Updated : 03/10/2021 09:39 IST

Congress Jung Siren: ఉద్రిక్తంగా కాంగ్రెస్‌ జంగ్‌ సైరన్‌

రేవంత్‌రెడ్డి సహా ముఖ్య నేతల గృహ నిర్బంధం
వలయాలను ఛేదించుకుని ఎల్బీనగర్‌ చేరిన కార్యకర్తలు
లాఠీఛార్జిలో పలువురికి గాయాలు
నేడు రాష్ట్రవ్యాప్త నిరసనలకు పీసీసీ పిలుపు

ఈనాడు, హైదరాబాద్‌- న్యూస్‌టుడే, జూబ్లీహిల్స్‌, దిల్‌సుఖ్‌నగర్‌, వనస్థలిపురం, నాగోలు, గాంధీభవన్‌: ఎక్కడికక్కడ అరెస్టులు... ప్రధాన మార్గాల మూసివేత.. ముఖ్య నాయకుల గృహ నిర్బంధాల మధ్య కాంగ్రెస్‌ పార్టీ తలపెట్టిన విద్యార్థి, నిరుద్యోగ జంగ్‌ సైరన్‌ శనివారం నగరంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కాంగ్రెస్‌ పార్టీ అక్టోబరు 2 నుంచి డిసెంబరు 9 వరకు విద్యార్థి, నిరుద్యోగ జంగ్‌ సైరన్‌ తలపెట్టింది. తొలి కార్యక్రమంగా శనివారం దిల్‌సుఖ్‌నగర్‌ రాజీవ్‌చౌక్‌ నుంచి ఎల్బీనగర్‌ శ్రీకాంతాచారి చౌరస్తా వరకు ర్యాలీకి పీసీసీ పిలుపునిచ్చింది. దిల్‌సుఖ్‌నగర్‌ కూడలిలో భారీ బందోబస్తు కారణంగా.. ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ ఏర్పడింది. కొత్తపేటలో బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను సరూర్‌నగర్‌వైపు మళ్లించారు. కాంగ్రెస్‌ నాయకులు మెట్రో రైళ్లలో వచ్చే అవకాశం ఉందని భావించి మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 వరకు దిల్‌సుఖ్‌నగర్‌ మెట్రోస్టేషన్‌ను పూర్తిగా మూసివేశారు. అయినప్పటికీ కొందరు విద్యార్థి నాయకులు, కాంగ్రెస్‌ కార్యకర్తలు దిల్‌సుఖ్‌నగర్‌ రాజీవ్‌చౌక్‌కు చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయగా ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు వారిని అరెస్టు చేశారు. పోలీసుల నిర్బంధాలు, అరెస్టులు, బారికేడ్లను దాటుకుని సాయంత్రానికి భారీసంఖ్యలో కాంగ్రెస్‌, యూత్‌కాంగ్రెస్‌, ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు, నాయకులు ఎల్బీనగర్‌ చౌరస్తాకు చేరుకున్నారు. శ్రీకాంతాచారి విగ్రహానికి పూలదండ వేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. భారీగా వచ్చిన కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. లాఠీఛార్జిలో పలువురికి గాయాలయ్యాయి. మల్లు రవి కిందపడ్డారు. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు, హుజూరాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి బల్మూరి వెంకట్‌ సహా పలువురు గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

రేవంత్‌ ఇంటి వద్దా తోపులాట
గాంధీభవన్‌లో మహాత్మాగాంధీకి నివాళులర్పించి జూబ్లీహిల్స్‌లోని ఇంటికి చేరుకున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. జంగ్‌ సైరన్‌ కార్యక్రమానికి వెళ్లకుండా అడ్డుకున్నారు. సమాచారం తెలుసుకుని భారీ సంఖ్యలో కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆయన నివాసానికి చేరుకున్నారు. పోలీసులు, కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. ఇంటి వద్దనే బైఠాయించి రేవంత్‌ నిరసన తెలిపారు. ఆయనకు మాజీ మంత్రి షబ్బీర్‌అలీ వచ్చి మద్దతు పలికారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి తదితరులనూ గృహ నిర్బంధం చేశారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా అంబేడ్కర్‌, గాంధీ విగ్రహాల ఎదుట కేసీఆర్‌, కేటీఆర్‌ దిష్టి బొమ్మల దహనానికి కాంగ్రెస్‌ పార్టీ పిలుపునిచ్చింది.


రాష్ట్రంలో దుర్మార్గ పాలన: రేవంత్‌రెడ్డి

రాష్ట్రంలో దుర్మార్గ పాలన సాగుతోందని రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. గృహనిర్బంధం సందర్భంగా ఇంటి వద్ద మీడియాతో మాట్లాడారు. ఏడేళ్లుగా ఏడాదికి పదివేల ఉద్యోగాలు ఖాళీ అవుతున్నా ఎందుకు భర్తీ చేయడం లేదో.. ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ ఎందుకు ఇవ్వడం లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. శ్రీకాంతాచారి త్యాగ పునాదులపై ఏర్పడ్డ తెలంగాణలో నివాళులర్పిద్దామంటే నిరంకుశంగా అడ్డుకున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ కార్యకర్తలపై జరిగిన దాడిని నాలుగు కోట్ల రాష్ట్ర ప్రజలపై జరిగిన దాడిగా వర్ణించారు. తెలంగాణ సమాజాన్ని కేసీఆర్‌, కేటీఆర్‌లు శత్రువులు, తీవ్రవాదులుగా భావిస్తున్నారని ఆరోపించారు. తమ తొలి అడుగును అడ్డుకున్నప్పటికీ.. మలి అడుగు పాలమూరులో వేయబోతున్నామని చెప్పారు. ఆ రోజు అడ్డుకోవాలని చూస్తే తమ తడాఖా చూపిస్తామన్నారు. గాంధీజీ స్ఫూర్తితోనే శనివారం మౌనంగా ఉన్నామన్నారు.

* పోలీసుల తీరును నిరసిస్తూ ఎల్బీనగర్‌ వద్ద మహబూబాబాద్‌ జిల్లా నెల్లికుదురు మండలం మాచిరాజుపల్లికి చెందిన విద్యార్థి దిల్లీ కల్యాణ్‌ అనే కార్యకర్త పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. కార్యకర్తలు అడ్డుకుని ఆసుపత్రికి తరలించారు. సరూర్‌నగర్‌ స్టేడియం వద్ద సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మను నాయకులు దహనం చేశారు. కార్యక్రమాల్లో నేతలు మధుయాస్కీ, సంపత్‌, దాసోజు, మహేశ్‌కుమార్‌గౌడ్‌, మహేశ్వర్‌రెడ్డి, బి.వి.శ్రీనివాస్‌, శివసేనారెడ్డి, రితీష్‌ తదితరులు పాల్గొన్నారు.


Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని