Konijeti Rosaiah: రాజకీయ ఘనాపాటి.. కొణిజేటి

ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే... ముఖ్యమంత్రులు మారేవారేమోగానీ... మంత్రివర్గంలో రోశయ్య స్థానం మాత్రం పదిలం. ఆయనకు కీలక స్థానం దక్కడానికి అందరికీ తలలో నాలుకలా

Updated : 05 Dec 2021 10:10 IST

నొప్పింపక తానొవ్వని తత్వం

ముఖ్యమంత్రిగా, గవర్నర్‌గా సేవలు

16 సార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఘనత

అజాత శత్రువుగా గుర్తింపు

ఈనాడు, హైదరాబాద్‌, అమరావతి

ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే... ముఖ్యమంత్రులు మారేవారేమోగానీ... మంత్రివర్గంలో రోశయ్య స్థానం మాత్రం పదిలం. ఆయనకు కీలక స్థానం దక్కడానికి అందరికీ తలలో నాలుకలా వ్యవహరించే స్వభావమే కారణం. లౌక్యం, సమయస్ఫూర్తి, వాక్చాతుర్యం ఆయన ఆయుధాలు. బహుముఖప్రజ్ఞ, కార్యదక్షత, పార్టీ పట్ల అంకితభావం, విధేయత ఆయన బలాలు. ప్రతిపక్షంలో ఉండి అధికారపక్షంపై పదునైన వాగ్బాణాలు సంధించగలరు... అధికారపక్షంలో ఉన్నప్పుడూ తన వాగ్ధాటితో ప్రతిపక్షం దూకుడుకు కళ్లెమూ వేయగలరు. అందువల్లే ఎలాంటి రాజకీయ నేపథ్యంలేని కుటుంబం నుంచి వచ్చినా, అంగ బలం, వర్గబలం లేకపోయినా ఉన్నత పదవులు పొందగలిగారు.

గుంటూరు వంటి రాజకీయ చైతన్యంగల జిల్లా నుంచి విద్యార్థి నాయకుడిగా, ఆచార్య ఎన్జీ రంగా శిష్యుడిగా రాజకీయ ఓనమాలు దిద్దుకుని... అంచెలంచెలుగా అత్యున్నత స్థాయికి ఎదిగారు. ముఖ్యమంత్రిగా, గవర్నర్‌గా పదవులు అధిరోహించారు. కాంగ్రెస్‌ పార్టీలో ఈతరం నాయకులంతా ‘పెద్దాయన’గా పిలుచుకునే కొణిజేటి రోశయ్య సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం నిరుపమానం. 1964లో వేమూరులో పంచాయతీ వార్డు సభ్యునిగా మొదలైన ఆయన రాజకీయ ప్రయాణం... అయిదు దశాబ్దాల పాటు అప్రతిహతంగా కొనసాగింది. నవ యువకుడిగా జై ఆంధ్ర ఉద్యమంలో పాల్గొన్న ఆయన.. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఊపందుకుంటున్న దశలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉండటం విశేషం. 

విద్యార్థి నాయకుడిగా నెహ్రూ స్ఫూర్తితో..!

గుంటూరులోని హిందూ కాలేజీలో డిగ్రీ చదివే రోజుల్లో ఆయనకు రాజకీయాల పట్ల ఆసక్తి పెరిగింది. దీనివల్ల అప్పుడప్పుడు క్లాసులకు డుమ్మా కొట్టినా... చదువులో ఎప్పుడూ వెనుకబడేవారు కాదు. హిందూకాలేజీ విద్యార్థి సంఘం కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో అప్పట్లోనే పక్కాగా వ్యవహరించేవారు. అప్పట్లో శ్రీనగర్‌లో జరిగిన జాతీయ విద్యార్థి సదస్సుకు రోశయ్య నేతృత్వంలో బృందం వెళ్లింది. అక్కడి నుంచి రోశయ్య, ఇతర విద్యార్థులు దిల్లీ వెళ్లి తీన్‌మూర్తి భవన్‌లో ప్రధాని నెహ్రూని కలిశారు. రాజకీయాల్నే కెరీర్‌గా ఎంచుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నారు. 

ఆచార్య రంగా దగ్గర రాజకీయ పాఠాలు..!

స్వాతంత్య్ర సమరయోధుడు ఆచార్య ఎన్‌.జి.రంగా శిష్యరికం రోశయ్య ఉన్నత విలువలు కలిగిన నాయకుడిగా ఎదిగేందుకు తోడ్పడింది. ఆయన నిడుబ్రోలులో రంగా స్థాపించిన రైతాంగ విద్యాలయంలో రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు. రంగా, గౌతు లచ్చన్నల ప్రభావంతో రాజకీయాల్లోకి వచ్చానని చెప్పేవారు. నిజాం పాలన నుంచి హైదరాబాద్‌కి విముక్తి లభించాక... విశాలాంధ్ర ఏర్పాటు లక్ష్యంగా చర్చలకు అక్కడి నాయకులు వి.బి.రాజు, కొత్తూరి సీతయ్య గుప్త, బూర్గుల రామకృష్ణారావు తదితరులు గుంటూరుకి వచ్చినప్పుడు వారి ఆతిథ్యానికి ఏర్పాట్లు చేయడంలో రోశయ్య క్రియాశీలకంగా వ్యవహరించారు. ఎన్జీ రంగా స్థాపించిన కృషికార్‌ లోక్‌పార్టీలో ఆ తర్వాత ఆయన చురుగ్గా పనిచేశారు.

శోకసంద్రంలో వేమూరు
రోశయ్య(88) మృతి గుంటూరు జిల్లా వేమూరు ప్రజలను శోకసంద్రంలో ముంచేసింది. జన్మనిచ్చిన ఊరితో ఆయనకు విడదీయరాన్ని ఆత్మీయ బంధం ఉంది. ఆయన మృతి వేమూరు, తెనాలి ప్రాంత ప్రజానీకానికి తీరని లోటని వివిధ పార్టీల నాయకులు, ఊరి ప్రజలు వ్యాఖ్యానించారు.


చెన్నారెడ్డికి ఆత్మబంధువు..!

చెన్నారెడ్డి, రోశయ్య అత్యంత సన్నిహితంగా, ఆత్మబంధువుల్లా మెలిగేవారు. చెన్నారెడ్డి అంటే రోశయ్య అత్యంత గౌరవం చూపించేవారు. 1989లో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న చెన్నారెడ్డి... అప్పటి ఎన్నికల్లో రోశయ్య ఇంటి నుంచే తన రాజకీయ వ్యూహాల్ని, ప్రచార ప్రణాళికల్ని అమలు చేశారు. ఆ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వచ్చి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక... రోశయ్యను తన మంత్రివర్గంలోకి తీసుకుని కీలకమైన ఆర్థిక, రవాణా, విద్యుత్‌ శాఖల్ని అప్పగించారు. చెన్నారెడ్డిపై తనకున్న గౌరవాన్ని, కృతజ్ఞతా భావాన్ని ఎప్పుడూ దాచుకునేవారు కూడా కాదు.


అంజయ్య నుంచి రాజశేఖర్‌రెడ్డి వరకు..!

అంజయ్య, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి మంత్రివర్గాల్లో రోశయ్య కీలకమైన శాఖల్ని నిర్వహించారు. సుదీర్ఘకాలం ఆర్థిక మంత్రిగా పనిచేసి, ఏకంగా 16 సార్లు శాసనసభలో బడ్జెట్‌ ప్రవేశ పెట్టారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందంటే ఎలాగూ రోశయ్యదే అన్నంతగా ముద్ర పడిపోయింది. ముఖ్యమంత్రిగా ఎవరున్నా... వారికి విధేయంగా ఉంటూ, వారితో సమన్వయం చేసుకుంటూ వెళ్లడమే తప్ప, వారు రాజకీయంగా తనకంటే సీనియర్లా, జూనియర్లా అన్న భేషజాలకు ఆయనెప్పుడూ పోలేదు. అందరికీ సలహాలిస్తూ, తలలో నాలుకలా వ్యవహరిస్తూ అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్నారు. క్లిష్టమైన సమస్య ఏది వచ్చినా... రోశయ్యకు అప్పగిస్తే సులువుగా పరిష్కరిస్తారన్న భరోసా ముఖ్యమంత్రుల్లో ఉండేది. ఆయన వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డికి కూడా అంతే ఆప్తుడిగా ఉండేవారు. ఒక దశలో 65 కమిటీలకు ఛైర్మన్‌గా వ్యవహరించేవారు. వయోభారాన్ని లెక్క చేయకుండా, తనకు అప్పగించిన బాధ్యతల్ని చిత్తశుద్ధితో నిర్వహించేవారు.

* 1983లో ఎన్టీఆర్‌ ప్రభంజనంలో కాంగ్రెస్‌పార్టీ దాదాపుగా తుడిచిపెట్టుకుపోగా, రోశయ్య శాసనమండలిలో తన వాగ్ధాటితో ఆ పార్టీకి లోటు లేకుండా చేశారు.


డబ్బు లెక్కల్లో దిట్ట..!

ప్రభుత్వం ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్పప్పటికీ... పాలనా వ్యవహారాలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా సమన్వయం చేసుకుంటూ, ఆర్థిక పరమైన ఇబ్బందుల్ని అధిగమించేలా చూడటంతో రోశయ్య దిట్ట. సంక్షేమ పథకాల్ని, అభివృద్ధి కార్యక్రమాల్నీ సమన్వయం చేసుకోవడం ఏ ప్రభుత్వానికైనా కత్తిమీద సామే. సంక్షేమానికి పెద్ద పీట వేయకపోతే రాజకీయంగా పార్టీకి ఇబ్బంది. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోతే రాష్ట్రం వెనకబడుతుంది. ఆ రెండింటినీ సమతూకం చేస్తూ... ప్రభుత్వ ప్రాధాన్యాలు అమలయ్యేలా చేయడంలో రోశయ్య అనుభవం, లౌక్యం ఎంతగానే ఉపయోగపడేవి. అందుకే ముఖ్యమంత్రి ఎవరైనా... ఆర్థిక మంత్రి పదవి రోశయ్యనే వరించేది. అలాగని విషయాన్ని గట్టిగా చెప్పాల్సి వచ్చినప్పుడు రోశయ్య వెనక్కు తగ్గేవారు కాదని ఆయన సహచరులు, కలసి పనిచేసిన అధికారులు చెబుతారు. వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి హయాంలో సంక్షేమం పాలు ఎక్కువైందనిపించినప్పుడు... అది మరీ మితిమీరితే వచ్చే ఇబ్బందుల గురించి సుతిమెత్తగానే హెచ్చరించారని ఒక అధికారి తెలిపారు. రేషన్‌ దుకాణాల్లో సరఫరా చేసే సబ్సిడీ బియ్యం ధర తగ్గించాలని వైఎస్‌ నిర్ణయం తీసుకున్నప్పుడూ...ముందే తనను సంప్రదించి ఉండాల్సిందని ఆయన తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగానే చెప్పారని అప్పట్లో ఆయనతో పనిచేసిన మరో అధికారి పేర్కొన్నారు.


కృష్ణా వరదల్లో రాత్రంతా సచివాలయంలోనే..!

రోశయ్య సీఎంగా బాధ్యతలు చేపట్టాక మరుసటి నెలలోనే కృష్ణానదికి కనీవినీ ఎరుగని రీతిలో వరదలు వచ్చాయి. శ్రీశైలం ప్రాజెక్టులోకి లక్షల క్యూసెక్కుల వరదనీరు పోటెత్తింది. ప్రవాహవేగానికి డ్యామ్‌ కొట్టుకుపోతుందేమోనని భయపడ్డారు. వేలాది గ్రామాలు జలమయమయ్యాయి. ప్రాణనష్టం, అపారంగా ఆస్తి నష్టం సంభవించింది. ఆ విపత్కర పరిస్థితుల్లో రోశయ్య అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. వరద పోటెత్తిన రోజు ఆయన రాత్రంతా సచివాలయంలోనే ఉండి... పరిస్థితిని సమీక్షించారు. ఆ వయసులోనూ ఆయన ముఖ్యమంత్రిగా అన్ని శాఖల మంత్రులు, అధికారులతో తరచూ సమీక్షా సమావేశాలు నిర్వహించేవారు. క్షేత్ర స్థాయి పర్యటనలతో ప్రజల నుంచి సమస్యలు తెలుసుకునేవారు.


తెలంగాణపై కమిటీకి ఛైర్మన్‌

సుదీర్ఘ రాజకీయ అనుభవం..అనేక మంది సీఎంల దగ్గర వివిధ శాఖల మంత్రులుగా పనిచేసిన రోశయ్య వివిధ అంశాలపై ముఖ్యమంత్రులు వేసిన కమిటీలు, సబ్‌కమిటీల్లో సైతం కీలక బాధ్యతలు నిర్వహించారు. 2009 ఎన్నికలకు ముందు అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తెలంగాణ అంశంపై కమిటీ వేశారు. దీనికి రోశయ్యను ఛైర్మన్‌గా నియమించారు. తన రాజకీయ చాతుర్యంతో ప్రతిపక్షాలపై వ్యంగ్యాస్త్రాలు సంధించిన ఆయన తన పనితీరుతో స్వపక్షంలో మార్కులు పొందేవారు.

* రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తెరాస అధ్యక్షుడు కేసీఆర్‌ ఆమరణ నిరాహారదీక్షకు దిగారు. మలిదశ తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. నాటి యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ప్రకటన చేసింది రోశయ్య హయాంలోనే.

అర్ధ శతాబ్దం.. అనేక పదవులు

1933 జులై 4: గుంటూరు జిల్లా వేమూరులో జననం
1964 మే 31: వేమూరు పంచాయతీ బోర్డు సభ్యుడు
1968-86: ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి సభ్యుడు
1978-79: శాసనమండలిలో ప్రతిపక్ష నేత
1985-89: తెనాలి ఎమ్మెల్యే
1995-97: పీసీసీ అధ్యక్షుడు
1979 నుంచి వరుసగా అంజయ్య, కోట్ల విజయభాస్కరరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దనరెడ్డి, వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వాల్లో మంత్రి
1998: నరసరావుపేట ఎంపీ
2004: చీరాల ఎమ్మెల్యే
2009 సెప్టెంబరు 9: ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి
2010 నవంబరు 14: ముఖ్యమంత్రి పదవికి రాజీనామా
2011 ఆగస్టు 31: తమిళనాడు గవర్నర్‌

డొంకలు, కాల్వగట్లపై నడిచి.. చదువు

రోశయ్య ఒకటి నుంచి అయిదో తరగతి వరకు వేమూరులో, ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు పెరవలిలో, తొమ్మిది, పది తరగతులను కొల్లూరులో పూర్తిచేశారు. పెరవలిలో చదువుకునేటప్పుడు బస్సు సౌకర్యం లేక కాలినడకన డొంకలు, కాల్వగట్లపై నడిచి వెళ్లేవారు. రోశయ్యకు అపారమైన దైవభక్తి ఉండేది. స్వగ్రామంలో ఆలయాల నిర్మాణం, అభివృద్ధికి తనవంతు సహకారమందించారు.


అచ్చ తెలుగు ఆహార్యం

రోశయ్య ఆజానుబాహుడు... స్పష్టమైన ఉచ్చారణ... మనిషి ఎంత గంభీరమో... మనసు అంత సున్నితం. ఆయన ఎప్పుడూ తెల్ల పంచె, లాల్చీ ధరించి అచ్చతెలుగు ఆహార్యంతో... తెలుగుదనానికి చిహ్నంగా ఉండేవారు. లోక్‌సభలోనూ తెలుగులో మాట్లాడేవారు.


మాటల మాంత్రికుడు

అధికార పక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా... సభలో ఆయన మాట్లాడుతుంటే విపక్ష పార్టీ సభ్యులూ శ్రద్ధగా వినేవారు. తనదైౖన శైలిలో చెణుకులతో, పిట్టకథలతో ప్రత్యర్థుల మాటల దాడిని తిప్పికొట్టేవారు. సభలో గంభీర వాతావరణం నెలకొన్నప్పుడూ ఆయన తనదైన శైలిలో చెణుకులతో వాతావరణాన్ని తేలిక పరిచేవారు.


అందరికీ సన్నిహితుడు

తమిళనాడు గవర్నర్‌ హోదాలో జయలలితను సీఎంగా ఆహ్వానిస్తూ..

మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా ఏ పదవిలో ఉన్నా... రోశయ్య నిరాడంబరంగానే ఉండేవారు. అందరితో సన్నిహితంగా మెలిగేవారు. ఎవరైనా తనను విమర్శించినా, తనకు ఇబ్బంది కలిగించేలా వ్యవహరించినా మనసులో పెట్టుకునేవారు కాదు. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కేబినెట్‌లో మంత్రిగా ఉన్న ఆనం రామనారాయణరెడ్డి అప్పట్లో ఒక అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించాక... నిర్వహించిన మంత్రివర్గ సమావేశానికి సీనియర్‌ మంత్రిగా రోశయ్య సారథ్యం వహించారు. వై.ఎస్‌. మృతికి సంతాప తీర్మానాన్ని ఆమోదించేందుకు ఆ సమావేశం జరిగింది. జగన్‌ను తదుపరి ముఖ్యమంత్రిగా ప్రతిపాదిస్తూ తీర్మానం చేయాలని నేను సూచించాను అప్పటి సీఎస్‌ కొంత వారించారు. నేను అలాంటి ప్రతిపాదన చేయడం ఆయనకు కొంత ఇబ్బందికరమే. కానీ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాకా ఆ విషయాన్ని మనసులో పెట్టుకోకుండా, నాపై ఆదరాభిమానాలు చూపించారు’’ అని పేర్కొన్నారు.తన విలక్షణమైన వ్యవహార శైలి, హుందాతనంతో ఆయన అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్నారు.


అందలాలెక్కినా.. అమీర్‌పేటలోనే

హైదరాబాద్‌ (అమీర్‌పేట), న్యూస్‌టుడే: మాజీ ముఖ్యమంత్రి రోశయ్యకు హైదరాబాద్‌లోని అమీర్‌పేటతో అవినాభావ సంబంధం ఉంది. 1978లో ఆయన అమీర్‌పేటలోని శ్యామ్‌కరణ్‌ రోడ్డులో అద్దె ఇంట్లో ఉండేవారు. తర్వాత 1982లో ధరంకరం రోడ్డులోని సొంత ఇంటికి మారారు. అనంతర కాలంలో ఎన్ని పదవులు చేపట్టినా ఆయన ధరంకరం రోడ్డులోనే ఉండేవారు. రోశయ్య కుమారులూ ఇక్కడే ఉంటున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు, పలువురు ప్రముఖులు తరచు వస్తుండేవారు. రోశయ్య అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, వారి సమస్యలు వినేవారు.


ఇంటికి పెద్ద కొడుకు

కుటుంబసభ్యులతో రోశయ్య దంపతులు

కొణిజేటి సుబ్బయ్య, ఆదిమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు కాగా, వారిలో పెద్ద కుమారుడు రోశయ్య. విద్యాభ్యాసం అనంతరం రైస్‌మిల్లు వ్యాపారంలో కొనసాగుతూ శివలక్ష్మిని వివాహం చేసుకున్నారు. ఆయనకు శివసుబ్బారావు, త్రివిక్రమరావు, శ్రీమన్నారాయణమూర్తి అనే ముగ్గురు కుమారులతో పాటు రమాదేవి అనే కుమార్తె కూడా ఉన్నారు. రెండో కుమారుడు త్రివిక్రమరావును బంధువులకు దత్తత ఇచ్చారు. ప్రస్తుతం కుటుంబం అంతా వివిధ వ్యాపారాల్లో కొనసాగుతోంది.


రోశయ్య లేని లోటు పూడ్చలేనిది

సీనియర్‌ నాయకుడు రోశయ్య మృతితో ఏర్పడిన లోటును పూడ్చడం కష్టం. ఏపీ ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నర్‌గా హుందాగాఉన్నారు.

- రామ్‌నాథ్‌ కోవింద్‌, రాష్ట్రపతి

నాకు చిరకాల మిత్రులు

రోశయ్య పరమపదించారని తెలిసి విచారించాను. నాకు వారు చిరకాల మిత్రులు. విషయ పరిజ్ఞానంతో కూడిన వారి అనుభవం కీలక సమయాల్లో రాష్ట్రానికి దిశానిర్దేశం చేసింది.

- వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతి

తెలుగు ప్రజలకు తీరని ఆవేదన

రోశయ్య మరణం తెలుగు ప్రజలకు తీరని ఆవేదన మిగిల్చింది. 50 ఏళ్లకు పైగా ప్రజలకు సేవలందించారు. పరిపాలనాదక్షులు, విలువలకు కట్టుబడిన మహా నాయకుడు రోశయ్య.

- జస్టిస్‌ ఎన్‌వీ రమణ, సీజేఐ

మేమిద్దరం ఒకేసారి ముఖ్యమంత్రులం

రోశయ్య మృతి బాధాకరం. మేము ఇద్దరం ఒకేసారి మఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు, తర్వాత ఆయన తమిళనాడు గవర్నర్‌గా ఉన్నప్పుడు ఆయనతో సంభాషించిన అంశాలు గుర్తు చేసుకుంటున్నాను.

- మోదీ, ప్రధాని

అనుభవజ్ఞుడిని కోల్పోయాం

రోశయ్య మృతితో దేశం ఒక గొప్ప అనుభవజ్ఞుడైన నాయకుణ్ని కోల్పోయింది. ఆయన మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు. 

- తమిళిసై, తెలంగాణ గవర్నర్‌

ప్రత్యేకశైలి, హుందాతనం

రోశయ్య సౌమ్యుడిగా, సహనశీలిగా రాజకీయాల్లో తనదైన ప్రత్యేక శైలిని, హుందాతనాన్ని చాటుకున్నారు.

- కేసీఆర్‌, తెలంగాణ సీఎం

రెండు రాష్ట్రాలకూ తీరని లోటు

రోశయ్య మృతి రెండు రాష్ట్రాలకూ తీరని లోటు. నాటి ఉమ్మడి రాష్ట్ర రాజకీయాలలో రోశయ్యది ఆదర్శప్రాయమైన జీవితం.

- వైఎస్‌ జగన్‌, ఏపీ సీఎం

ఆర్థికవేత్తను కోల్పోయాం

రాజకీయాల్లో నైతిక విలువలు కలిగిన మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మృతితో రాష్ట్రం గొప్ప ఆర్థిక వేత్తను కోల్పోయింది. రాజకీయంగా విభేదించినా.. స్నేహపూర్వకంగా మెలిగేవారు.

- చంద్రబాబు, తెదేపా అధినేత

ఎంతో బాధాకరం

రోశయ్య మృతి బాధాకరం. ఆయన కుటుంబసభ్యులకు హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నా. ఆయన ఆత్మకు సద్గతి కలగాలని ప్రార్థిస్తున్నా.

- కిషన్‌రెడ్డి, కేంద్ర మంత్రి

విజ్ఞతతో వ్యవహరించేవారు

సీనియర్‌ నాయకుడిని కోల్పోయాం. పలు దశాబ్దాల పాటు సాగిన ప్రజాజీవనంలో ఆయన విజ్ఞతతో వ్యవహరించేవారు.

- రాహుల్‌ గాంధీ, ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని