KCR: ఉద్యమ స్ఫూర్తితో దళితబంధు

ఉద్యమ స్ఫూర్తితో దళితబంధును అమలు చేయనున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. వచ్చే బడ్జెట్‌లో దీనికి రూ.20 వేల కోట్లను కేటాయించనున్నట్లు తెలిపారు. పార్టీలు, రాజకీయాలకు అతీతంగా పథకం అమలవుతుందన్నారు. ఇలాంటి పథకం ప్రపంచంలోనే ఎక్కడా అమలు కావడంలేదన్నారు.

Updated : 24 Sep 2022 15:15 IST

వచ్చే బడ్జెట్‌లో రూ.20 వేల కోట్లు
మార్చినాటికి ప్రతి నియోజకవర్గంలో వంద కుటుంబాలకు ప్రయోజనం
బీసీ కుల గణనపై తీర్మానం
ఎస్సీ రిజర్వేషన్లనూ పెంచాలి
మళ్లీ మేమే గెలుస్తాం
కొత్తగా 80 వేల ఉద్యోగాలు
శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: ఉద్యమ స్ఫూర్తితో దళితబంధును అమలు చేయనున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. వచ్చే బడ్జెట్‌లో దీనికి రూ.20 వేల కోట్లను కేటాయించనున్నట్లు తెలిపారు. పార్టీలు, రాజకీయాలకు అతీతంగా పథకం అమలవుతుందన్నారు. ఇలాంటి పథకం ప్రపంచంలోనే ఎక్కడా అమలు కావడంలేదన్నారు. దీని ద్వారా లబ్ధిపొందే కుటుంబాలకు ప్రస్తుతం అందుతున్న సంక్షేమ పథకాలు, ప్రయోజనాలు అన్నీ యథావిధిగా అమలవుతాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.  దేశంలో బీసీ కుల గణన చేయాలని కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర శాసనసభ తీర్మానం చేసి పంపుతుందని ప్రకటించారు. దళితుల జనాభా పెరిగిన నేపథ్యంలో వారికి రిజర్వేషన్లను పెంచాలని అన్నారు. దళితబంధు పథకం నాలుగు దశల్లో అమలు కానుండగా రూ.1.8 లక్షల కోట్లను వ్యయం చేయనున్నటు వివరించారు. ప్రతి జిల్లాలో నాలుగువేల కోట్ల రూపాయలతో కలెక్టర్ల వద్ద దళిత రక్షణనిధి ఏర్పాటు చేస్తామన్నారు. మొదటి దశలో హుజూరాబాద్‌ నియోజకవర్గంతో పాటు ఎంపిక చేసిన 4 మండలాల్లో వందశాతం దళిత కుటుంబాలకు  పథకం అమలవుతుందన్నారు. వచ్చే ఏడాది మార్చిలోపు ప్రతి నియోజకవర్గంలో 100 కుటుంబాలకు ప్రయోజనం అందుతుందన్నారు. ఆ వందమందిని ఎంపికచేసే బాధ్యతను ఎమ్మెల్యేలు తీసుకోవాలన్నారు. శాసనసభలో మంగళవారం దళితబంధుపై జరిగిన చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. ‘‘హుజూరాబాద్‌ ఎన్నిక కోసం ఈ పథకం రాలేదు. 1986 నుంచీ దళిత అభ్యున్నతిపై దృష్టి సారించా. గత ఏడాదే అమలుకావాల్సి ఉండగా కరోనాతో వాయిదా పడింది. దళితుల అభ్యున్నతికి అమలు చేస్తున్న ఈపథకం రాష్ట్ర ఆర్థిక పురోగతికి తోడ్పడుతుంది. అన్ని ఎస్సీ కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుంది.

భవిష్యత్తులో కేంద్రంలో తెరాస కీలకం కావచ్చు

అధికారం కోసం కొందరు కలలు కంటున్నారు. కానీ వచ్చేసారి కూడా మేమే గెలుస్తాం. మేలు చేసే వాళ్లను ప్రజలు ఎప్పుడూ గుర్తుంచుకుంటారు. మేమేమి మఠం నడపడంలేదు. భవిష్యత్తులో కేంద్రంలో తెరాస కీలకం కావచ్చు. ప్రతి అంశాన్నీ ఓట్ల కోణంలో చూడటం సరికాదు. హుజూరాబాద్‌ ఎన్నిక తర్వాత దళితబంధు ఖాతాల్లోని డబ్బును వెనక్కి తీసుకుంటారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ ధనిక రాష్ట్రమే. రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకెళ్తోంది. ఏడాదిలో రూ.10 లక్షల కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. వచ్చే ఏడేళ్లలో రూ.23 లక్షల కోట్లను ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. ఇందులో దళితబంధు కోసం రూ.1.80 లక్షల కోట్లు ఖర్చు చేస్తాం. 11.5 శాతం వృద్ధిరేటు నమోదైంది. దేశ జీడీపీకి అత్యధికంగా దోహదపడుతున్న 4 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ఇవన్నీ కాగ్‌, ఆర్‌బీఐ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యం

రాష్ట్రం ఏర్పడితే అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి సాధ్యమని పోరాడి తెలంగాణ సాధించుకున్నాం. రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా అనేక కుట్రలు జరిగాయి. రెండు రాష్ట్రాలు కలసిపోతాయని కూడా ప్రచారం చేశారు. తెలంగాణకు చెందిన ఏడు మండలాలను, సీలేరు ప్రాజెక్టును తీసేసుకున్నారు. గిరిజనులు, బీసీలు,మైనార్టీలు, అగ్రవర్ణాల్లోని పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. వ్యవసాయరంగం స్థిరీకరణకు రైతుబంధును అన్ని వర్గాలకు అమలు చేశాం. రాష్ట్రంలో మూడు కోట్ల టన్నుల వరిధాన్యం పండుతుండటమే దీనికి నిదర్శనం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి అన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకొని కార్యక్రమాలు అమలు చేస్తున్నాం.

17.53 శాతం మంది దళితులు

రాష్ట్రంలో దళితులు 15 శాతం మాత్రమే అనేది సరికాదు. జనాభాలో 17.53 శాతం ఉన్నారు. అత్యధికంగా మంచిర్యాల జిల్లాలో 25.46 శాతం ఉండగా తక్కువగా హైదరాబాద్‌ జిల్లాలో 11.77శాతం మంది ఉన్నారు. అనేక జిల్లాల్లో 20 శాతానికిపైగా ఉన్నారు. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్రంలో 1,03,93,967 కోట్ల కుటుంబాలు ఉండగా ఇందులో 18,22,291 దళిత కుటుంబాలున్నాయి. ఆరేడేళ్లలో ఈ కుటుంబాల సంఖ్య పెరిగి ఉంటుంది.

భాజపా ఎస్సీ వర్గీకరణ చేయిస్తే స్వాగతిస్తాం

ఎస్సీ వర్గీకరణపై శాసనసభ తీర్మానం చేసి కేంద్రానికి పంపడమే కాకుండా 25 ఉత్తరాలు రాశాం. ప్రధానికి స్వయంగా వివరించాం. భాజపా సభ్యులు వర్గీకరణను చేయిస్తే ఎయిర్‌పోర్టుకు వెళ్లి వారికి స్వాగతం చెబుతాం. బీసీ కులగణనను కేంద్రం ఎందుకు నిరాకరిస్తోంది? కేంద్ర ప్రభుత్వం తోడ్పాటును ఇస్తే దళితబంధు మరింత బాగా అమలు చేయవచ్చు’’ అని కేసీఆర్‌ అన్నారు.

ఒక్కొక్కరిదీ ఒక్కో సెంటిమెంట్‌

ఒక్కొక్కరికీ ఒక్కో సెంటిమెంట్‌ ఉంటుందని పార్టీలనుద్దేశించి వికారాబాద్‌ ఎమ్మెల్యే (తెరాస) మెతుకు ఆనంద్‌ వ్యాఖ్యానించారు. ‘దళిత బంధు’ హుజూరాబాద్‌ ఎన్నికల కోసమేనని, లేకుంటే అక్కడే ఎందుకు అమలు చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని.., ఒకరికి భాగ్యలక్ష్మి ఆలయం, మరొకరికి చేవెళ్ల అయితే.. కేసీఆర్‌కు కరీంనగర్‌ జిల్లా సెంటిమెంట్‌ అని పేర్కొన్నారు. మీరుపెట్టే సభలు, సమావేశాలు, ప్రజాసంగ్రామ యాత్రలు కూడా ఓట్ల కోసమేనా? అని వ్యాఖ్యానించారు.  

ఎన్నికల కోసం కాదని నిరూపితమైంది

ఏ ఎన్నికలున్నాయని కేసీఆర్‌ కల్యాణలక్ష్మి పథకాన్ని తెచ్చారు? పథకాలు ఎన్నికల కోసం కాదని ఎప్పుడో రుజువైందని తుంగతుర్తి ఎమ్మెల్యే(తెరాస) గాదరి కిశోర్‌కుమార్‌ చెప్పారు. పేదముస్లింలకు ఇలాంటి పథకాన్ని అమలు చేయాలని ఎంఐఎం ఎమ్మెల్యే బలాల కోరారు.


ఇప్పటికే 1.51 లక్షల  ఉద్యోగాల భర్తీకి చర్యలు

జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ, నూతన జిల్లాల ఏర్పాటు, కొత్త జోనల్‌ విధానంతో ఉద్యోగావకాశాలు పెరిగాయి. తాజా జోనల్‌ విధానంతో 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కుతాయి. త్వరలోనే ఉద్యోగ సంఘాలతో చర్చించి ఈ విధానంలో ఉద్యోగులను కేటాయిస్తాం. అనంతరం ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటాం. కొత్తగా 70 వేల నుంచి 80 వేల ఉద్యోగాలకు అవకాశం ఉంటుంది. ఇప్పటికే రాష్ట్రంలో 1.51 లక్షల ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోగా 1.31 లక్షల మంది ఉద్యోగాల్లో చేరారు.


వచ్చిన పని... నచ్చిన చోట

ఏడాది బడ్జెట్‌లో దళిత సాధికారతకు రూ.1,000 కోట్లను కేటాయించాం. సుమారు రూ.2,500 కోట్లను వ్యయం చేస్తాం. దళితబంధుకు రూ.10 లక్షల మొత్తాన్ని శాస్త్రీయంగా నిర్ణయించాం. వందశాతం గ్రాంట్‌ రూపంలో ఇస్తున్నాం. యూనిట్లను ఏర్పాటు చేసుకునేందుకు ఎలాంటి ఆంక్షలూ లేవు. లబ్ధిదారుల ఇష్టమే. ఈ పథకం కింద వచ్చిన పని నచ్చిన చోట చేసుకోవచ్చు. ఎస్సీ ఉప ప్రణాళికకు చట్టబద్ధత ఉంది. పథకాలకు ప్రత్యేకంగా అవసరంలేదు. దళితబంధు పొందని కుటుంబాలకు దళిత రక్షణ నిధి ద్వారా తోడ్పాటును అందించడంపై దృష్టిసారిస్తాం. ప్రభుత్వం లైసెన్స్‌లు ఇచ్చే అన్నింటిలో ఎస్సీలకు రిజర్వేషన్లు కల్పిస్తాం. ఇందులో భాగంగానే వారికి 250 నుంచి 300 మద్యం దుకాణాలు దక్కనున్నాయి. రాష్ట్రంలో 75 లక్షల మంది దళితులు ఉంటే వారి చేతిలో 13 లక్షల ఎకరాలే ఉంది. గిరిజనులకంటే తక్కువ భూమి ఎస్సీలకు ఉంది. దళితులకు మూడెకరాలు ఇస్తామని చెప్పలేదు. అయినా 16 వేల ఎకరాలను ఇచ్చాం. వైద్య ఆరోగ్యశాఖలో ఎస్సీ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించేలా చర్యలు తీసుకుంటాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని