Kishan Reddy: సాధారణ బియ్యం కొంటాం

హుజూరాబాద్‌ ఉపఎన్నిక ఫలితాల తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ భాజపా, కేంద్ర ప్రభుత్వంపైన అనవసర విమర్శలు చేస్తున్నారు. నాలుక చీరేస్తామంటూ భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్‌

Updated : 09 Aug 2022 12:00 IST

ఉప్పుడు బియ్యం కొనలేం

పంజాబ్‌ తర్వాత ఎక్కువ కొనేది తెలంగాణ నుంచే

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

హుజూరాబాద్‌ ఉపఎన్నిక ఫలితాల తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ భాజపా, కేంద్ర ప్రభుత్వంపైన అనవసర విమర్శలు చేస్తున్నారు. నాలుక చీరేస్తామంటూ భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్‌ బెదిరింపులకు, తాటాకు చప్పుళ్లకు భాజపా, కేంద్ర ప్రభుత్వం భయపడవు. గొంతు పెంచినంత మాత్రాన సమస్యలు సమసిపోవు.

- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

ఈనాడు, దిల్లీ: సాధారణ బియ్యాన్ని (రా రైస్‌) దశలవారీగా కొనుగోలు చేస్తామని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఉప్పుడు బియ్యం కొనలేమని స్పష్టంచేశారు. ధాన్యం, బియ్యం విషయంలో ముఖ్యమంత్రి రైతులను పక్కదారి పట్టిస్తున్నారన్నారు. పంజాబ్‌ తర్వాత తెలంగాణ నుంచే కేంద్రం ఎక్కువగా బియ్యం కొంటోందన్నారు. ఉప్పుడు బియ్యాన్ని రాష్ట్రంలో తినరని, కేరళలోనూ వాడకం తగ్గినందున ఆ బియ్యాన్ని కొనలేమని గతంలోనే కేంద్రం స్పష్టం చేసిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 2014లో తెలంగాణ నుంచి 43 లక్షల మెట్రిక్‌ టన్నుల (ఎల్‌ఎంటీ) బియ్యం సేకరిస్తే 2020-21లో 94 ఎల్‌ఎంటీలకు పెరిగిందని చెప్పారు. దిల్లీలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వివరాలు..‘‘తెలంగాణ నుంచి ధాన్యం సేకరణకు 2014లో రూ.3,404 కోట్లు వెచ్చించగా 2020-21 నాటికి అది రూ.26,641 కోట్లకు పెరిగింది. సంచులు, సుత్లీ, హమాలీ ఖర్చులకూ కేంద్రమే నిధులిస్తోంది. రైస్‌మిల్లుల్లో టెక్నాలజీ మార్చుకొని రా రైస్‌ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాం. 2020-21లో 24.75 ఎల్‌ఎంటీ దొడ్డు బియ్యం సేకరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నా.. రాష్ట్ర ప్రభుత్వం అదనంగా మరో 20 ఎల్‌ఎంటీ కొనాలని కోరితే ఆ మొత్తాన్నీ సేకరించాం. భవిష్యత్తులో ఎఫ్‌సీఐకి దొడ్డు బియ్యం పంపబోమని రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. దిల్లీలో ఆగస్టు 17న జరిగిన కేంద్ర, రాష్ట్రాల పౌరసరఫరాల శాఖ కార్యదర్శుల సమావేశంలో తెలంగాణ నుంచి 40 ఎల్‌ఎంటీ బియ్యం సేకరించాలని ఒప్పందం జరిగింది. 108 ఎల్‌ఎంటీ కొనాలని రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయగా 90 ఎల్‌ఎంటీ సేకరించాలని ముఖ్యమంత్రి మరో లేఖ రాశారు. (ఆ లేఖలను చూపారు) ఎంత విస్తీర్ణంలో పంట వేశారు.. ఎంత ఉత్పత్తి వస్తుందనే అంశాలపై రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టత లేదు. 

* కరోనా తగ్గుముఖం పట్టి జీఎస్టీ రాబడిలో స్థిరత్వం ఏర్పడటంతో పెట్రో ఉత్పత్తులపై ధరలు తగ్గించాం. గతంలో సెస్‌ ద్వారా వచ్చిన ఆదాయంతో దేశంలో 80 కోట్ల మందికి ఏడాదిన్నర పాటు ఉచితంగా బియ్యం, పప్పులు అందజేశాం. కరోనావ్యాక్సిన్‌ను ఉచితంగా ఇచ్చాం. పెట్రో ధరలతో దోచుకుంటున్నారని కేసీఆర్‌ మాట్లాడటం తగదు. కేంద్రం ఒక్క రూపాయీ అవినీతి చేయడం లేదు.

* రాష్ట్రంలో వైద్య కళాశాలల ఏర్పాటుకు సంబంధించి లేఖరాస్తే సమాధానం రాలేదు. రాష్ట్రంలో సచివాలయం లేదు.. ఏ విభాగం ఎక్కడుందో తెలియదు... కేంద్రం పంపించిన లేఖను ముఖ్యమంత్రి చూశారో లేదో తెలియదు. వైద్య కళాశాలలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 శాతం వ్యయం చేయాల్సి ఉంటుంది. అందుకే కేసీఆర్‌ మాట్లాడలేదేమో. ఎయిమ్స్‌కు ఇప్పటికీ స్థలం అప్పగించలేదు. అంటువ్యాధుల పరిశోధన కేంద్రానికి మూడెకరాలు ఇమ్మంటే స్పందన లేదు. 8 ఆపరేషన్‌ థియేటర్ల సామర్థ్యంతో ఆదిలాబాద్‌, వరంగల్‌లలో ఆసుపత్రులు నిర్మిస్తే వాటిని ప్రారంభించలేదు. కరోనా కాలంలో పంపిన వెంటిలేటర్లను తెరవలేదు. కరోనా మరణాలు తక్కువచేసి చూపినా వివాదాలు వద్దని చూసీచూడనట్లు పోయాం.

* హుజూరాబాద్‌లో ఇంటింటికీ రూ.లక్షలు పంపిణీ చేసినా, దళితబంధు పేరుతో రూ.పది లక్షలు ఇచ్చినా ఓడిపోవడంతో ముఖ్యమంత్రి బెంబేలెత్తిపోతున్నారు. కుమారుడు ముఖ్యమంత్రి కాలేడనే ఆవేదన, ఆక్రోశంతో అలా మాట్లాడుతున్నారు. ఆయనకు సానుభూతి వ్యక్తం చేయడం తప్ప ఏం చేయలేం. సైనికులను, వారి త్యాగాలను అవమానించేలా కేసీఆర్‌ మాట్లాడుతున్నారు.భాష విషయంలో ఇతరులను విమర్శించే అర్హత కేసీఆర్‌కు, ఆయన కుటుంబసభ్యులకు లేదు’’ అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.


పెట్రో ఉత్పత్తులపై ధరలు పెరిగినప్పుడల్లా వ్యాట్‌ పెరిగి రాష్ట్రాలకు ఆదాయం వచ్చింది. పెట్రోలుపై వ్యాట్‌ పెంచలేదని ముఖ్యమంత్రి అంటున్నారు. 2015లో వ్యాట్‌ పెంచిన విషయాన్ని ఆయన మర్చిపోయారా?


కేంద్రంలో రాష్ట్రం నుంచి ఓ మంత్రి ఉన్నారనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించలేదు. ఈ అంశంపై త్వరలో ప్రత్యేకంగా మాట్లాడతా.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని