CM KCR: ధాన్యం కొనుగోళ్లపై తేల్చుకుందాం

ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏమిటో తెలుసుకోవాలని, ఈ విషయం తేల్చుకున్న తర్వాత ఇతర అంశాలపై దృష్టి పెడదామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నట్లు తెలిసింది.

Updated : 23 Nov 2021 04:52 IST

కేంద్రం వైఖరి ఏమిటో తెలుసుకుందాం

ప్రాజెక్టుల అనుమతులపై స్పష్టత కోరదాం

మంత్రులు, ఎంపీలతో ముఖ్యమంత్రి కేసీఆర్‌

నేడు పీయూష్‌ గోయల్‌ను కలవనున్న మంత్రులు

ఈనాడు, దిల్లీ: ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏమిటో తెలుసుకోవాలని, ఈ విషయం తేల్చుకున్న తర్వాత ఇతర అంశాలపై దృష్టి పెడదామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నట్లు తెలిసింది. దిల్లీలోని తన నివాసంలో మంత్రులు, ఎంపీలతో సోమవారం ఆయన సమావేశమయ్యారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ‘‘ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో భాజపా పరస్పరం భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో ఏర్పడిన గందరగోళంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ విషయంలో తొలుత ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ను రాష్ట్ర మంత్రులు కలవాలి. విషయాన్ని సమగ్రంగా వివరించాలి. మంత్రి స్పందన తర్వాత ఏం చేయాలో నిర్ణయిద్దాం’’ అని ముఖ్యమంత్రి అన్నట్లు తెలిసింది. ఈ అంశంతో పాటు పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు, సీతారామ, ఇతర ప్రాజెక్టులకు వివిధ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న అనుమతుల విషయమై జల్‌శక్తి, పర్యావరణ శాఖల అధికారులను కలిసి.. వాటిని సాధించేందుకు ప్రయత్నించాలని ఎంపీలకు ఆయన సూచించారు.

ఆయా శాఖల అధికారులను కలిసి.. వారు లేవనెత్తే సందేహాలను నివృత్తి చేయాలని సీఎం సూచించారు. ఇందులో భాగంగా మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు పీయూష్‌ గోయల్‌ను మంత్రులు కేటీఆర్‌, గంగుల కమలాకర్‌, లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు, ఎంపీలు కలవనున్నారు. ముఖ్యమంత్రితో సమావేశంలో మంత్రులు కేటీఆర్‌, గంగుల, నిరంజన్‌రెడ్డి, తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు, నామా నాగేశ్వరరావు, లోక్‌సభ పక్ష ఉప నేత కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎంపీలు గడ్డం రంజిత్‌రెడ్డి, కవిత, బి.బి.పాటిల్‌, పసునూరి దయాకర్‌, మన్నె శ్రీనివాసరెడ్డి, రాజ్యసభ సభ్యుడు సురేశ్‌రెడ్డి పాల్గొన్నారు.

* తెలంగాణ నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శి సుధాంశు పాండేకు రాష్ట్ర అధికారులు విజ్ఞప్తి చేశారు. పాండేను కృషి భవన్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు సోమవారం మధ్యాహ్నం కలిశారు. రాష్ట్రంలో పెద్ద మొత్తంలో దిగుబడి రావడం, రైతుల ఇబ్బందులను వారు వివరించినట్లు తెలిసింది.

కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శి సుధాంశు పాండేతో సమావేశమైన సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, ఇతర అధికారులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని