British Rule: తల్లీకొడుకుల్ని విడదీశారు..కోహినూర్‌ను కొట్టేశారు

దాదాపు 200 ఏళ్లు భారతావనిని నిలువు దోపిడీ చేసిన ఆంగ్లేయులు దోచుకుపోయిన సంపదలో.. అత్యంత విలువైన కోహినూర్‌ వజ్రం కూడా ఉంది. ప్రస్తుతం బ్రిటిష్‌ రాణి కిరీటంలో ఒదిగిన ఈ వజ్రాన్ని అతి దారుణంగా కొట్టేశారు. తల్లీకొడుకులను వేరు చేసి...

Updated : 17 Jan 2022 05:26 IST

దాదాపు 200 ఏళ్లు భారతావనిని నిలువు దోపిడీ చేసిన ఆంగ్లేయులు దోచుకుపోయిన సంపదలో.. అత్యంత విలువైన కోహినూర్‌ వజ్రం కూడా ఉంది. ప్రస్తుతం బ్రిటిష్‌ రాణి కిరీటంలో ఒదిగిన ఈ వజ్రాన్ని అతి దారుణంగా కొట్టేశారు. తల్లీకొడుకులను వేరు చేసి... ముక్కుపచ్చలారని పిల్లవాడితో సంతకం చేయించుకొని ఈ వజ్రాన్ని కొల్లగొట్టారు.

బ్రెజిల్‌లో వజ్రాల గనులు బయటపడే దాకా... ప్రపంచానికి భారతే వజ్రాల ఖని! ఆ క్రమంలో గోల్కొండ ప్రాంతంలో కోహినూర్‌ వజ్రం వెలుగు చూసిందని అంటుంటారు. ఎలా చేరిందోగాని- ఖైబర్‌ కనుమ ద్వారా భారత్‌లో అడుగుపెట్టిన మొఘల్‌ చక్రవర్తుల చేతికి చిక్కిందిది. ఆ సమయంలో... సుసంపన్నమైన దిల్లీపై మధ్య ఆసియాలోని ఇతర పాలకులు.. ముఖ్యంగా పర్షియన్‌ చక్రవర్తి నాదిర్‌షా కన్ను పడింది. 1739లో దిల్లీపై దండెత్తిన నాదిర్‌ షా 700 ఏనుగులు, 4 వేల ఒంటెలు, 12 వేల గుర్రాలపై సంపదనంతా దోచుకుపోయాడు. వాటిలో కోహినూర్‌ కూడా ఉంది. తర్వాత ఈ వజ్ర రాజం కోసం అక్కడా అనేక యుద్ధాలు జరిగాయి. చివరికది... చేతులు మారుతూ 1813లో లాహోర్‌ రాజధానిగా పంజాబ్‌ను పాలించిన మహారాజా రంజిత్‌సింగ్‌ చేతికి చిక్కింది. మొదట్నుంచీ ఈ వజ్రంపై కన్నేసిన ఆంగ్లేయులు... రంజిత్‌సింగ్‌తో పెట్టుకోలేక వేచిచూశారు. అయితే రంజిత్‌సింగ్‌ తన మరణానంతరం దీన్ని మతగురువుకు ఇవ్వాలని భావించారంటారు. 1839లో ఆయన మరణించగానే.. ఆంగ్లేయులు.తమ పావులు కదపటం ఆరంభించారు. సిక్కు సామ్రాజ్యంతో పాటు కోహినూర్‌ను చేజిక్కించుకోవటానికి రెండు యుద్ధాలు చేశారు. అవే ఆంగ్లో-సిక్కు యుద్ధాలు. సిక్కుల్లోని కొంతమంది సామంత రాజులను తమవైపు లాక్కొని ఆంగ్లేయులు విజయం సాధించారు. చివరకు రంజిత్‌సింగ్‌ మూడో భార్య రాణి జిందన్‌ కౌర్‌, చిన్న పిల్లవాడైన కుమారుడు దులీప్‌సింగ్‌ మాత్రమే మిగిలారు. ఆంగ్లో-సిక్కు యుద్ధానంతరం 1849లో రాణి జిందన్‌ను ఖైదు చేసి జైలుకు పంపించి.. తల్లీకొడుకులను విడగొట్టారు. ఏమీ తెలియని బాలుడు దులీప్‌సింగ్‌తో లాహోర్‌ ఒప్పందం పేరిట సంతకాలు చేయించుకున్నారు. దులీప్‌ను పేరుకు రాజుగా పేర్కొంటూ.. అందుకు ప్రతిగా కోహినూర్‌తోపాటు వారి ఆస్తిపాస్తులన్నీ విక్టోరియా మహారాణికి సమర్పిస్తున్నట్లు రాయించుకున్నారు. వజ్రరాజాన్ని తీసేసుకున్నారు. గవర్నర్‌ జనరల్‌ డల్హౌసీ దాన్ని రాణి విక్టోరియాకు సమర్పించారు. అప్పట్నుంచి అది బ్రిటిష్‌ రాణి ఆభరణాల్లో ఒకటైంది. 1851లో లండన్‌లో దీన్ని ప్రత్యేకంగా ప్రదర్శనకు ఉంచితే... లండన్‌వాసులంతా ఎగబడి వచ్చి చూశారు. దూరం నుంచి దీన్ని చూసి... ‘ఏముందిది? గాజులా ఉందే’ అంటూ పెదవి విరిచారు. దీంతో- చక్రవర్తి అలర్ట్‌, రాణి విక్టోరియాలు దానికి నగిషీలద్ది పరిమాణం తగ్గించారు.

మతమూ మార్చి..!

రంజిత్‌సింగ్‌, జిందన్‌కౌర్‌లకు 1838లో జన్మించారు దులీప్‌సింగ్‌. ఐదేళ్ల వయసులోనే 1843లో మహారాజుగా పంజాబ్‌ పీఠమెక్కారు. తల్లి జిందన్‌ ఆయన పేరిట రాజ్యపాలన సాగించారు. ఆంగ్లో-సిక్కు యుద్ధంలో ఓడిపోయాక వీరిద్దరినీ ఆంగ్లేయులు వేరుచేశారు. కొన్నేళ్లు తమ ప్రత్యేక సంరక్షణలో భారత్‌లోనే దులీప్‌సింగ్‌ను పెంచారు. అనుమతి లేకుండా ఎవరూ ఆయన్ను కలవకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. భారతీయ మూలాలు మరిచేలా... ఆంగ్లేయుడిలా పెంచారు. మతం కూడా మార్చారు. 1854లో లండన్‌కు తరలించారు. అక్కడ రాణి విక్టోరియా కనుసన్నల్లో పూర్తిగా ఆంగ్లేయుడిలా పెరిగారు దులీప్‌సింగ్‌. కొన్నాళ్ల తర్వాత తన తల్లిని కలవాలనే కోరికతో ఆమెకు లేఖలు రాసి పంపించినా వాటిని ఆంగ్లేయులు చేరనివ్వలేదు. చివరకు జిందన్‌తో తమకెలాంటి ప్రమాదం లేదని నిర్ధారించుకున్నాక 1861లో వారిద్దరినీ కోల్‌కతాలోని ఓ హోటల్‌లో కలవనిచ్చారు. తమకు నమ్మిన బంటుగా ఉంటున్నందుకుగాను దులీప్‌కు ఏటా 25 వేల పౌండ్ల పింఛను మంజూరు చేశారు. తల్లిని కూడా ఆయనతో పాటు బ్రిటన్‌కు తరలించారు. ఆ సమయంలోనే తల్లి ప్రభావంతో దులీప్‌ మళ్లీ సిక్కుగా మారారు.


1886లో భారత్‌కు తిరిగి రావాలని దులీప్‌సింగ్‌ ప్రయత్నించినా బ్రిటిష్‌ ప్రభుత్వం అనుమతించలేదు. అయినా మొండిగా భారత్‌కు బయల్దేరగా... యెమెన్‌ రాజధాని ఏడెన్‌ వద్ద ఆయన్ను అరెస్టు చేశారు. తర్వాత ఐరోపాకు తిరిగి వెళ్లేలా ఒత్తిడి చేశారు. చివరకు పారిస్‌ వెళ్లిన ఆయన.. 1893లో అక్కడే  మరణించారు. తన పార్థివదేహాన్ని భారత్‌లో దహనం చేయాలన్న ఆయన చివరి కోరికను కూడా గౌరవించలేదు. భారత్‌కు తీసుకెళ్తే గొడవలవుతాయనే భయంతో... లండన్‌కు తరలించి అక్కడే క్రైస్తవ లాంఛనాలతో అంత్యక్రియలు ముగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని