Bandi Sanjay: సంజయ్‌ పర్యటనలో ఉద్రిక్తత

రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల పరిస్థితిని పరిశీలించడానికి భాజపా రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్‌ సోమవారం చేపట్టిన ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటన ఆద్యంతం ఉద్రిక్తంగా సాగింది. పలు ధాన్యం

Updated : 09 Aug 2022 12:06 IST

నల్గొండ, మిర్యాలగూడలలో రాళ్లు రువ్వుకున్న తెరాస, భాజపా కార్యకర్తలు
భాజపా రాష్ట్రాధ్యక్షుడి కాన్వాయ్‌పైనా దాడి, పలు వాహనాలు ధ్వంసం

నల్గొండ ఆర్జాలబావి కొనుగోలు కేంద్రంలో ధాన్యం పరిశీలిస్తున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

ఈనాడు, నల్గొండ- సూర్యాపేట గ్రామీణం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల పరిస్థితిని పరిశీలించడానికి భాజపా రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్‌ సోమవారం చేపట్టిన ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటన ఆద్యంతం ఉద్రిక్తంగా సాగింది. పలు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద తెరాస, భాజపా కార్యకర్తలు పరస్పరం రాళ్లు, కోడిగుడ్లతో దాడి చేసుకున్నారు. దీంతో ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. తొలుత నల్గొండ సమీపంలోని ఆర్జాలబావి ఐకేపీ కేంద్రాన్ని సందర్శించిన సంజయ్‌ అక్కడికి ధాన్యం తీసుకువచ్చిన రైతులతో మాట్లాడారు. ఆ సమయంలో అక్కడే ఉన్న తెరాస కార్యకర్తలు సంజయ్‌ గోబ్యాక్‌ అని నినాదాలు చేస్తూ నల్లజెండాలతో నిరసన తెలిపారు. ప్రతిగా తెరాస ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా భాజపా కార్యకర్తలు నినాదాలు చేశారు.
దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తెరాస కార్యకర్తలు కోడిగుడ్లు విసరడంతో భాజపా కార్యకర్తలు వారి పైకి దూసుకెళ్లేందుకు యత్నించారు. పోలీసులు అడ్డుకున్నా తోపులాటకు దిగడంతో ఐకేపీ కేంద్రంలోకి రైతులు తీసుకొచ్చిన ధాన్యం చెల్లాచెదురైంది. పలువురు రైతులు ఇరుపార్టీల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఉద్రిక్తతల మధ్యే సంజయ్‌ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. తర్వాత వేములపల్లి మండలం కుక్కడం వద్ద ఉన్న కేంద్రాన్ని పరిశీలించడానికి వెళ్లగా నార్కట్‌పల్లి- అద్దంకి రహదారిపై తెరాస కార్యకర్తలు కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. వెంటనే పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. శెట్టిపాలెం వద్ద ధాన్యాన్ని మిల్లులకు తీసుకువచ్చిన రైతులతో మాట్లాడటానికి వచ్చిన సంజయ్‌కు వ్యతిరేకంగా అక్కడే ఉన్న తెరాస శ్రేణులు నినాదాలు చేశాయి. దీంతో ఇరువర్గాలు రాళ్లు, కోడిగుడ్లతో దాడి చేసుకోగా.. ఓ టీవీ ఛానల్‌ విలేకరితో పాటు పలువురు తెరాస, భాజపా కార్యకర్తలకు గాయాలయ్యాయి. సూర్యాపేట జిల్లాకు వెళుతున్న సంజయ్‌ కాన్వాయ్‌పై మూసి బ్రిడ్జి వద్ద తెరాస శ్రేణులు రాళ్లతో దాడి చేయడంతో పలు వాహనాల అద్దాలు ధ్వం
సమయ్యాయి. రాళ్లతో దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కాన్వాయ్‌ను సూర్యాపేట జిల్లాలోకి అనుమతించారు.

నల్గొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెం వద్ద భాజపా, తెరాస వర్గీయుల ఘర్షణ.. అడ్డుకుంటున్న పోలీసులు

వాహనశ్రేణి దారి మళ్లింపు

శాంతిభద్రతల దృష్ట్యా సంజయ్‌ కాన్వాయ్‌ను సోమవారం రాత్రి 8 గంటలకు సూర్యాపేట మండలం తాళ్లఖమ్మంపహాడ్‌ వైపు దారి మళ్లించారు. తెరాస శ్రేణుల దాడి కారణంగా పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఈమేరకు చర్యలు చేపట్టారు. వాహనశ్రేణిని ఇమాంపేట మీదుగా జానారెడ్డి నగర్‌కు తరలించారు. రాత్రి 11 గంటలు దాటాక సంజయ్‌ సూర్యాపేటకు వెళ్లి భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు గృహంలో బస చేశారు. మరోవైపు సంజయ్‌ పర్యటనలో శాంతి భద్రతల సమస్య తలెత్తవచ్చని నిఘావర్గాలు హెచ్చరించినా నల్గొండ, సూర్యాపేట జిల్లాల పోలీసులు సరైన రీతిలో స్పందించలేదని తెరాస, భాజపా శ్రేణులు విమర్శిస్తున్నాయి. ఎస్పీలిద్దరూ స్పష్టమైన ఆదేశాలిచ్చినా రెండు జిల్లాల అధికారులు విఫలమయ్యారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

శెట్టిపాలెం వద్ద రాళ్ల దాడిలో గాయపడిన తెరాస కార్యకర్త


ఇరుపార్టీల నేతలపై కేసు నమోదు

నల్గొండ నేరవిభాగం, న్యూస్‌టుడే: నల్గొండలోని ఆర్జాలబావి ధాన్యం కొనుగోలు కేంద్రంలో సోమవారం చోటుచేసుకున్న భాజపా, తెరాస నేతలు, కార్యకర్తల దాడుల్లో ఇరు వర్గాలపై ఫిర్యాదులు వచ్చినట్లు రూరల్‌ ఎస్సై రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. కోడ్‌ ఉల్లంఘనపై స్థానిక ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు మేరకు సంజయ్‌తో పాటు ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు, నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, తెరాస నేతలు, కార్యకర్తలపై కేసు నమోదు చేశామన్నారు.


పోలీసుల సహకారంతోనే దాడులు: సంజయ్‌

పెన్‌పహాడ్‌, గన్‌ఫౌండ్రి- న్యూస్‌టుడే: పోలీసుల సహకారంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ తమపై దాడులు చేయిస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. పెన్‌పహాడ్‌ మండలం జానారెడ్డినగర్‌లో సోమవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు. రైతులు తిరగబడి దాడులకు పాల్పడతారనే ఇంటెలిజెన్స్‌ సమాచారం కేసీఆర్‌ వద్ద ఉందని, అందుకే అసహనంతో దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. తెరాస శ్రేణుల దాడిలో 8 వాహనాలు ధ్వంసమయ్యాయన్నారు. కేసీఆర్‌ తన పర్యటనను అడ్డుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. 60 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని తీసుకోవాలని కేంద్రం ఆదేశించినా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కొనకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. జనగామలో మంగళవారం పదాధికారుల అత్యవసర సమావేశం జరుగుతుందని, అక్కడ తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని సంజయ్‌ వెల్లడించారు. నల్గొండ ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ గజినీ వేషాలు వేస్తున్నారని విమర్శించారు. ప్రతి గింజా కొంటామని చెప్పి, ఇప్పుడు కేంద్రంపై ఆ నెపం వేస్తున్నారన్నారు. 2023లోగా ధాన్యం మద్దతు ధరను రెట్టింపు చేస్తామన్నారు.

హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత సీఎం కేసీఆర్‌, తెరాస నేతలు రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని, తమ పార్టీ నేతలకు రక్షణ కల్పించాలని భాజపా నేత ఎన్‌.రాంచందర్‌రావు డీజీపీ, పోలీసు యంత్రాంగాన్ని కోరారు.

నేరేడుచర్ల వద్ద రాళ్ల దాడిలో ధ్వంసమైన భాజపా కాన్వాయ్‌లోని కారు అద్దాలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని