Updated : 31/10/2021 09:49 IST

PM Modi: భారత్‌కు రండి

పోప్‌ ఫ్రాన్సిస్‌కు ప్రధాని మోదీ ఆత్మీయ ఆహ్వానం
వాటికన్‌ సిటీలో గంటసేపు ఇరువురి భేటీ

వాటికన్‌ సిటీలో శనివారం పోప్‌ ఫ్రాన్సిస్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

వాటికన్‌ సిటీ, రోమ్‌: రోమన్‌ కేథలిక్‌ చర్చి అధిపతి, క్రైస్తవ మత ప్రధాన గురువు పోప్‌ ఫ్రాన్సిస్‌ను.. త్వరలో భారతదేశ సందర్శనకు రావాల్సిందిగా ప్రధాని మోదీ ఆహ్వానించారు. జి-20 శిఖరాగ్ర సదస్సు కోసం ఇటలీ వచ్చిన ఆయన శనివారం వాటికన్‌ సిటీలో పోప్‌తో భేటీ అయ్యారు. ప్రపంచ దేశాలపై కొవిడ్‌-19 ప్రభావం, వాతావరణ మార్పులతో ఎదురవుతున్న సవాళ్లు సహా అనేక అంశాలపై చర్చించారు. 2013లో ఫ్రాన్సిస్‌ పోప్‌ అయిన తర్వాత భారత ప్రధాని ఆయనతో భేటీ కావడం ఇదే తొలిసారి. గత 2 దశాబ్దాల్లో భారతదేశ ప్రధానులెవరూ పోప్‌ను కలవలేదని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. 2000 సంవత్సరంలో అప్పటి ప్రధాని హోదాలో ఎ.బి.వాజ్‌పేయీ ఆనాటి పోప్‌.. జాన్‌పాల్‌-2ను కలిశారని పేర్కొంది.

అత్యంత సుహృద్భావ వాతావరణంలో..
పోప్‌ను ఆత్మీయంగా హత్తుకున్న చిత్రాలను మోదీ ట్విటర్లో పంచుకున్నారు. ఇది అత్యంత సుహృద్భావ భేటీ అని, వివిధ అంశాలను ఆయనతో చర్చించే అవకాశం లభించిందని ప్రధాని తెలిపారు. వంద కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు వేయడంలో భారత్‌ సాధించిన విజయాన్ని, వాతావరణ మార్పులకు కళ్లెం వేసేందుకు తీసుకున్న చొరవను మోదీ ఆయనకు వివరించారు. వాతావరణ మార్పులపై తీసుకువచ్చిన విశేష పుస్తకాన్ని, వెండితో ప్రత్యేకంగా రూపొందించిన జ్ఞాపికను పోప్‌ ఫ్రాన్సిస్‌కు బహుమతిగా మోదీ ఇచ్చారు. ‘ఎడారి ఒక పూదోటగా మారుతుంది’ అనే అర్థం వచ్చే సందేశం ఉన్న కాంస్య ఫలకాన్ని మోదీకి కానుకగా పోప్‌ ఇచ్చారు. ముందు నిర్ణయించిన ప్రకారం 20 నిమిషాల పాటు పోప్‌తో సమావేశం జరగాల్సి ఉన్నప్పటికీ.. గంటకు పైగా భేటీ కొనసాగడం విశేషం. భారత్‌కు వచ్చేందుకు పోప్‌ ఆనందంగా అంగీకరించినట్లు అధికారిక ప్రకటన తెలిపింది.

 

ఇటలీ రాజధాని రోమ్‌లో శనివారం జీ-20 సదస్సు వేదిక వద్ద అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ముచ్చటిస్తున్న ప్రధాని మోదీ

ప్రవాస భారతీయులతో మాటామంతీ
ఇటలీ పర్యటనలో ఉన్న మోదీ.. ప్రవాస భారతీయుల బృందాన్ని కలిశారు. ‘దేశంతో ఎనలేని బంధాన్ని ఏర్పరచుకున్న ప్రవాసులతో సంభాషణలు గొప్పగా జరిగాయి. వివిధ అంశాలపై వారి ఆలోచనలు వినడం అద్భుతంగా అనిపించింది’ అని పేర్కొన్నారు. ఈ భేటీపై ‘సనాతన్‌ ధర్మ సంఘం’ అధ్యక్షురాలు స్వామిని హంసనంద గిరి స్పందించారు. ‘ఇటలీలో హిందువుగా జీవించడం మైనారిటీలకు కష్టం. ఇలాంటి చోట మోదీని కలవడం చాలా గౌరవంగా ఉంది’ అని తెలిపారు. తమలో ప్రతిఒక్కరి గురించి ఆయన అడిగి తెలుసుకున్నారని, తమిళనాడు తనకు ఇష్టమని చెబితే తమిళంలో కొద్దిసేపు మాట్లాడారని ఆమె సంబరపడ్డారు. మరోవైపు.. త్వరలో రాబోతున్న దీపావళి సందర్భంగా హిందువులందరికీ వాటికన్‌ సిటీ శుభాకాంక్షలు తెలిపింది. మతాల మధ్య సామరస్య పూరిత వాతావరణం.. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.

పలువురు దేశాధినేతలతో మంతనాలు
జీ-20 సదస్సుకు హాజరైన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయెల్‌ మెక్రాన్‌లతో మోదీ విడిగా ముచ్చటించారు. వారితో కాసేపు ఆహ్లాదంగా గడిపారు. పరస్పర ప్రయోజనకరమైన అంశాలతో పాటు ప్రపంచ విషయాలపై ఫలప్రదంగా చర్చలు జరిగినట్లు పీఎంవో కార్యాలయం ట్వీట్‌ చేసింది. బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌, కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో, సింగపూర్‌ ప్రధాని లీ సీన్‌ లూంగ్‌, జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ జే-ఇన్‌, ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియా గుటెరస్‌లతో కూడా మోదీ ముచ్చటించారు. ఆదివారం ఆయన గ్లాస్గోలో కాప్‌-26 సదస్సులో పాల్గొంటారు.

చరిత్రలో నిలిచిపోతుంది: నడ్డా
దిల్లీ: భారత ప్రధాని మోదీ, పోప్‌ ఫ్రాన్సిస్‌ల భేటీ చరిత్రలో నిలిచిపోతుందని భాజపా జాతీయాధ్యక్షుడు జె.పి.నడ్డా పేర్కొన్నారు. శాంతి, సామరస్యతల దిశగా ఇదో పెద్ద అడుగు అని ట్వీట్‌ చేశారు. పోప్‌తో భేటీ అయి ఆయన్ని భారత్‌కు రావాల్సిందిగా మోదీ ఆహ్వానించడం గొప్ప పరిణామంగా కేరళ కేథలిక్‌ బిషప్‌ల మండలి పేర్కొంది. దీనిద్వారా ప్రపంచంలో భారత్‌ ప్రతిష్ఠ మరింత ఇనుమడిస్తుందని తెలిపింది.

 


Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని