Huzurabad By Election: నేడే హుజూరా‘వార్‌’

హుజూరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు పోలింగ్‌ ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం ఉదయం ఏడు నుంచి రాత్రి ఏడు గంటల వరకు ఓటింగ్‌లో

Updated : 30 Oct 2021 05:18 IST

ఉప ఎన్నికకు సర్వం సిద్ధం

రాత్రి ఏడింటి వరకు పోలింగ్‌

ఈనాడు, హైదరాబాద్‌- ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌: హుజూరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు పోలింగ్‌ ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం ఉదయం ఏడు నుంచి రాత్రి ఏడు గంటల వరకు ఓటింగ్‌లో పాల్గొనవచ్చు. చివరి గంటను కొవిడ్‌తో బాధపడుతున్న వారు పీపీఈ కిట్లతో వచ్చి ఓటు వేసేందుకు కేటాయించారు. ‘‘2018లో 84.5 శాతం పోలింగ్‌ నమోదైంది. ఈ సారి మరింత పెంచేలా ఓటర్లు స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి’’ అని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి డాక్టర్‌ శశాంక్‌ గోయల్‌ కోరారు. శుక్రవారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు.

‘‘అన్ని కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ చేస్తున్నాం. ఓటర్లు విధిగా మాస్క్‌ ధరించి ఓటేయడానికి వెళ్లాలి. వివిధ అంశాలపై వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి అధికారులు పరిశీలిస్తున్నారు. కొన్నింటిపై కేసులు కూడా నమోదు చేశారు. రూ.మూడున్నర కోట్ల వరకు నగదును స్వాధీనం చేసుకున్నారు’’ అని ఆయన వివరించారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో రెండు ఈవీఎంలను ఏర్పాటు చేస్తున్నారు. మొదటి దానిలో 16 మంది, రెండో దానిలో 14 మంది అభ్యర్థులతోపాటు చివరన నోటా గుర్తు ఉంటుంది. నవంబరు 2న కరీంనగర్‌లో ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు.

మూడో ఉప ఎన్నిక ఇది..

హుజూరాబాద్‌ ఉప ఎన్నికపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ మంత్రి వర్గం నుంచి బర్తరఫ్‌ అయింది మొదలు ఇప్పటివరకు హుజూరాబాద్‌ నియోజకవర్గం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 30న ఈటలపై ఎసైన్డ్‌ భూములు ఆక్రమించారనే ఆరోపణలు తెరపైకొచ్చాయి. మే 2న మంత్రి వర్గం నుంచి బర్తరఫ్‌ అయ్యారు. జూన్‌ 12న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 14న భాజపాలో చేరారు. తెరాస కూడా ఎన్నికను సవాలుగా తీసుకుంది. ఆగస్టు 11న గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. కాంగ్రెస్‌ పార్టీ.. యువనేత బల్మూరి వెంకట్‌ను బరిలోకి దించుతున్నట్లు ప్రకటించింది. వరుసగా ఆరుసార్లు గెలిచిన ఈటల ఏడోసారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. నియోజకవర్గంలో మూడోసారి జరుగుతున్న ఉప ఎన్నిక ఇది. తెలంగాణ ఉద్యమ సమయంలో 2008, 2010లో ఉప ఎన్నిక నిర్వహించగా.. ఇప్పుడు మరోసారి జరుగుతోంది.



 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని