Updated : 21/11/2021 04:43 IST

AP Rains: ఏపీని ముంచెత్తిన వరద

నాలుగు జిల్లాలు అతలాకుతలం
అనంతపురం జిల్లా కదిరిలో భవనం కూలి ఆరుగురి మృతి
తిరుపతి ఇంకా జలదిగ్బంధంలోనే

అనంతపురం జిల్లా కదిరిలో వర్షాలకు భవనం కూలి ఆరుగురు దుర్మరణంపాలైన ఘటనలో శిథిలాల కింద చిన్నారి యషిక మృతదేహం

ఈనాడు-అమరావతి: వాయుగుండం దెబ్బకు ఆంధ్రప్రదేశ్‌లోని కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి. ప్రాణ, ఆస్తి నష్టాలతో పలు ప్రాంతాలవారు క్షణమొక యుగంలా గడుపుతున్నారు. అనంతపురం జిల్లా కదిరిలో భవనం కూలి ఆరుగురు మృతి చెందారు. ఇందులో ముగ్గురు చిన్నారులు. వాయుగుండం వల్ల మొత్తంగా వర్షాల వల్ల వివిధ సంఘటనల్లో 24 మంది మృత్యువాత పడ్డారు. 17 మంది గల్లంతయ్యారు. భారీ నుంచి అతి భారీ వర్షాల వల్ల ప్రభుత్వ లెక్కల ప్రకారమే 1,316 గ్రామాలు భయం గుప్పిట్లోకి చేరాయి. ప్రాథమిక అంచనా ప్రకారం 6.33 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మొత్తం 17 జాతీయ, రాష్ట్ర విపత్తు సహాయ దళాలు సహాయ చర్యలు చేపట్టాయి. రెండు హెలికాప్టర్లను రంగంలోకి దించారు. నెల్లూరు జిల్లా కోవూరు మండలం సాలుచింతల వద్ద సినిమా చిత్రీకరణ చేస్తుండగా వరద ఉద్ధృతిలో చిక్కుకున్న హీరో నందమూరి తారకరత్న, సినీ బృందాన్ని రెండుబోట్ల సాయంతో రక్షించారు.  వాతావరణం అనుకూలించడంతో శనివారం ఉదయం రెండు ఘాట్‌ రోడ్లలో తిరుమలకు వాహనాలను అనుమతించారు. ఉదయం 6గంటల నుంచి రాత్రి 10గంటల వరకు రాకపోకలు సాగించాయి. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే అలిపిరి, శ్రీవారి మెట్టు నడకమార్గాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. 

చిత్తూరు జిల్లా చెన్నరాయునిపల్లె వద్ద కోతకు గురైన చేలూరు రోడ్డు

దర్శన టికెట్లు కలిగిన భక్తులకు వర్షాలు తగ్గాక అనుమతి: తితిదే
భారీ వర్షాలకు తితిదేకు రూ.4కోట్లకుపైగా నష్టం వాటిల్లిందని తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ‘తితిదే అధికారులు కొండచరియలను తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. తిరుపతిలో ఆగిపోయిన భక్తులకు శ్రీనివాసం, మాధవం, రెండు, మూడో సత్రాల్లో బస, ఆహారం ఏర్పాటు చేశాం. టికెట్లు ఉండి దర్శనానికి రాలేకపోయిన భక్తులను వర్షాలు తగ్గాక అనుమతించాలని నిర్ణయించాం.’ అని ఆయన వివరించారు. 

ఏపీ సీఎం జగన్‌ ఏరియల్‌ సర్వే
వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం శనివారం ఏరియల్‌ సర్వే నిర్వహించారు. భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమవుతున్న కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలను మంత్రులు సుచరిత, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి హెలికాప్టర్‌లో పరిశీలించారు. తిరుపతి నగరంలో ముంపు ప్రాంతాలను విహంగ వీక్షణం చేశారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇక్కడ అధికారులు, ప్రజాప్రతినిధులతో కొంత సమయం చర్చించారు. . తిరుమల పరిస్థితులపై సీఎం ఆరా తీశారు.

 

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని