Updated : 29/11/2021 03:55 IST

Omicron: తస్మాత్‌ జాగ్రత్త

 మూడో దశను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధం

ఒమిక్రాన్‌ నేపథ్యంలో మంత్రి హరీశ్‌రావు సమీక్ష

వివరాలు వెల్లడించిన డీహెచ్‌ శ్రీనివాస్‌రావు

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా మూడో దశ ముప్పు తలెత్తితే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించింది. దేశంలో, రాష్ట్రంలో ఒమిక్రాన్‌ కేసు నమోదు కాలేదని స్పష్టం చేసింది. వ్యాక్సిన్‌ తీసుకున్న వారికి ముప్పు తగ్గుతుందని, ప్రాణాలు కాపాడుకునేందుకు అందరూ టీకాలు తీసుకోవాలని స్పష్టం చేసింది. రెండు డోసులు పూర్తిచేసుకున్న ఆరు నెలలకు బూస్టర్‌డోసు అవసరమని, దీనిపై కేంద్ర మార్గదర్శకాలు వచ్చేవరకు ప్రజలు వేచి ఉండాలని కోరింది. ప్రపంచదేశాలను వణికిస్తున్న ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రభావం, ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి హరీశ్‌రావు ఆదివారమిక్కడ వైద్యశాఖ ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఈ వివరాలను ప్రజారోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాస్‌రావు, వైద్యవిద్య సంచాలకులు రమేష్‌రెడ్డి వెల్లడించారు. ప్రజలు మాస్కు ధారణ, భౌతిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలన్నారు. ఒమిక్రాన్‌ ప్రభావంపై స్పష్టమైన అవగాహన రావడానికి మరో రెండు వారాల సమయం పడుతుందని.. క్రిస్మస్‌, కొత్త ఏడాది, సంక్రాంతి వేడుకల్లో ప్రతిఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

విమానాశ్రయాల్లో పరీక్షిస్తున్నాం

ఒమిక్రాన్‌ వేరియంట్‌ దక్షిణాఫ్రికా, బోట్స్‌వానా, హాంగ్‌కాంగ్‌లలో బయటపడింది. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై దృష్టిపెట్టాం. రెండు డోసుల టీకా తీసుకున్నవారిని ఇంటికి పంపించి, క్వారంటైన్‌ చేస్తున్నాం. టీకా తీసుకోని, పాక్షికంగా తీసుకున్నవారికి పరీక్షలు నిర్వహించి, పాజిటివ్‌ వస్తే ఆసుపత్రికి తరలించి, వైరస్‌ జీనోమ్‌ విశ్లేషణకు సీడీఎఫ్‌డీకి పంపిస్తున్నాం.

డెల్టాతో పోల్చితే 30 రెట్ల తీవ్రత!

కరోనా వైరస్‌లో ఇప్పటికే 3.5 లక్షల నుంచి 4 లక్షల మ్యుటేషన్లు జరిగాయి. కొన్ని బలహీనంగా ఉంటే.. మరికొన్ని బలంగా ఉంటాయి. డెల్టా కన్నా ఒమిక్రాన్‌ తీవ్రత 30 రెట్లు ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. దేశంలోకి ఈ వైరస్‌ చేరకుండా జాగ్రత్తపడుతూ తక్కువ నష్టంతో బయటపడాలి. లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలి.

పిల్లల్ని పాఠశాలలకు పంపించవచ్చు..

శీతాకాలంలో కరోనాతో పాటు ఇతర వైరస్‌లు విజృంభిస్తాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తల్లిదండ్రులు స్వీయ జాగ్రత్తలు తీసుకుంటూ పిల్లలను నిరభ్యంతరంగా పాఠశాలలకు పంపించవచ్చు. అక్కడక్కడ పిల్లలకు కరోనా సోకుతున్నా.. వ్యాధి తీవ్రం కావడం లేదు. కరోనా నిర్ధారణ అయిన పిల్లలను ఒంటరిగా ఉంచాలి’’ అని డాక్టర్‌ శ్రీనివాస్‌రావు సూచించారు.

విస్తృతంగా టీకా ప్రత్యేక డ్రైవ్‌లు

ఒమిక్రాన్‌ ముప్పుపై ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రంలో ఇంకా టీకాలు తీసుకోని 10 శాతం మందికి తొలి డోసు ఇచ్చేందుకు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. రెండో డోసు టీకా తీసుకోని వారి కోసం ప్రత్యేక డ్రైవ్‌లను విస్తృతం చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో మూడో ముప్పుని ఎదుర్కొనేందుకు 60,099 పడకలు సిద్ధం చేసిన ప్రభుత్వం అవసరమైన పరికరాలు, సౌకర్యాల కోసం రూ.424 కోట్లు వెచ్చించనుంది. ఇందులో 27,966 పడకలు ప్రభుత్వ వైద్యంలోనే ఉన్నాయి. ఇవన్నీ ఆక్సిజన్‌ పడకలే. పిల్లల కోసం ప్రత్యేకంగా పది వేల పడకలు సిద్ధం చేసి.. రూ.256 కోట్లు ఖర్చు చేస్తోంది. చిన్నారుల కోసం ప్రభుత్వంలోనే 2 వేల ఐసీయూ సహా 6 వేల ఆక్సిజన్‌ పడకలు అందుబాటులో ఉన్నాయి. మొత్తం 132 ఆక్సిజన్‌ ప్లాంట్లు సిద్ధమవుతున్నాయి. 


25 లక్షల మంది రెండో డోసుకు దూరం..

రాష్ట్రంలో కరోనా కేసుల్లో పెరుగుదల లేదు. రోజుకి 100-150 కేసులు వస్తున్నాయి. ఇప్పటివరకు అర్హుల్లో 90 శాతం మందికి ఒక డోసు టీకా అందింది. వీరిలో 45 శాతం మందికి రెండో డోసు ఇచ్చాం. తొలిడోసు టీకా పొందిన 25 లక్షల మంది నిర్ణీత గడువు దాటినా రెండో డోసు తీసుకోలేదు. వీరంతా టీకా వేయించుకోవాలి. అమెరికా, యూకే తదితర దేశాల్లో అసలు టీకా తీసుకోని, రెండో డోసు పూర్తికాని వారిలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోందని వెల్లడైంది.

- ప్రజారోగ్యశాఖ సంచాలకులు

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని