Published : 18 Jan 2022 04:43 IST

TS News: అన్ని సర్కారు బడుల్లో ఆంగ్ల మాధ్యమం

వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు
ప్రైవేటు విద్యాసంస్థల్లో రుసుముల నియంత్రణకు చట్టం
విధివిధానాల రూపకల్పనకు మంత్రివర్గ ఉపసంఘం  
రూ.7,289 కోట్లతో ‘మన ఊరు - మన బడి’
రాష్ట్రంలో కొత్తగా మహిళా, అటవీ విశ్వవిద్యాలయాలు
రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయాలు
ఈనాడు - హైదరాబాద్‌

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన చేపట్టాలని మంత్రిమండలి నిర్ణయించింది. తెలంగాణ గురుకులాలు మంచి ఫలితాలను అందిస్తున్న నేపథ్యంలో, గ్రామస్థాయిల్లోంచి విద్యార్థులు గురుకులాల్లో చేరుతున్నారని అభిప్రాయపడింది. వ్యవసాయం తదితర అనుబంధ రంగాల బలోపేతంతో గ్రామీణ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయని..పల్లెల్లోని తల్లిదండ్రుల్లో తమ పిల్లల విద్య, భవిష్యత్తు పట్ల ఆలోచన పెరిగిందని.. దీంతో గ్రామాల్లో ఆంగ్లమాధ్యమంలో విద్యాబోధనకు డిమాండు పెరిగిందని చర్చించింది. సోమవారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల విద్య అనివార్యమని సమావేశం అభిప్రాయపడింది. అందుకోసం కావలసిన అన్ని రకాల మౌలిక వసతులను కల్పించాలని మంత్రిమండలి నిర్ణయించింది. కార్పొరేట్‌ విద్యకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలని విద్యాశాఖను ఆదేశించింది. తెలంగాణలో ప్రైవేటు పాఠశాలలు, జూనియర్‌, డిగ్రీ కళాశాలల్లో రుసుముల నియంత్రణకు చట్టాన్ని తెచ్చేందుకూ ఆమోదం తెలిపింది. ముసాయిదా చట్ట రూపకల్పన అనంతరం రానున్న శాసనసభా సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లులకు చట్టబద్ధత కల్పిస్తుంది. ఆంగ్లమాధ్యమ బోధన, రుసుముల నియంత్రణపై పూర్తి అధ్యయనం చేసి విధివిధానాలను రూపొందించేందుకు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌, కొప్పుల ఈశ్వర్‌, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, నిరంజన్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావులు సభ్యులుగా ఉంటారు.  ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి నాణ్యమైన విద్యాబోధన, మెరుగైన మౌలిక వసతుల కల్పన కోసం రూ.7,289 కోట్లతో ‘‘మన ఊరు - మన బడి’’ కార్యక్రమం చేపట్టేందుకు అనుమతించింది.  రాష్ట్రంలో కొత్తగా మహిళా, అటవీ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు మంత్రిమండలి అంగీకారం తెలిపింది. హైదరాబాద్‌ కోఠిలోని మహిళా కళాశాల స్థలంలో, సిద్దిపేట జిల్లా ములుగులో వీటి ఏర్పాటుకు ఉన్నత విద్యాశాఖ, అటవీ శాఖలు ప్రతిపాదనలు సమర్పించగా ఆమోదం తెలిపింది. వీటిపై వచ్చే మంత్రిమండలి సమావేశం నాటికి సమగ్ర నివేదికను రూపొందించి మంత్రిమండలికి సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఆదేశించింది.

ఇదీ మన ఊరు - మన బడి ప్రణాళిక

మూడు దశల్లో మూడు సంవత్సరాల వ్యవధిలో విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరచాలని సమావేశంలో మాట్లాడారు. మొదటి దశలో, మండలం కేంద్రాన్ని యూనిట్‌గా తీసుకొని అత్యధికంగా విద్యార్థులు నమోదైన 9,123 (ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత) ప్రభుత్వ మరియు స్థానిక సంస్థలకు చెందిన స్కూళ్లలో ముందుగా కార్యక్రమం అమలు చేయాలి. నీటి సౌకర్యంతో కూడిన సౌచాలయాలు, విద్యుదీకరణ, తాగునీటి సరఫరా.. ఫర్నిచర్‌, పాఠశాలకు రంగులు, మరమ్మతులు, చాక్‌బోర్డులు, ప్రహరీలు, వంటగది షెడ్లు, శిథిలమైన గదుల స్థానంలో కొత్తవి నిర్మించాలి. ఎంపిక చేసిన ప్రతి పాఠశాలలో చేపట్టే కార్యక్రమాలకు పరిపాలనా అనుమతిని జిల్లా కలెక్టర్లు ఇస్తారు. ఒక మండలంలో కార్యక్రమాన్ని అమలుచేసే ఏజెన్సీ ఒకటే ఉండే విధంగా అందుబాటులో ఉన్న ఏజెన్సీల నుంచి తమ జిల్లాలో అమలు చేసే ఏజెన్సీని ఎంచుకోవచ్చు. నిధుల సమీకరణ కోసం ఆర్థిక శాఖ నోడల్‌ ఏజెన్సీగా పనిచేస్తుంది. ప్రతి పాఠశాలలో పూర్వ విద్యార్థుల సంఘాలను ఏర్పాటు చేసి. దాతలు, సీఎస్‌ఆర్‌ నిధులు తదితర మార్గాల ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి.

అటవీ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు

సిద్దిపేట జిల్లా ములుగులోని అటవీ కళాశాల, పరిశోధన సంస్థ (ఎఫ్‌సీఆర్‌ఐ) బీఎస్సీ ఫారెస్ట్రీ (హానర్స్‌) నాలుగేళ్ల డిగ్రీ కోర్సు చదివిన విద్యార్థులకు అటవీ శాఖ ద్వారా ఉద్యోగాల భర్తీలో నేరుగా నియామక (డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌) కోటా కింద రిజర్వేషన్లు కల్పనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అసిస్టెంట్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌’ (ఏసీఎఫ్‌) విభాగంలోని ఉద్యోగాల్లో 25%, ‘ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌’ (ఎఫ్‌ఆర్‌వో) విభాగానికి చెందిన   ఉద్యోగాల్లో 50%, ‘‘ఫారెస్టర్స్‌’’ విభాగానికి చెందిన ఉద్యోగాల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర అటవీశాఖ సేవా నిబంధనలు-1997, స్టేట్‌ అటవీ సబార్డినేట్‌ నిబంధనలు-2000లో సవరణలు చేస్తారు.

కరోనాపై ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధం

కరోనా, కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ల దృష్ట్యా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం మంత్రిమండలి సమావేశంలో తెలిపారు. పురపాలక, పంచాయతీరాజ్‌ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ టీకాల కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలని వైద్యఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు, అధికారులను సీఎం ఆదేశించారు. ఇందుకోసం అన్ని జిల్లాల మంత్రులు, కలెక్టర్లు సమీక్ష సమావేశాలు నిర్వహించుకోవాలని, టీకాలపై ప్రజలను చైతన్యపరచాలన్నారు. కరోనాను కట్టడి చేసేందుకు ప్రజలు గుమిగూడకుండా పూర్తి స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు. ఈ సందర్భంగా వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు, రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై గణాంకాలతో సహా సమావేశంలో వివరించారు.

ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలి

అకాల వర్షాల వల్ల కొన్ని జిల్లాల్లో ధాన్యం ఇంకా అమ్మకానికి వస్తున్నందున...ప్రభుత్వ ఆధ్వర్యంలోని కొనుగోలు కేంద్రాలను కొనసాగించాలని, ధాన్యాన్ని పూర్తిగా కొనాలని అధికారులను సీఎం
ఆదేశించారు.


రాత్రిపూట కర్ఫ్యూ ఇప్పుడే వద్దు!

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో రాత్రిపూట కర్ఫ్యూ అవసరం లేదని వైద్యఆరోగ్య శాఖ సూచించిన నేపథ్యంలో మంత్రిమండలి దీనిపై వెనక్కు తగ్గినట్టు సమాచారం. మరిన్ని కేసులు పెరిగితేనే అమలు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. సోమవారం జరిగిన మంత్రి మండలి సమావేశంలో తొలుత ఈ అంశం చర్చకు వచ్చింది.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని