Updated : 10/11/2021 05:33 IST

TRS: ధాన్యం సేకరణలో కేంద్రం ఘోరవైఫల్యం

భాజపా ఎదురుదాడి సిగ్గుచేటు

దమ్ముంటే కిషన్‌రెడ్డి వడ్లు కొనిపించాలి

మంత్రులు నిరంజన్‌రెడ్డి, గంగుల

విలేకరుల సమావేశంలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్‌

ఈనాడు, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో ధాన్యం సేకరణలో ఘోరవైఫల్యం చెందిందని, పరిష్కారం చూపమంటే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి,  తదితరులు ఎదురుదాడి చేయడం సిగ్గుచేటని రాష్ట్ర వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి ధ్వజమెత్తారు.  రైతులకు మెడమీద కత్తి పెట్టింది కేంద్ర ప్రభుత్వమేనన్నారు. భాజపా నేతలే దేశంలో అందరినీ బెదిరిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రైతుల యాసంగి వడ్లు కొంటారా? కొనరా? కేంద్రమంత్రిగా, తెలంగాణ వాసిగా కిషన్‌రెడ్డి సమాధానం చెప్పాలి. లేదా కేంద్ర ప్రభుత్వ వైఖరిని రాష్ట్ర రైతులకు నేరుగా, వివరంగా తెలియజేయాలన్నారు. కాని పక్షంలో తమ అసమర్థతను ఒప్పుకొని, భవిష్యత్‌ పరిణామాలకు బాధ్యత వహించాలన్నారు.ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రతి ధాన్యం గింజ కొనేవరకు కేంద్ర ప్రభుత్వాన్ని, భాజపాను వదలబోమని పౌరసరఫరాల మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు మాని కేంద్రం వరి కొనేలా ఒప్పించాలని సూచించారు. ఆయనకు రైతుల మీద ప్రేమ ఉంటే తాము ధాన్యం సేకరణ కోసం చేపడుతున్న ధర్నాలో పాల్గొనాలన్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న బండి సంజయ్‌ను అదుపులో పెట్టాలన్నారు. మంగళవారం తెలంగాణభవన్‌లో నిరంజన్‌రెడ్డి, కమలాకర్‌లు విలేకరులతో మాట్లాడారు. ‘‘మూడురోజులుగా సీఎం కేసీఆర్‌, రాష్ట్రమంత్రులుగా తాము రైతుల సమస్యలపై ఆందోళనతో కేంద్రం ధాన్యాన్ని సేకరించాలని డిమాండు చేస్తుంటే... దానికి జవాబు చెప్పకుండా  కేంద్రాన్ని బెదిరిస్తున్నారంటూ కిషన్‌రెడ్డి  సమస్యను పక్కదారి పట్టించడం ఆశ్చర్యకరం. ఏడేళ్లుగా కేసీఆర్‌ను, తెలంగాణ ప్రభుత్వాన్ని అడ్డగోలుగా, సంస్కారహీనంగా నిందించింది భాజపా నేతలు, ఎంపీలే. ఈ విషయం దేశమంతా తెలుసు. భాజపా ఎంపీ సుబ్రమణ్యస్వామి స్వయంగా పలుమార్లు ట్విటర్లో, మీడియాలో భాజపా ప్రభుత్వవైఖరిని వివరిస్తున్నారు. యాసంగి వడ్ల సేకరణ విషయంలో కేంద్రానికి స్పష్టత లేదు. ఉప్పుడు బియ్యాన్ని (బాయిల్డ్‌ రైస్‌) గతంలో కేంద్రమే ప్రోత్సహించింది. అందువల్లే దేశంలో ఇన్ని మిల్లులు ఏర్పడ్డాయి. ఇప్పుడు పూర్తిగా చేతులెత్తేసింది.

పంజాబ్‌ మాదిరిగా ఎందుకు కొనరు?

పంజాబ్‌ మాదిరిగా తెలంగాణ వడ్లను కేంద్రం ఎందుకు కొనదు?దశాబ్దాల హరితవిప్లవం, కేంద్రం సహకారం వల్ల పంజాబ్‌లో వరి ఉత్పత్తి పెరిగింది.అలాంటి కేంద్ర ప్రోత్సాహం లేకుండానే వరిలో అగ్రస్థానానికి తెలంగాణ ఎదిగింది. ధాన్యం సొమ్మును రైతులకు మేం వారం రోజుల్లోనే చెల్లిస్తుంటే.. కేంద్రం మాత్రం రాష్ట్రానికి 6 నెలల తర్వాత ఇస్తోంది. ఈ తాత్సారంతో జరిగే నష్టం, వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. దానిని భరించాలని కేంద్రాన్ని కోరినా చలనం లేదు.దేశంలో మూడు లక్షల కోట్ల టన్నుల బియ్యం వృథాగా ఉన్నాయని, వరి వద్దు రైతులను ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్లించాలని కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ అంటున్నారు. మరోవైపు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వరి ధాన్యం పండించాలని కేంద్రం వైఖరికి విరుద్ధంగా చెబుతున్నారు.ఇన్నాళ్లూ కేంద్రం ఉప్పుడు బియ్యాన్ని తీసుకుంది. ఇప్పుడు ఎందుకు తీసుకోలేమంటున్నారు? ఒకవేళ ఉప్పుడు బియ్యం తినే వాళ్లు దేశంలో తగ్గిపోతున్నారంటే.. అందుకు పరిష్కారం చూపెట్టాలి కదా? అలా చెప్పకుండా మధ్యలోనే చేతులెత్తేస్తే ఎలా?’’ అని నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. ‘‘మంత్రి కేటీఆర్‌తో కలిసి గత సెప్టెంబరులో దిల్లీకి వెళ్లి తెలంగాణ వడ్లు కొనాలని కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ను కోరా.. ఇప్పటికే నిల్వలు మురిగిపోతున్నాయని, కొననే కొనం అన్నారు. ఎంత కోరినా పట్టించుకోలేదు. పంట మార్చండి అని ఉచిత సలహాలు ఇచ్చారు. అప్పుడే కిషన్‌రెడ్డి, సంజయ్‌లు ఈ విషయం మీద స్పందించాలని, కేంద్రాన్ని ఒప్పించాలని కోరితే నోరు తెరవలేదు. ఈ రోజు రైతులను రెచ్చగొడుతున్నారు’’ అని గంగుల తెలిపారు.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని