
TS News: ఖాళీలు, కొత్త పోస్టుల గుర్తింపుపై ఐఏఎస్‌ల కమిటీ
ఉద్యోగుల పనితీరు మెరుగుదల, పాలన సంస్కరణలపైనా దృష్టి
సీనియర్ ఐఏఎస్ అధికారి శేషాద్రి అధ్యక్షతన ఏర్పాటు
ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం నిర్ణయం.. సత్వర నివేదికకు ఆదేశాలు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీల సత్వర భర్తీ, కొత్త జిల్లాల్లో సజావుగా విధుల నిర్వహణకు అవసరమైన పోస్టుల గుర్తింపు తదితర అంశాల అధ్యయానికి నలుగురు ఐఏఎస్ అధికారులతో ఉన్నత స్థాయి పరిపాలనా సంస్కరణల కమిటీని ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించారు. ఉద్యోగుల పనితీరు మెరుగుపరచి ప్రభుత్వ కార్యక్రమాల అమలులో అన్ని స్థాయుల వారికీ భాగస్వామ్యం కల్పించటం వంటి అంశాలపైనా ఈ కమిటీ సూచనలు ఇవ్వనుంది. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు కొత్త జోనల్ విధానంలో భాగంగా జిల్లాలు, జోన్లు, బహుళజోన్లలో ఉద్యోగుల బదలాయింపు ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ శేషాద్రి అధ్యక్షత వహించే ఈ కమిటీలో సీఎం కార్యదర్శి స్మితాసబర్వాల్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్, స్త్రీశిశు సంక్షేమశాఖ కమిషనర్ దివ్యాదేవరాజన్ సభ్యులుగా ఉంటారు. ఉద్యోగాల భర్తీ వేగంగా చేపట్టాల్సి ఉన్నందున ఈ కమిటీ నివేదికను సత్వరమే అందజేయాలని సీఎం ఆదేశించారు. ఉద్యోగుల బదలాయింపుపై ఆదివారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ వెంకట్రాంరెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, బాలరాజు, సైదిరెడ్డి, ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీఎం ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జోనల్ విధానం అమలుపై కేసీఆర్‌కు సీఎస్ నివేదిక సమర్పించారు. 38,643 మంది ఉద్యోగులను ఉమ్మడి జిల్లాల్లో సర్దుబాటు చేయగా, 101 మంది మినహా 38,542 మంది ఉద్యోగులు తమకు నిర్దేశించిన స్థానాలలో చేరారని తెలిపారు. జోనల్, బహుళజోన్లలోనూ బదిలీలు, పోస్టింగులు పూర్తయ్యాయని వివరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. జోనల్ ప్రక్రియ పూర్తయినందున వెంటనే ఖాళీల భర్తీపై దృష్టి సారిస్తామని తెలిపారు. జిల్లాల్లో ఏర్పడ్డ ఖాళీలను వెంటనే భర్తీ చేసేలా నోటిఫికేషన్ జారీకి చర్యలు చేపట్టడం, జిల్లాల్లో సమీకృత ప్రభుత్వ కార్యాలయాల సముదాయాలు, పోలీసు భవనాల నిర్మాణం పూర్తవుతున్న నేపథ్యంలో జిల్లాల్లో వివిధ ప్రభుత్వ శాఖల పనితీరును, ఇంకా మెరుగుపరచడానికి తీసుకోవాల్సిన చర్యలను సమీక్షించి, నివేదిక అందించాలని ఆయన కమిటీకి సూచించారు.
అవసరాలు తీర్చేలా..
‘‘కొత్త జిల్లాల్లో, మండలాల్లో ఏయే శాఖలకు పని ఒత్తిడి ఎంత ఉందో అంచనా వేసి ఇంకా కొత్త పోస్టుల అవసరాన్ని గుర్తించడం, కొత్తగా సాంకేతికంగా తీసుకోవాల్సిన చర్యలు.. తదితర అంశాలపై ఈ కమిటీ అధ్యయనం చేయాలి. ఆర్డీవోలు, వీఆర్వోలు, వీఆర్‌ఏల సేవలను మరింత మెరుగ్గా ఎలా ఉపయోగించుకోవాలో సూచించాలి. వివిధ పథకాల అమలులో ఇంకా చక్కని పాలనా సంస్కరణలు తెచ్చి.. ప్రజలకు నిత్యం అవసరమైన విద్య, వైద్యం, పురపాలక, పంచాయతీరాజ్ శాఖల్లో సేవల విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పనకు ఉద్యోగుల సేవలను ఎలా ఉపయోగించుకోవాలనే అంశంపైనా సూచనలు చేయాలి’’ అని సీఎం ఆదేశించారు. ఇప్పటికే ఖాళీల గుర్తింపుపై విశ్రాంత ఐఏఎస్ శివశంకర్ అధ్యక్షతన ప్రభుత్వం అధ్యయనం చేసింది. ఆయన నివేదిక సమర్పించారు. తాజాగా జోనల్ విధానంలో ఉద్యోగుల సర్దుబాటు పూర్తయినందున ఖాళీలతో పాటు కొత్త పోస్టుల అవసరం కోసం నలుగురు ఐఏఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసిందని, శివశంకర్ సైతం దీనికి సహకరిస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.