Indian Independence:కత్తులా.. గాజులా..

స్వాతంత్య్ర సంగ్రామంలో మహిళల పాత్ర ఆది నుంచీ అమూల్యమైందే! ఈస్టిండియా కంపెనీ హయాంలో రాజు మరణించినా బేలగా మారకుండా... ప్రజల్ని ఆంగ్లేయుల నుంచి కాపాడుకోవటానికి యుద్ధ భూమిలోకి దిగిన వీర రాణులెందరో. ఝాన్సీ

Updated : 24 Jan 2022 05:09 IST

స్వాతంత్య్ర సంగ్రామంలో మహిళల పాత్ర ఆది నుంచీ అమూల్యమైందే! ఈస్టిండియా కంపెనీ హయాంలో రాజు మరణించినా బేలగా మారకుండా... ప్రజల్ని ఆంగ్లేయుల నుంచి కాపాడుకోవటానికి యుద్ధ భూమిలోకి దిగిన వీర రాణులెందరో. ఝాన్సీ లక్ష్మీబాయిలా అనేకమంది బ్రిటిష్‌వారిని ధైర్యంగా ఎదుర్కొన్నారు. వారిలో చరిత్రకెక్కని పేరు రాణి అవంతీబాయి.

రామ్‌గఢ్‌ (ప్రస్తుత మధ్యప్రదేశ్‌లోని మాండ్లా జిల్లాలోగల దిండోరి పట్టణం) రాజ్యాధినేత విక్రమాదిత్య లోది సతీమణి అవంతీబాయి. 1831లో జన్మించిన ఆమెకు చిన్నతనంలోనే పెళ్లయినా... యుద్ధవిద్యలో, దౌత్యనీతిలో శిక్షణ పొందింది. ఇద్దరు పిల్లలు పుట్టాక విక్రమాదిత్య అనారోగ్యం పాలయ్యారు. ఫలితంగా రాణి అవంతీబాయి పాలన పగ్గాలు చేపట్టడం అనివార్యమైంది. పిల్లలు మైనర్లుగా ఉండగానే విక్రమాదిత్య మరణించాడు. దీంతో ఆంగ్లేయుల కన్ను రామ్‌గఢ్‌పై పడింది. మైనర్‌ పుత్రులు అమన్‌సింగ్‌, షేర్‌సింగ్‌లతో పాటు రాణి అవంతీబాయిని వారసులుగా గుర్తించటానికి వారు నిరాకరించారు.

వారసుల్లేని రాజ్యాలను స్వాధీనం చేసుకునే పద్థతి ప్రవేశపెట్టిన ఈస్టిండియా కంపెనీ రామ్‌గఢ్‌ స్వాధీనానికి పావులు కదిపింది. 1851లో కంపెనీ తరఫున పాలనాధికారిని నియమించింది. అంతకుముందు నుంచే రెట్టింపు పన్నులతోప్రజలు అవస్థలపాలవటం ఆరంభమైంది. దీనికి తోడు... అడవుల్లోనూ పన్నులు వసూలు చేయాలని నిర్ణయించటంతో ఆదివాసీల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. వీటన్నింటి నేపథ్యంలో తనను కాదని బ్రిటిష్‌వారు పాలనాధికారిని నియమించటాన్ని అవంతీబాయి ఆత్మాభిమానం ఏమాత్రం అంగీకరించలేదు. ఆ ప్రతినిధిని తొలగించి... కంపెనీతో కయ్యానికి సిద్ధమైంది. ఇదే సమయంలో... తన చుట్టుపక్కలున్న రాజ్యాల వారందరితోనూ అత్యవసర సంప్రదింపులు జరిపింది. యుద్ధంలో తనతో కలసి రావాలని కోరుతూ... వారికి లేఖలు రాసింది. ప్రతి లేఖతో పాటు కొన్ని గాజులనూ పంపించింది. ‘‘మాతృభూమి బానిస సంకెళ్లను తెంచటంలో మీకూ బాధ్యత ఉందని నమ్మితే మీ కత్తులనెత్తి బ్రిటిష్‌తో యుద్ధానికి సిద్ధం కండి. లేదంటే... ఇదిగో ఈ గాజులు తొడుక్కొని ఇళ్లలో దాక్కోండి’’ అంటూ ఘాటుగా వారిని రెచ్చగొట్టింది అవంతీబాయి.

ఆమె పిలుపు ఫలించింది. ఆ ప్రాంతంలోని రాజ్యాలన్నీ అవంతీబాయితో పాటు కంపెనీపై యుద్ధానికి దిగాయి. 1857 సిపాయిల తిరుగుబాటు సమయానికి ఆ ప్రాంతమంతా కూడా రాజ్యాల తిరుగుబాట్లతో అట్టుడికింది. అవంతీబాయి స్వయంగా 4వేల మంది సైన్యంతో కంపెనీ సైన్యంతో రణరంగంలోకి దూకింది. తొలి పోరు ఖేరి గ్రామం వద్ద చోటు చేసుకుంది. అవంతీబాయిని తక్కువగా అంచనా వేసిన కంపెనీ సైన్యం కంగుతింది. ఆమె యుద్ధ నైపుణ్యాల ముందు తెల్లవారు తెల్లబోయారు. రామ్‌గఢ్‌ నుంచి పారిపోయారు. తర్వాత బ్రిటిష్‌ జిల్లా కమిషనర్‌ చార్లెస్‌ వాడింగ్టన్‌ సారథ్యంలో భారీ బలగాలను వెంటబెట్టుకొని వచ్చి రామ్‌గఢ్‌పై మళ్లీ దాడి చేశాడు. కంపెనీ ఆధునిక ఆయుధాల ముందు అవంతీబాయి సైన్యం నిలవలేకపోయింది. అలాగని ఆమె లొంగిపోలేదు. తెలివిగా... తప్పించుకొని కొంతమంది సైనికులతో దేవ్‌గఢ్‌ అడవుల్లోకి వెళ్లి తలదాచుకుంది. అక్కడి నుంచే గెరిల్లా తరహాలో పోరాటాన్ని కొనసాగిస్తూ ఆంగ్లేయులను ఇబ్బంది పెట్టింది. దీంతో వాడింగ్టన్‌ తన సైన్యాలను దేవ్‌గఢ్‌ గుట్టలవైపు నడిపించాడు. 1858 మార్చిలో... ఆంగ్లేయుల సైన్యం దేవ్‌గఢ్‌ గుట్టలను చుట్టుముట్టింది. ఒంటరైన అవంతీబాయి... బ్రిటిష్‌వారికి చేతికి చిక్కకుండా ఆత్మార్పణం చేసుకుంది. అలా 26 సంవత్సరాలకే ఆంగ్లేయులపై పోరాటంలో అమరురాలైన ఆమె... చరిత్ర పుటల్లోకి ఎక్కకున్నా... అక్కడి జానపదాల్లో ఇప్పటికీ పాటగా జీవించే ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని