Updated : 09/12/2021 05:25 IST

Azadi Ka Amrit Mahotsav: మూతులు ముడిచినా ముహూర్తం ఆగలేదు

రాజ్యాంగ సభ ముద్ర

1946 నాటికే బ్రిటన్‌ నుంచి స్వాతంత్య్రపు సూచనలు కనిపిస్తున్నా అడుగడుగునా అపశకునాలే... ఎవరో ఒకరి అడ్డుపుల్లలే! అత్యంత కీలకమైన రాజ్యాంగ రచన చేసే సమయానికి సంస్థానాధీశులు, ముస్లింలీగ్‌ నేతలు మూతి ముడిచారు. వారి బహిష్కరణ మధ్యే... 1946లో సరిగ్గా ఇదే రోజు (డిసెంబరు 9) స్వతంత్ర భారత రాజ్యాంగ రచన శ్రీకారం చుట్టుకుంది.
ఎవరో కొంతమంది నేతలో, కాంగ్రెస్‌ పార్టీ నియమించిన కమిటీనో భారత రాజ్యాంగాన్ని రచించ లేదు. దేశంలోని (ఇప్పటి పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ సహా) అన్ని ప్రాంతాలు, మతాలు, కులాలు, వర్గాలకు భాగస్వామ్యం కల్పిస్తూ... ప్రజాస్వామ్య బద్ధంగా ఎంపికైన ప్రతినిధులతో ఏర్పాటైంది భారత రాజ్యాంగ సభ. 1946 బ్రిటిష్‌ క్యాబినెట్‌ మిషన్‌ ప్లాన్‌ ఆధారంగా.... భారత రాజ్యాంగ సభకు తొలిసారి ఎన్నికలు జరిగాయి. అప్పటికే వివిధ రాష్ట్రాల్లో కొలువు దీరిన అసెంబ్లీల్లోని సభ్యుల ఓట్ల ఆధారంగా రాజ్యాంగ సభ ప్రతినిధులను ఎన్నుకున్నారు.
రాజ్యాంగ సభలో మొత్తం సభ్యుల సంఖ్య 389. వీరిలో 292 మంది రాష్ట్రాల ప్రతినిధులు. 93 మంది సంస్థానాధీశుల ప్రతినిధులు. నలుగురు చీఫ్‌ కమిషనర్‌ పాలనలోని దిల్లీ, అజ్మీర్‌-మెర్వారా, కూర్గ్‌, బలూచిస్థాన్‌లకు చెందినవారు. రాష్ట్రాల ప్రతినిధుల ఎంపిక 1946 ఆగస్టుకల్లా పూర్తయింది. కాంగ్రెస్‌ నుంచి 208 మంది; ముస్లిం లీగ్‌ నుంచి 73 మంది ఎంపికయ్యారు. వీరందరిలో 15 మంది మహిళలు కూడా ఉన్నారు.

అలకలు.. అసంతృప్తులు..
1946 డిసెంబరు 9న రాజ్యాంగ హాల్‌ (ప్రస్తుత పార్లమెంటులోని సెంట్రల్‌హాల్‌)లో చరిత్రాత్మక రాజ్యాంగ సభ తొలి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇంతలో సంస్థానాధీశులు సహకరించటానికి నిరాకరించారు. భారత స్వాతంత్య్ర ప్రక్రియలో తమ ప్రయోజనాలను పట్టించుకోవటం లేదని... తమను సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారనేది వారి అలకకు కారణం. ఇక ఆది నుంచీ బ్రిటిష్‌ ఆడించినట్లు ఆడుతూ వచ్చిన ముస్లింలీగ్‌ పాకిస్థాన్‌ ఏర్పాటును డిమాండ్‌ చేస్తూ... తమకు ప్రత్యేక రాజ్యాంగ సభ ఏర్పాటు చేయాలంటూ తొలి సమావేశాన్ని బహిష్కరించింది. మరోవైపు... బ్రిటన్‌లోనూ చర్చిల్‌లాంటివారు రాజ్యాంగ సభ కూర్పుపై ‘హిందువుల సభ’ అంటూ విమర్శలు గుప్పించటం ఆరంభించారు. దీంతో... రాజ్యాంగ సభ ముందుకు సాగుతుందా అనే అనుమానాలు ఆరంభమయ్యాయి. కానీ... జాతీయోద్యమ నేతలు ఎవరేమనుకున్నా... ముందుకే వెళ్లాలని నిర్ణయించారు.

డిసెంబరు 9నాటి తొలి భేటీకి 207 మంది హాజరయ్యారు. రాజ్యాంగ నిర్మాణం కోసం ఏర్పాటైన రాజ్యాంగ సభకు ఎలాంటి పక్షపాతం, దురుద్దేశాలుండవని డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ స్పష్టం చేశారు. తాత్కాలిక ఛైర్మన్‌ను ఎంపిక చేసుకోవటం... సభ్యులందరితో ప్రమాణ స్వీకారం.. ఈ రెండే ఎజెండాగా తొలి సమావేశం జరిగింది. అప్పటి కాంగ్రెస్‌ ప్రముఖ నేత సచ్చిదానంద సిన్హాను రాజ్యాంగ సభ తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. కార్యదర్శి హెచ్‌.వి.ఆర్‌. అయ్యంగార్‌ సభ్యులతో ప్రమాణం చేయించారు. తర్వాత డిసెంబరు 11న డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ను సభ అధ్యక్షుడిగా, కోల్‌కతా విశ్వవిద్యాలయం మాజీ కులపతి హరేంద్ర కుమార్‌ ముఖర్జీని ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఐసీఎస్‌ అధికారి బెనెగళ్‌ నరసింగరావును సలహాదారుగా నియమించారు. వివిధ కమిటీలను ఏర్పాటు చేశారు. రాజ్యాంగ రచన కమిటీ బాధ్యతలను అంబేడ్కర్‌కు అప్పగించారు. దేశ విభజన (పాకిస్థాన్‌ ఏర్పాటు) నిర్ణయమయ్యాక... ఈ సభను పునర్‌వ్యవస్థీకరించి... సభ్యుల సంఖ్యను 299కి కుదించారు. తొలుత అలిగిన సంస్థానాధీశుల ప్రతినిధులు కూడా తర్వాత మనసు మార్చుకున్నారు. మొత్తం 114 రోజుల పాటు ఈ ప్రతిష్ఠాత్మక రాజ్యాంగ సభ పని చేసింది. ‘‘డిసెంబరు 9... భారత చరిత్రలో నవశకానికి నాంది. భారతీయులం... మనదైన రాజ్యాంగాన్ని రాసుకోబోతున్నాం. స్వేచ్ఛాభారతావనికిది తొలి అడుగు...’’ అంటూ సభ సభ్యుడైన కెం.ఎం.మున్షీ వ్యాఖ్యానించారు.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని