Omicron: ఒమిక్రాన్‌ కొమ్ము వంచే టీకా సులువేనా!

ప్రస్తుత కొవిడ్‌-19 టీకాలు ఒమిక్రాన్‌ వేరియంట్‌పై ఎంత సమర్థంగా పనిచేస్తాయనే అంశం చర్చనీయాంశమైంది. ఇప్పటికే వినియోగంలోకి వచ్చిన వ్యాక్సిన్లు తీవ్రస్థాయి అనారోగ్యం నుంచి రక్షిస్తాయని శాస్త్రవేత్తలు భరోసా ఇస్తున్నారు. అయితే కొత్త

Updated : 07 Dec 2021 05:18 IST

కొత్త వేరియంట్‌పై పోరుకు ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్‌లో మార్పు
వంద రోజులు  చాలంటున్న నిపుణులు

ప్రస్తుత కొవిడ్‌-19 టీకాలు ఒమిక్రాన్‌ వేరియంట్‌పై ఎంత సమర్థంగా పనిచేస్తాయనే అంశం చర్చనీయాంశమైంది. ఇప్పటికే వినియోగంలోకి వచ్చిన వ్యాక్సిన్లు తీవ్రస్థాయి అనారోగ్యం నుంచి రక్షిస్తాయని శాస్త్రవేత్తలు భరోసా ఇస్తున్నారు. అయితే కొత్త వేరియంట్‌కు అనుగుణంగా ఎంఆర్‌ఎన్‌ఏ టీకాల్లో మార్పు చేసే అంశాన్ని ఫైజర్‌, మోడెర్నా వంటి సంస్థలు పరిశీలిస్తున్నాయి. ఈ ప్రక్రియ అంత సులువుగా సాగుతుందా అన్నది ఇక్కడ కీలకంగా మారింది. ఈ ప్రక్రియపై పరిశోధకుల విశ్లేషణ ఇది.

టీకాలను ఎందుకు మెరుగుపరచాలి?

ఇప్పటికే ఇచ్చిన టీకాతో ఉత్పత్తయిన యాంటీబాడీలు.. కొత్త వేరియంట్‌ను గుర్తించి,  దాన్ని నిర్వీర్యం చేయలేని స్థితి ఉంటుందా  
అన్నదానిపై ఇది ఆధారపడి ఉంటుంది.

కరోనా వైరస్‌ తన కొమ్ము ప్రొటీన్‌ను (స్పైక్‌) ఉపయోగించుకొని మానవ కణాల్లోని ఏసీఈ2 గ్రాహకాల్లోకి ప్రవేశించి ఇన్‌ఫెక్షన్‌ కలిగిస్తుంది.  

కొవిడ్‌ నివారణకు రూపొందిన ఎంఆర్‌ఎన్‌ఏ టీకాలన్నీ స్పైక్‌ ప్రొటీన్‌ను ఉత్పత్తి చేయాలన్న సందేశాన్ని మానవ కణాలకు అందిస్తాయి.  

ఇలా తయారయ్యే స్పైక్‌ ప్రొటీన్‌ యాంటీబాడీలను ఉత్పత్తి చేసేలా శరీరాన్ని ప్రేరేపిస్తుంది.

ఆ యాంటీబాడీలు కరోనాలోని స్పైక్‌ ప్రొటీన్‌కు అంటుకొని వైరస్‌ను అడ్డుకుంటాయి.  

ఒమిక్రాన్‌లోని స్పైక్‌ ప్రొటీన్‌ ఉత్పరివర్తనాల్లో కొత్త పోకడ కనిపించింది. మునుపటి టీకాలతో ఉత్పత్తయిన యాంటీబాడీల్లో కొన్నింటి సామర్థ్యాన్ని అవి తగ్గించేయవచ్చు. అలాంటి పరిస్థితుల్లో వ్యాక్సిన్‌ను మెరుగుపరచాల్సి రావొచ్చు.

కొత్త వ్యాక్సిన్‌ ఎంత భిన్నంగా ఉంటుంది?

ప్రస్తుత ఎంఆర్‌ఎన్‌ఏ టీకాల్లో కరోనా వైరస్‌లో మొదట వచ్చిన వేరియంట్‌కు సంబంధించిన స్పైక్‌ ప్రొటీన్‌ సంకేతం ఉంది. కొత్తగా రూపొందించే వ్యాక్సిన్‌లో ఒమిక్రాన్‌ సంకేతాన్ని ఉంచుతారు. ఫలితంగా ఈ కొత్త టీకా ఒమిక్రాన్‌ వైరస్‌కు బలంగా అంటుకునే యాంటీబాడీలను ఉత్పత్తి చేయిస్తుంది.

ఇప్పటికే టీకా పొందిన వారు లేదా గతంలో కొవిడ్‌ నుంచి కోలుకున్నవారు ఈ కొత్త టీకాతో కూడిన బూస్టర్‌ డోసును పొందాల్సి ఉంటుంది. తద్వారా వీరు ఇప్పటికే వ్యాప్తిలో ఉన్న ఇతర వేరియంట్లతో పాటు ఒమిక్రాన్‌ను కూడా సమర్థంగా ఎదుర్కోగలరు.

ఒకవేళ డెల్టా వేరియంట్‌ను తోసిరాజని ఒమిక్రాన్‌ ప్రధాన రకంగా మారిపోతే.. ఇప్పటికీ టీకా పొందనివారు 2-3 డోసుల కొత్త వ్యాక్సిన్‌ను పొందితే సరిపోతుంది.

డెల్టా,  ఒమిక్రాన్‌లు రెండూ విస్తృతంగా వ్యాప్తిలో ఉంటే.. ప్రస్తుత, మెరుగుపరచిన టీకాలతో కూడిన మిశ్రమాన్ని పొందాల్సి రావొచ్చు.

టీకాను మెరుగుపరిచేదెలా?

ఎంఆర్‌ఎన్‌ఏ టీకాను మెరుగుపరచడానికి కొత్త వేరియంట్‌కు సంబంధించిన స్పైక్‌ ప్రొటీన్‌ జన్యుక్రమం, ఎంఆర్‌ఎన్‌ఏ నిర్మాణానికి ఉపయోగించే డీఎన్‌ఏ టెంప్లేట్‌ అవసరం. ఒమిక్రాన్‌లోని స్పైక్‌ ప్రొటీన్‌కు సంబంధించిన జన్యు సంకేతాన్ని శాస్త్రవేత్తలు ఇప్పటికే వెలుగులోకి తెచ్చారు. ఇప్పుడు మిగిలిందల్లా.. స్పైక్‌ ప్రొటీన్‌కు సంబంధించిన డీఎన్‌ఏ టెంప్లేట్‌ను తయారుచేయడమే. దాని సాయంతోనే కొత్త వ్యాక్సిన్లలోని ఎంఆర్‌ఎన్‌ఏ భాగాన్ని ఉత్పత్తి చేస్తారు. ఇందుకోసం శాస్త్రవేత్తలు డీఎన్‌ఏ టెంప్లేట్లను కృత్రిమ ఎంజైమ్‌లు, ఎంఆర్‌ఎన్‌ఏలోని నాలుగు నిర్మాణ ‘ఇటుక’లైన జి, ఎ, యు, సిలతో కలుపుతారు. ఫలితంగా డీఎన్‌ఏ టెంప్లేట్‌కు సంబంధించిన ఎంఆర్‌ఎన్‌ఏ ప్రతులు సిద్ధమవుతాయి. ఈ విధానంలో ఒక బ్యాచ్‌ ఎంఆర్‌ఎన్‌ఏను ఉత్పత్తి చేయడానికి కొన్ని నిమిషాలు సరిపోతాయి. ఆ తర్వాత ఈ ఎంఆర్‌ఎన్‌ఏ ప్రతులను ఫ్యాటీ నానోరేణువుల్లో ఉంచుతారు.

ఎంత సమయం పడుతుంది?

డీఎన్‌ఏ టెంప్లేట్‌ సృష్టికి 3 రోజులు సరిపోతుంది. ల్యాబ్‌లో పరీక్షించడానికి సరిపడా వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయడానికి వారం పడుతుంది. ఆ తర్వాత టెస్ట్‌ ట్యూబుల్లో మానవ కణాలపై పరీక్షించడానికి మరో ఆరువారాలు అవసరం. మనుషులపై క్లినికల్‌ ప్రయోగాలు చేయడానికి మరికొన్ని వారాలు అవసరం. అంతిమంగా కొత్త వ్యాక్సిన్‌ను అప్‌డేట్‌ చేసి, అన్ని పరీక్షలు పూర్తిచేయటానికి దాదాపు 100 రోజులు పడుతుంది. ఈ ప్రయోగాలు జరుగుతుండగానే ఉత్పత్తిదారులు తమ తయారీ ప్రక్రియల్లో మార్పులు చేసుకుంటే.. కొత్త టీకాకు ఆమోదం లభించగానే దాన్ని వేగంగా అందుబాటులోకి తీసుకురావొచ్చు.

- ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని