Updated : 28 Jan 2022 05:42 IST

TS News: కొత్త మార్కెట్‌ విలువల పెంపు ఖరారు

కనీసం 25%... గరిష్ఠం 50%
నేడు, రేపు కమిటీల ఆమోదం  
1 నుంచి కొత్తవి అమల్లోకి
ఈనాడు - హైదరాబాద్‌

రాష్ట్రంలో వ్యవసాయ భూముల మార్కెట్‌ విలువలు 50 శాతం, ఖాళీ స్థలాలవి 35 శాతం, అపార్ట్‌మెంట్‌ల ఫ్లాట్ల విలువను 25-30 శాతం పెంచుతూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయించింది. ఆ శాఖ రాష్ట్ర కార్యాలయంలో గురువారం సుదీర్ఘ కసరత్తు తర్వాత ఈ ప్రతిపాదనలను జిల్లా రిజిస్ట్రార్‌లకు అందజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్లతో రిజిస్ట్రేషన్‌ శాఖ కమిషనర్‌ టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. శుక్ర,శనివారాల్లో ప్రతిపాదనలను ఆమోదించి పంపించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల్లో మార్కెట్‌ విలువల కమిటీకి అదనపు కలెక్టర్లు, గ్రామీణ ప్రాంతాల్లో ఆర్డీవోలు ఛైర్మన్లుగా వ్యవహరిస్తున్నారు. కమిటీలో సభ్యులుగా ఉండే అధికారులందరూ ఒకే చోట సమావేశమై ప్రక్రియ ముగించాలని సూచించారు. సవరించిన మార్కెట్‌ విలువలు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు ప్రభుత్వం కలెక్టర్లకు సమాచారం ఇచ్చింది.
* ప్రస్తుతం అమల్లో ఉన్న మార్కెట్‌ విలువలకు, ప్రతిపాదించిన విలువల మధ్య సరాసరి వ్యత్యాసం 35-40 శాతం ఉంది. ప్రభుత్వ మార్కెట్‌ విలువలకు రెండు మూడు రెట్ల అధికంగా రిజిస్ట్రేషన్‌లు జరుగుతున్న వాటిని అత్యధిక ప్రాధాన్య ప్రాంతాలుగా గుర్తించారు.

వాణిజ్య సముదాయాల్లో అన్ని ఫ్లోర్‌లకు ఒకే మార్కెట్‌ విలువను నిర్ణయించారు. స్థలాల విలువల సగటు 35 శాతం పెరిగింది. తక్కువ విలువ ఉన్న ప్రాంతాల్లో 50 శాతం కూడా హెచ్చింది. అపార్ట్‌మెంట్లలో చదరపు అడుగుకు 25-30 శాతం దాకా పెంచారు. వ్యవసాయ భూముల మార్కెట్‌ విలువ 50 శాతం పెరిగింది.

రాత్రి 10 గంటల వరకు రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు
ఒకటో తేదీ నుంచి ఆస్తుల మార్కెట్‌ విలువలు పెరగనున్న నేపథ్యంలో పాత ధరల్లో గురువారం రిజిస్ట్రేషన్లు భారీగా జరిగాయి. హైదరాబాద్‌ చుట్టుపక్కల సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలతో పాటు జిల్లా కేంద్రాల్లోనివి కిటకిటలాడాయి. సాధారణంగా రోజుకు 40-50 రిజిస్ట్రేషన్లు జరిగే చోట 120-150 దాకా చేశారు. సూర్యాపేట సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రోజూ 50- 60 రిజిస్ట్రేషన్లు జరిగేవి. గురువారం 200కుపైగా జరగ్గా రాత్రి పదిగంటలకు కూడా కార్యాలయం పని చేసింది. కొన్నిచోట్ల సర్వర్‌లు పనిచేయని కారణంగా ప్రక్రియ ఆలస్యమైంది. బాధితులు గంటల తరబడి కార్యాలయాల్లో వేచి చూడాల్సి వచ్చింది.


భూముల మార్కెట్‌ విలువల సవరణ వాయిదా వేయండి: క్రెడాయ్‌, ట్రెడా
- రిజిస్ట్రేషన్‌, నాలా ఛార్జీలు తగ్గించాలని సీఎంకు లేఖ  

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో భూముల మార్కెట్‌ విలువలను ఏడు నెలలు కాకముందే మరోసారి సవరించాలనే నిర్ణయాన్ని వాయిదా వేయాలని రియల్‌ ఎస్టేట్‌ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ఇటీవల పెరిగిన భూముల ధరలు, నాలా పన్నులు, రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు, ముడి సరకుల ధరలు, ఆర్థిక వ్యవస్థలో మార్పుల ప్రభావంపై అధ్యయనం చేసే వరకు కనీసం ఆరునెలలైనా సమయం ఇవ్వాలని కోరాయి. రిజిస్ట్రేషన్‌, నాలా ఛార్జీలు మునుపటి స్థాయికి తగ్గించాలని విన్నవించాయి. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు క్రెడాయ్‌ రాష్ట్ర అధ్యక్షుడు డి.మురళీకృష్ణారెడ్డి, ట్రెడా అధ్యక్షుడు ఆర్‌.చలపతిరావు, క్రెడాయ్‌ హైదరాబాద్‌ అధ్యక్షడు పి.రామకృష్ణారావు గురువారం లేఖ రాశారు. భూముల మార్కెట్‌ విలువల పెంపుదల ప్రణాళిక ప్రకారం చేయాలని, ఆకస్మికంగా ఏడాదిలోపే చేయడం సరైంది కాదని పేర్కొన్నారు. కొవిడ్‌ మూడోదశ ప్రభావంతో మార్కెట్‌ మందకొడిగా ఉందని, ఈ  సవరణ ప్రతిపాదన ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొన్నాయి. ఇటీవల స్టాంప్‌డ్యూటీ 37.5 శాతం, నాలా ఛార్జీలను 50 నుంచి 67 శాతం పెంచారని, అనుమతుల కోసం స్థానిక సంస్థలు వసూలు చేస్తున్న ఛార్జీలు.. ప్రభుత్వం విధించిన రుసుములను మించిపోతున్నాయని.. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని విన్నవించాయి. ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్‌ విలువ కంటే ఎక్కువ విలువకు రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటే స్టాంప్‌డ్యూటీలో 1 శాతం రాయితీ ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని కోరాయి.


 

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని