Updated : 06 Dec 2021 11:42 IST

Omicron: 6 వారాలు కీలకం

జనవరిలో కరోనా కేసులు పెరిగే అవకాశం
ఫిబ్రవరి నాటికి ఒమిక్రాన్‌ తీవ్రం కావచ్చు
స్వల్ప లక్షణాలే ఉండటం ఊరటనిచ్చే అంశం
మాస్కు, స్వీయ జాగ్రత్తలతో బయటపడదాం
ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు వెల్లడి

ఈనాడు- హైదరాబాద్‌: రాష్ట్రంలో వచ్చే ఆరు వారాలు అత్యంత కీలకమని, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రజారోగ్య సంచాలకులు (డీహెచ్‌) డాక్టర్‌ జి.శ్రీనివాసరావు సూచించారు. జనవరి 15 తరువాత రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగే అవకాశముందని, ఫిబ్రవరి నాటికి తీవ్రత మరింత ఎక్కువ కావచ్చని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో ప్రతిఒక్కరూ మాస్కు ధరించాలని సూచించారు. అర్హులు రెండు డోసుల వ్యాక్సిన్‌ వేయించుకోవాలని కోరారు. ఇలాంటి స్వీయజాగ్రత్తలతో మూడోదశ ఉద్ధృతి బారినపడకుండా గట్టెక్కే అవకాశాలున్నాయని చెప్పారు. కోఠిలోని ఆరోగ్య కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాబోయే రోజుల్లో లాక్‌డౌన్‌లు ఉండే అవకాశాలు లేవని, సమస్యకు అది పరిష్కారం కాదని అభిప్రాయపడ్డారు. నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంచడం, బాధితులకు సరైన చికిత్స అందించడానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తుందని డీహెచ్‌ తెలిపారు. ఈ నెలలో 1.03 కోట్ల కొవిడ్‌ డోసులు వేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు. బూస్టర్‌ డోసు, పిల్లలకు టీకాల ఆవశ్యకతపై కేంద్రానికి విన్నవించినట్లు చెప్పారు.

తీవ్ర ఒళ్లు నొప్పులు.. నీరసం..

‘‘ఒమిక్రాన్‌ వెలుగులోకి వచ్చిన దక్షిణాఫ్రికాలో బాధితులు ఆసుపత్రుల్లో చేరడం గానీ, మరణాలు కానీ నమోదు కాకపోవడం ఊరట నిచ్చే అంశం. ఈ వేరియంట్‌ వల్ల తీవ్ర ఒళ్లు నొప్పులు, తలనొప్పి, నీరసం వంటి స్వల్ప లక్షణాలే కనిపిస్తున్నాయి. అయినా అప్రమత్తంగా ఉండాలి. ఒమిక్రాన్‌ ఇప్పటికే చాలా దేశాలకు విస్తరించింది. మన దేశంలోనూ కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. తెలంగాణలోనూ వచ్చే అవకాశాలున్నాయి. ఈ నెల 1 నుంచి ఇప్పటివరకూ రాష్ట్రానికి వచ్చిన 900 మందికి పైగాఅంతర్జాతీయ ప్రయాణికులకు కొవిడ్‌ పరీక్షలు చేశాం. వీరిలో 13 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా.. నమూనాలను జన్యుక్రమ విశ్లేషణకు పంపించాం. త్వరలో ఫలితాలు వస్తాయి’’.

కొవిడ్‌ కంటే తప్పుడు కథనాలు ఎక్కువ ప్రమాదకరం

‘‘రాష్ట్రంలో నిర్వహిస్తోన్న ‘జ్వర సర్వే’ దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఇప్పటికే కోటి ఇళ్లను వైద్యసిబ్బంది ఆరేడుసార్లు సందర్శించారు. లక్షణాలున్న 8 లక్షల మందిని గుర్తించి కొవిడ్‌ చికిత్స కిట్లను అందజేశారు. ఈ విధానాన్ని నీతిఆయోగ్‌ కూడా ప్రశంసించింది. డెల్టా వేరియంట్‌ సమయంలో కనీస నష్టంతో బయటపడ్డాం. రాష్ట్రంలో 20 లక్షల కరోనా కేసులు ఉన్నాయంటూ కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారు. కేసులు దాస్తున్నామని చేస్తున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదు. వైద్య సిబ్బంది 70 మంది చనిపోయారు. వారిని అవమానిస్తారా? ప్రభుత్వం పడిన శ్రమ ఏమి కావాలి? ఇటువంటి కథనాలను చూసి భయంతో ప్రజలు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఎదురవుతోంది. కొవిడ్‌ కంటే తప్పుడు కథనాలు ఎక్కువ ప్రమాదకరం. వైద్యఆరోగ్యశాఖ మనోధైర్యాన్ని దెబ్బతీయొద్దు’’ అని డీహెచ్‌ కోరారు.


Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని