1 ఛాంపియన్‌షిప్‌ను నిర్వహించే అంతర్జాతీయ ఆటోమొబైల్‌ సమాఖ్య (ఎఫ్‌ఐఏ)నే ఫార్ములా- ఈ రేసులనూ నిర్వహిస్తోంది. నగరాల్లోని రోడ్లపై కూడా ఈ రేసులు నిర్వహించడమే దీని ప్రత్యేకత. మన మహీంద్రాతో పాటు మెర్సిడెస్‌, నిసాన్‌, జాగ్వర్‌, పోర్షే లాంటి జట్లు ఈ ఛాంపియన్‌షిప్‌లో పోటీపడుతున్నాయి. ఎఫ్‌1 కార్లు అత్యధికంగా గంటకు 397 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలవు. ఫార్ములా- ఈ కార్లలో అది గంటకు 280 కిలోమీటర్లుగా ఉంది. కర్బన ఉద్గారాలు లేని కారు రేసులు నిర్వహించడం, విద్యుత్తు వాహనాలకు డిమాండ్‌ పెంచాలనే లక్ష్యంతో 2014లో ఫార్ములా- ఈ ఛాంపియన్‌షిప్‌కు శ్రీకారం చుట్టారు. పర్యావరణ హితం కోసం మొదలెట్టిన ఈ ఛాంపియన్‌షిప్‌కు క్రమంగా ఆదరణ పెరుగుతోంది.


స్వదేశంలో ఈ పోటీలు నా చిరకాల స్వప్నం: ఆనంద్‌మహీంద్రా

ఫార్ములా ఈ-రేసు నిర్వహణ అవకాశాన్ని హైదరాబాద్‌ దక్కించుకోవడంపై మంత్రి కేటీఆర్‌ను మహీంద్రాగ్రూపు అధినేత ఆనంద్‌ మహీంద్రా అభినందించారు. తమ చిరకాల స్వప్నం నెరవేరిందన్నారు. రేసింగ్‌లో చాలాకాలంగా విదేశాల్లో తమ జట్టు పాల్గొంటోందన్నారు. స్వదేశంలో, స్థానిక ప్రేక్షకుల మధ్య ఈ పోటీలు జరిగితే ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందని తాను నమ్మేవాడినని, ఈ కలను సాకారం చేసే దిశగా అడుగులు వేశారని ట్విటర్‌ ద్వారా కేటీఆర్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్‌లో పోటీకి తమ జట్టు సిద్ధమవుతోందన్నారు. దీనిపై కేటీఆర్‌ స్పందిస్తూ ఆనంద్‌ మహీంద్రాకు కృతజ్ఞతలు చెప్పారు. తెలంగాణను ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ హబ్‌గా మార్చేందుకు మద్దతు, మార్గదర్శకత్వం కావాలని కోరారు.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని