PM Modi: ‘ఒమిక్రాన్‌’తో జాగ్రత్త..

ప్రపంచాన్ని ఠారెత్తిస్తున్న కొత్త కరోనా వైరస్‌ వేరియంట్‌ ఒమిక్రాన్‌పై అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ అధికారులను ఆదేశించారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయాల్లో క్షుణ్నంగా కొవిడ్‌ పరీక్షలు చేయాలని సూచించారు.

Updated : 28 Nov 2021 05:49 IST

విదేశీ ప్రయాణికులను క్షుణ్నంగా పరీక్షించండి
అంతర్జాతీయ ప్రయాణ ఆంక్షలపైనా సమీక్షించండి
రెండో డోసు వేగాన్ని పెంచండి
ప్రధాని మోదీ ఆదేశాలు

ఉన్నతాధికారులతో మోదీ వీడియో సమీక్ష

ఈనాడు, దిల్లీ: ప్రపంచాన్ని ఠారెత్తిస్తున్న కొత్త కరోనా వైరస్‌ వేరియంట్‌ ఒమిక్రాన్‌పై అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ అధికారులను ఆదేశించారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయాల్లో క్షుణ్నంగా కొవిడ్‌ పరీక్షలు చేయాలని సూచించారు. అంతర్జాతీయ ప్రయాణ ఆంక్షలు సులభతరం చేసే ప్రణాళికలపైనా సమీక్ష జరపాలని అధికారులకు తెలిపారు. ముఖ్యంగా ఒమిక్రాన్‌ ప్రభావిత దేశాల నుంచి వచ్చేవారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. శనివారం ప్రధాని రెండు గంటల పాటు ‘ఒమిక్రాన్‌’తో పాటు.. దేశంలో టీకా కార్యక్రమంపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. అంతర్జాతీయ ప్రయాణికుల నుంచి సేకరించిన నమూనాల జన్యుపరిణామ క్రమాన్ని విశ్లేషించాలని ఆదేశించారు. కొత్త వేరియంట్‌ గురించి రాష్ట్రాలు, జిల్లాస్థాయి అధికారులకు అవగాహన కల్పించేందుకు అధికారులు వారితో మాట్లాడుతూ ఉండాలని పేర్కొన్నారు. రెండో డోసు తీసుకోని వారిని గుర్తించి వెంటనే అందించడానికి చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ సమీక్షలో కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గాబా, నీతి ఆయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ వి.కె.పాల్‌, హోంశాఖ కార్యదర్శి ఎ.కె.భల్లా, వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌, ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ బలరాం భార్గవ, ముఖ్య శాస్త్రసాంకేతిక సలహాదారుడు కె.విజయ రాఘవన్‌ తదితరులు పాల్గొన్నారు.  

విమానాశ్రయాల దగ్గర కఠిన ఆంక్షలు

ఒమ్రికాన్‌ వేరియంట్‌ ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టిస్తుండటంతో రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. విమానాశ్రయాల దగ్గర వైద్యాధికారులను మోహరించాయి. విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులపై దృష్టి పెట్టాయి. ‘హై-రిస్క్‌’ విభాగంలో ఉన్న దేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల దగ్గర కొవిడ్‌ పరీక్ష ఫలితాలు ఉన్నా, వారికి మళ్లీ కర్ణాటక ప్రభుత్వం పరీక్షలు నిర్వహిస్తోంది. నెగెటివ్‌ వస్తేనే విమానాశ్రయం వెలుపలికి వెళ్లేందుకు అనుమతి ఇస్తోంది. నెగెటివ్‌ వచ్చినా ఏడు రోజుల క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. చెన్నై, మధురై, కోయంబత్తూర్‌, తిరుచిరాపల్లి విమానాశ్రయాల్లో ప్రత్యేక వైద్యాధికారులను తమిళనాడు ప్రభుత్వం నియమించింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ప్రయాణికులంతా క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని ముంబయి మేయర్‌ తెలిపారు.

ఆ విమానాలను ఆపండి : కేజ్రీవాల్‌

కొత్త వేరియంట్‌ ‘ఒమిక్రాన్‌’తో ప్రభావితమైన దేశాల నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించాలని దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌.. ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ‘‘అతి కష్టం మీద మన దేశం కరోనా నుంచి కోలుకుంది. కొత్త వేరియంట్‌ భారత్‌లోకి ప్రవేశించకుండా మనం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేయాలి’’ అని కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేశారు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని